Suryaa.co.in

Andhra Pradesh National

ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు సహకరించండి

• జల్ జీవన్ మిషన్ కార్యక్రమ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేస్తాము
• కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం

ఢిల్లీ: జల జీవన్‌ మిషన్‌ (జె.జె.ఎం.) యొక్క నిజమైన స్ఫూర్తిని సాధించాలంటే… బోరు బావులపై ఎక్కువగా ఆధారపడకుండా.. దీర్ఘకాలిక, నిలకడతో ఉన్న వనరుల నుంచి నీటిని సేకరించడం చాలా కీలకం. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

మంగళవారం ఢిల్లీలోని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జె.జె.ఎం. అమలుపై చర్చించారు. ‘2019-2024 మధ్య అందించిన కనెక్షన్లలో కుళాయిల సామర్ధ్యం, నీటి నాణ్యత అంశంలో ఇటీవల చేసిన సర్వే ద్వారా పలు సమస్యలను గుర్తించామ’ని కేంద్ర మంత్రికి తెలిపారు.

సర్వే ఫలితాల ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు ట్యాప్‌ కనెక్షన్లు అందలేదనీ, అలాగే 2.27 లక్షల పంపులు పని చేయడం లేదని. మరో 0.24 లక్షల ట్యాపులు అవసరమైన స్థాయిలో నీటిని సరపరాచేయడం లేదని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నీటి సరఫరా, తగినంత మేర సరఫరా (ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్లు), నాణ్యమైన నీటిని అందించాలన్న లక్ష్యాలను ఇంకా సాధించలేదని సర్వే ద్వారా తేలిందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం జె.జె.ఎం. స్ఫూర్తిని, లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరమని సి.ఆర్.పాటిల్ ని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. ‘ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ గృహాలకు సురక్షితమైన.. తాగునీటిని సజావుగా అందించేందుకు అవసరమైన నిధులను సమకూర్చడంలో కేంద్రం సానుకూలంగా సహకరించాల’ని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. జె.జె.ఎం. పథకం లక్ష్యం పూర్తి స్థాయిలో అమలుచేయడం ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది గ్రామీణ ప్రజలకి నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించగలమని వివరించారు.

LEAVE A RESPONSE