మనకు పగలు, రాత్రి అనేవి సహజం. సూర్యుడితోపాటే మన మనుగడ సాగేది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడాన్ని బట్టే మన జీవన చక్రం తిరుగుతుంది. పగలు పని చేసుకోవడం, చీకటి పడగానే నిద్రలోకి జారుకోవడం. మరి సూర్యుడు అసలు అస్తమించకపోతే ఏం జరుగుతుంది? అసలు అలా జరగడం సాధ్యమేనా? భూమిపై అలాంటి ప్రాంతాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. భూమిపైని ఈ ఆరు ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు సూర్యుడు అసలు అస్తమించడు. ఆ ప్రాంతాలేవో చూడండి.
నార్వే
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా నార్వేకు పేరుంది. ఆర్కిటిక్ సర్కిల్ లోపల ఉండే ఈ దేశంలో మే నుంచి జులై మధ్య 76 రోజుల పాటు అసలు సూర్యుడి అస్తమించడు. నార్వేలోనే ఉన్న స్వాల్‌బార్డ్‌లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్ట్ 23 వరకూ ప్రతి రోజూ 24 గంటల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే కనిపిస్తాడు.
నునావట్, కెనడా
కెనడాలోని చిన్న నగరం నునావట్. ఇక్కడ రెండు నెలల పాటు సూర్యుడు అసలు అస్తమించడు. అదే సమయంలో శీతాకాలంలో మాత్రం ఈ ప్రాంతం 30 రోజుల పాటు పూర్తిగా చీకట్లోనే ఉంటుంది.
ఐర్లాండ్
యూరప్‌లో గ్రేట్ బ్రిటన్ తర్వాత అతి పెద్ద ద్వీపమైన ఐర్లాండ్‌లో జూన్ నెల మొత్తం సూర్యుడు అస్తమించడు. ఆ నెల రోజులూ ఇక్కడి వాళ్లకు రాత్రి, పగలు అన్న తేడా ఉండదు.
బారో, అలస్కా
అమెరికా రాష్ట్రమైన అలస్కాలోని బారోలో మే నెల చివరి నుంచి జులై చివరి వరకూ సూర్యుడు అస్తమించడు. ఇక నవంబర్ మొదటి నుంచి నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో అసలు సూర్యుడు ఉదయించడు. అంటే పూర్తి చీకటిగా ఉంటుంది. దీనినే పోలార్ నైట్ అని పిలుస్తారు. ప్రపంచంలోని అందమైన గ్లేసియర్లకు ఈ ప్రాంతం నెలవైనది.
ఫిన్లాండ్
అందమైన సరస్సులు, ద్వీపాలకు పెట్టింది పేరైన ఈ దేశంలో ఏడాదికి 73 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. వేసవికాలంలో ఈ వింతను మీరు ఆస్వాదించవచ్చు.
స్వీడన్
ఈ దేశంలో అత్యధికంగా సూర్యుడు ఆరు నెలల పాటు ఏకధాటిగా ప్రకాశిస్తూ కనిపిస్తాడు. మే నుంచి ఆగస్ట్ మధ్యలో అర్ధరాత్రి అస్తమించి, మళ్లీ ఉదయం 4.30 గంటల సమయంలోనే ఉదయిస్తాడు.