Home » గంగిరెడ్డి బెయిల్ రద్దు పై తీర్పు చెప్పకనే చెప్పిన సుప్రీంకోర్టు

గంగిరెడ్డి బెయిల్ రద్దు పై తీర్పు చెప్పకనే చెప్పిన సుప్రీంకోర్టు

-వైఎస్ వివేకా హత్య కేసు త్వరగా తేలితే… మా పార్టీ కూడా తేలిపోతుందేమో?
-కోడి కత్తి కేసులో శ్రీనివాస్ కు నాలుగేళ్లయిన బెయిల్ రాకపోవడం దురదృష్టకరం
-పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడిని తీవ్రతరం చేసిన మా పార్టీ నేతలు
-అభిమానులను పవన్ కు దూరం చేసేందుకు కుట్ర చేస్తోన్న నీలి చానల్స్
-రాష్ట్రంలోని ఒక సామాజిక వర్గాన్ని విభజించేందుకు కుట్రలు
-ప్రజల కోసమే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పోరాటం
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ప్రజల కష్టాలను తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏకమై , ప్రజల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు . ప్రజలే కాదు… తాము పడుతున్న కష్టాలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. మనల్నే ఇంతగా కష్టపడుతున్న ఈ ప్రభుత్వంలో, ప్రజల పరిస్థితి ఏమిటని ఆలోచించి, ప్రజల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈనెల 12వ తేదీన రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభ అనంతరం పవన్ కళ్యాణ్ పై తమ పార్టీ నాయకుల విమర్శల దాడి తీవ్రతరం చేశారన్నారు . గతంలో పవన్ కళ్యాణ్ పై తమ పార్టీ నాయకులు ఏడ్చేవారని, ఇప్పుడు పెడ బొబ్బలు పెడుతున్నారని విమర్శించారు. ఇక నీలి చానల్స్ లో పవన్ కళ్యాణ్ ను పొగిడినట్టే పొగిడి, తెగడుతున్నారన్నారని మండిపడ్డారు. పవన్ అభిమానులకు గుచ్చుకునే విధంగా, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ధారణ పొందుతున్న ఈ సమయంలో నిలకడైన నిర్ణయాలు తీసుకోకుండా పవన్ తప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నారని నీలి చానల్స్ వక్ర భాష్యాలు చెబుతున్నాయని రఘురామకృష్ణం రాజు విరుచుక పడ్డారు.

అధికారంలోకి రావాలంటే… ఈ ప్రభుత్వాన్ని దించక తప్పదు
పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలి అంటే, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దించాల్సిందేనని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అధికారంలోకి రావడానికి తన ఒక్కడి బలం సరిపోదని పవన్ కళ్యాణ్ భావించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లు ఏకమైతే ప్రజలని రక్షించుకోగలమన్నదే ఆయన ఉద్దేశం. పవన్ తీసుకున్న నిర్ణయంతో తమ పార్టీ నాయకులు విపరీతంగా బాధపడిపోతున్నారు. పవన్ కు ఆయన అభిమానులను దూరం చేయడానికి కుట్ర చేస్తున్నారు. సముద్రం నుంచి ఉప్పు తీయడం ఎంత కష్టమో… సముద్రంనీటిలో ఉప్పులాగ కలిసిపోయిన పవన్ అభిమానులను ఆయన నుండి దూరం చేయడం అంతే కష్టం. ఇప్పటికైనా తమ పార్టీ నాయకులు పొగడ్తల రూపంలోని తెగడ్తలను మానుకోవాలి . ఒక సామాజిక వర్గానికి మాత్రమే పవన్ కళ్యాణ్ నాయకుడనే విధంగా తమ పార్టీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ను అభిమానించేవారు అన్ని కులాలు, వర్గాలలోనూ ఉన్నారు. ఒకే కులం వారు ఓటు వేస్తే, ఎవరు అధికారంలోకి రారనే విషయాన్ని తమ పార్టీ నాయకులు గుర్తించాలని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు.

పవన్ ను టార్గెట్ చేస్తోన్న కొత్త పార్టీ
ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా అడుగుపెట్టిన ఒక కొత్త పార్టీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు . తెలుగుదేశం పార్టీకి పవన్ చేరువ కాకుండా ఉండే విధంగా తమ పార్టీ నాయకులు ఒక జాతీయ పార్టీ ద్వారా కూడా తీవ్ర ప్రయత్నాలనే చేశారు. కానీ ప్రజల కోసమే తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

