హైదరాబాద్: పోటీ పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల ఇబ్బందేంటని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్- ప్రిలిమ్స్ రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో మంగళవారం విచారణ జరిగింది.
టీఎస్‌పీఎస్సీ వేసిన అప్పీల్‌పై విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల ఇబ్బందేంటని టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించింది హైకోర్టు. గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయడం లేదు? అని టీఎస్‌పీఎస్సీని నిలదీసింది.
మీ నోటిఫికేషన్ మీరే అమలు చేయకపోతే ఎలా? ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణను మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది.
ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదే పదే టీఎస్ పీఎస్సీ విఫలమవుతోందని పేర్కొంది. రెండోసారి నిర్వహించిన గ్రూప్1 పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని ప్రశ్నించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు
కాగా, ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు.. తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం గతేడాది టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి.. అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడంతో పాటు ఫలితాలనూ వెల్లడించింది.
అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం లీకైనట్లు దర్యాప్తులో తేలడంతో అక్టోబరు 16 నాటి పరీక్షను రద్దు చేసి.. జూన్ 11న తిరిగి నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో 2 లక్షల 33 వేల 506 మంది ప్రిలిమ్స్ రాశారు. ప్రాథమిక కీ విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లనూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.