టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఎనిమిదవ నిజాం ముక్రం జా బహదూర్ మృతి పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు మక్రమ్ జా బహదూర్ వయస్సు 90 సంవత్సరాలు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయనను తన వారసుడిగా నియమించారు.
1967లో ఆయన మరణానంతరం ముక్రం జా బహదూర్ సింహాసనోత్సవం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిందనీ ,మక్రం జా బహదూర్ చాలా కాలంగా ఇస్తాంబుల్‌లో ఉన్నారని హోం మంత్రి తెలిపారు.మక్రం జా బహదూర్ తాత నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కాలంలోని ఆదర్శప్రాయమైన లౌకిక వాది అని, తన ప్రాణం కంటే తన ప్రజలను ఎక్కువగా అభిమానిస్తుండేవారని మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.
హిందువులు, ముస్లింలు నా రెండు కళ్లు అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారనీ, ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు, రైల్వే లైన్ ఏర్పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, ఆసుపత్రుల ఏర్పాటు వంటి ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారన్నారు. శోక సమయంలొ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు హోంమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవాబ్ మక్రం జా బహదూర్ కోరిక మేరకు ఆయన పూర్వీకులను ఖననం చేసిన మక్కా మసీదులో అతని ఖననం నిర్వహిస్తామని హోం మంత్రి తెలిపారు.