దుష్టుడితో స్నేహం మంచి వాడికి అంత మంచిదేమీ కాదు
దుష్టుడైన జగన్మోహన్ రెడ్డితో, మంచివాడైన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు స్నేహం అంత మంచిదేమీ కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్ తో, కెసిఆర్ కు మంచి సంబంధ బాంధవ్యాలే ఉండి ఉంటాయి. లేకపోతే నన్ను హైదరాబాద్ నుంచి అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ కు తరలించి ఉండేవారు కాదు. రెండవసారి కూడా నన్ను అరెస్టు చేయాలని రెక్కీ నిర్వహించారు. అయితే అదృష్టవశాత్తు తాను వారికి చిక్కలేదు. పవన్ కళ్యాణ్ కు దన్నుగా నిలుస్తున్నారని భావిస్తోన్న
రాష్ట్రంలోని ఒక ప్రముఖ సామాజిక వర్గాన్ని విభజించాలని తమ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. దానికి ప్రాంతీయ తత్వాన్ని వదిలి, జాతీయ దృక్పథంతో పార్టీని ప్రారంభించిన కెసిఆర్ వంటి మహా నాయకుడు తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించడం ఏమాత్రం సబబు కాదు. ఒక కులాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరిస్తే, దేశ వ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న ఆ పార్టీ ప్రయత్నాలు పురిటిలోనే గండి కొట్టే ప్రమాదం లేకపోలేదు. పదవీ విరమణ పొందిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారిని నియమించినందుకు, తమ సామాజిక వర్గాన్ని కెసిఆర్ ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన్ని కలిసి అభినందనలు తెలియజేయడం ఆశ్చర్యంగా ఉంది. శాంతి కుమారి సామాజిక వర్గం ఏమిటో, ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపులకు ఎంతో న్యాయం చేశారని, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆ పార్టీ నాయకులు మాట్లాడడం… జాతీయ దృక్పథంతో ఆవిర్భవించిన పార్టీకి చెందిన నాయకులు ఒక కులానికే పరిమితమై మాట్లాడడం బాధ కలిగిస్తోంది. కొన్ని చానళ్లు కాపులు, బలిజలకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా చర్చా కార్యక్రమాలను నిర్వహించడం విడ్డూరంగా ఉంది. ఇటువంటి దుష్ట రాజకీయాలను తిప్పికొట్టేందుకు అన్ని కులాలు ఐక్యం కావలసిన అవసరం ఉంది. వృత్తుల ఆధారంగా పూర్వము కులాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు అన్ని కులాల వారు, అన్ని వృత్తులను చేస్తున్నారు. అటువంటప్పుడు కుల ప్రస్తావన అన్నదే అనవసరం. నినాదాలకే పరిమితమైన కొన్ని చానల్స్, తమ పార్టీ నాయకులు కలిసి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ రద్దు…ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్
మార్చి, ఏప్రిల్ లో బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రద్దు చేసే అవకాశం ఉందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. జూలై, ఆగస్టు మాసాలలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కరోజు ఆదాయాన్ని కూడా తమ ప్రభుత్వ పెద్దలు వదులుకోరనే వాదన ఒకటి ఉన్నప్పటికీ, ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్నో, కొన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని… ఆ తరువాత అయితే ఆ అవకాశం కూడా ఉండదని మరొక వాదన లేకపోలేదు. ప్రతిపక్షాలు ఏకమై మరింత బలపడతాయని భయం తమ పార్టీ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ మరొక చార్జి షీట్ దాఖలు చేయనున్నదని, అందులో తమ పార్టీ నాయకుల పేర్లు కూడా ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి దినపత్రికలో గతం లో వచ్చిన వార్త కథనాలను, ఇంగ్లీకరించి జాతీయ దినపత్రికలో ప్రచురించే విధంగా ఎవరు చొరవ తీసుకున్నారో, ప్రజలందరికీ తెలుసు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు త్వరగా తేలితే, తమ పార్టీ కూడా తేలిపోతుందేమో నన్న సందేహం తమ పార్టీ నేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసును వాయిదా వేయించడం కష్టం. ఈ కేసును త్వరగా తేల్చాలని, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి గట్టిగా పట్టుపడుతోంది. సంవత్సరం వరకు ఈ కేసును లాగ తీయడం అనేది కష్టం. కాబట్టే, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది తమ పార్టీ నాయకత్వం ప్రణాళికగా కనిపిస్తోంది. మరొకసారి, తమ బాబాయిని చంద్రబాబు నాయుడు హత్య చేయించారని చెప్పుకునే వెసులుబాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

స్టాచ్యూరిటీ బెయిల్ రద్దు పై సుప్రీం కీలక తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో స్టాచ్యూరిటీ బెయిల్ పొందిన ఎర్ర గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలని సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందేనని రఘు రామ కృష్ణంరాజు గుర్తు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సి.బి.ఐ తొలుత హైకోర్టును ఆశ్రయించగా, స్టాచ్యూరిటీ బెయిల్ రద్దుకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. దీనితో సిబిఐ, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టాచ్యూరిటీ బెయిల్ లభించాక, దాన్ని రద్దు చేయమని అంటే ఇది ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతుంది. వ్యవస్థలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు 90 రోజులపాటు చార్జిషీట్ దాఖలు చేయకుండా అడ్డుకొని స్టాచ్యూరిటీ బెయిల్ పొందే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు… ఎర్ర గంగిరెడ్డి స్టాచ్యూరిటీ బెయిల్ రద్దు చేస్తున్నామని నేరుగా చెప్పకుండానే, రద్దు చేయాలని తీర్పు చెప్పకనే చెప్పింది. గతంలో ఏపీ పోలీసులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సమయంలో 90 రోజులపాటు చార్జిషీట్ దాఖలు చేయకపోవడం వల్లే ఎర్ర గంగిరెడ్డి కి స్టాచ్యూరిటీ బెయిల్ లభించింది. ఏపీ పోలీసులు మూడు నెలల పాటు చార్జిషీట్ దాఖలు చేయకపోవడానికి కారణాలేమిటో అందరికీ తెలిసిందే. తన తండ్రి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు, గంగిరెడ్డి స్టాచ్యూరిటీ బెయిల్ రద్దుకు ప్రయత్నాలను ప్రారంభించారు . సుప్రీం తీర్పుతో, రెండు మూడు నెలల వ్యవధిలో ఎర్ర గంగిరెడ్డి స్టాచ్యూరిటీ బెయిల్ రద్దవుతుందేమో చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.

పెద్ద మనసు చేసుకుని నిందితున్ని క్షమించిన ఎన్ టి రామారావు
హత్యలు చేసిన వారికి, శవాలను పార్సల్ చేసిన వారికి బెయిల్ లభిస్తోందని కానీ గత నాలుగేళ్లుగా కోడి కత్తి కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాసుకు మాత్రం బెయిల్ లభించకపోవడం దురదృష్టకరమని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితుడు. బాధితుడైన జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వకపోవడం సరికాదు. ఈ విషయమై న్యాయస్థానం గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పై మల్లెల బాబ్జి అనే వ్యక్తి కత్తితో దాడి చేయగా, ఎన్టీ రామారావు పెద్ద మనసు చేసుకొని, అతన్ని క్షమించి వదిలేయమని చెప్పారు… దానితో మల్లెల బాబ్జీని వదిలి వేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాసును క్షమించి వదిలేయాలి. ఇప్పటికే ఈ కేసు వల్ల మనకు రావలసిన అంత మైలేజీ వచ్చింది. తమ పార్టీ గెలుపుకు దోహదం చేసిన అంశాలలో ఈ కోడి కత్తి కేసు కూడా ఒకటి. తనంతట తాను గానే తమ పార్టీ గెలుపుకు శ్రీనివాస్ ఈ సీన్ లో నటించారనే వాదన ఒకటి వినిపిస్తున్నప్పటికీ, పది ఎకరాల స్థలం ఇస్తామని చెప్పి తనను మోసగించారని కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అసలు నిందితులు ఎవరో నిరూపించాలి. లేకపోతే మన పార్టీకే డామేజ్ జరగడం ఖాయమని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

గుండాట ఆపేయడం మంచిదే
సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించే గుండాటను ఆపేయడం మంచిదేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. సంక్రాంతి సంబరాలు ఉభయగోదావరి జిల్లాలో ఇసుక వేస్తే రాలనంత జనం మధ్య సందడిగా కొనసాగుతున్నాయి. సాంప్రదాయక కోడిపందాలకు ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. అయితే గతంలో ప్రజాప్రతినిధులు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. కోడిపందాల నిర్వాహణ కోసం తానే గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాను. మాగంటి బాబు లాంటివారు మాత్రమే గతంలో కోడిపందాల నిర్వహణకు సానుకూలంగా మద్దతును తెలిపేవారు. మిగతా ప్రజా ప్రతినిధులు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. అయితే ప్రస్తుతం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలలో ప్రజాప్రతినిధులు, ప్రజాభిష్టానికి అనుగుణంగా ముందుకు వచ్చి కోడిపందాల నిర్వహణకు మద్దతుగా నిలువడం అభినందనీయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని అతిక్రమిస్తే నమిలేస్తారు… కొరికేస్తారు అనే సందేహం లేకుండా ఎమ్మెల్యేలు తమ భావావేషాన్ని వ్యక్తం చేయడం శుభసూచకం. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి, సంక్రాంతి సంబరాలలో పాల్గొనే విధంగా సంక్రాంతి ఉత్సవాల నిర్వాహణ జరగాలి. ఇక సంక్రాంతి సంబరాలలో నీటిపారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు జోరుగా స్టెప్పులు వేయడం మంచిదే… కానీ నాగబాబు అన్నట్లుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ఆనందోత్సాహాల మధ్య ఈ స్టెప్పులు వేసి ఉంటే బాగుండేది. అంబటి రాంబాబుకు నీటిపారుదల శాఖ కంటే, సాంస్కృతిక శాఖ అయితే సరిపోతుందని రఘు రామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

తెలుగు పరిశ్రమకు దక్కిన గౌరవం
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజమౌళిని అభినందించడం తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవం అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

Leave a Reply