Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనలో గిరిజన యువత భవిష్యత్తు నిర్వీర్యం

-గిరిజన విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ నెపంతో త్రిప్పుకుంటూ తన ప్రచార పిచ్చికి వాడుకుంటున్నారు
-జగన్ రెడ్డి పాలన మొదలై 58 నెలలు గడుస్తున్న గిరిజన యూనివర్శిటీకి ఇటుక రాయి పడలేదు
– రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్

జగన్ రెడ్డి పాలనలో గిరిజన యువత నిర్వీర్యమైపోయింది. వైకాపా తప్పుడు నిర్ణయాల కారణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ లేక గిరిజన యువతకు ఉపాధి కరువైంది. రాష్ట్రంలో దాదాపు 50 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ల పోస్టులను అసలే భర్తీ చేయలేదు. గిరిజన విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ నెపంతో త్రిప్పుకుంటూ జగన్ రెడ్డి తన ప్రచార పిచ్చికి వాడుకుంటున్నారు. ట్రైబల్ ప్రాంతాల టీచర్ పోస్టులను ఎస్టీలతోనే నింపాలనే చెప్పే జీ.వో నం.3 జగన్ రెడ్డి నిర్లక్ష్యంతో నిర్వీర్యమైంది.

టిడిపి హయాంలో ఏజెన్సీ ప్రాంతాలంటే కాఫీ కల్టివేషన్‌కు ఆనవాలుగా ఉండేవి. కానీ,నేడు గంజాయికి చిరునామాలుగా తయారుచేయబడ్డాయి. గిరిజన యువత గంజాయికి బానిసలై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. జాతికి స్వాతంత్ర్య స్పూర్తిని నింపిన అల్లూరు సీతారామరాజు జిల్లాను వైకాపా నేతలు దేశానికే గంజాయి హబ్‌గా తయారు చేశారు. హిమాచల్ ప్రదేశ్ చెంబాలో దొరకని గంజాయి కూడా నేడు ఏపీలో దొరుకుతుందంటే దానికి కారణం జగన్ రెడ్డి కాదా?. విశాఖను గంజాయి రాజధానిగా మార్చి జగన్ రెడ్డి తన మాట నిలుపుకున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో 11 ఏళ్ల ఒరిస్సా బాలిక సామూహిక అత్యాచారానికి గురికావడం వెనుక గంజాయి పాత్ర ఉంది. దీనిపై వైకాపా ప్రభుత్వం చర్చకు సిద్దమా?

జగన్ రెడ్డి పాలన మొదలై 58 నెలల గడుస్తున్నా గిరిజన యూనివర్శిటీకి ఒక ఇటుక రాయి వేయలేదు. గిరిజన యువత భవిష్యత్తుకు జగన్ రెడ్డి గ్రహణంలా పట్టుకున్నారు. గిరిజన యువత ఉన్నత విద్య అభ్యసించి గొప్ప స్థానాలలో ఉండటం జగన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే విదేశీ విద్యను, గిరిజన విశ్వవిద్యాలయాన్ని కావాలనే నిర్వీర్యం చేశారు. తెలుగుదేశం హయాంలో గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన స్థలానికి జగన్ రెడ్డి ఎందుకు మార్చి జాప్యం అయ్యేలా చేశాడో సమాధానం చెప్పాలి?

పోలవరం ప్రాజెక్టు పనులు రివర్స్ చేసి గిరిజన నిర్వాసితులను నిండా ముంచిన జగన్ రెడ్డి విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని కూడా రివర్స్ చేశారు. దీని కారణంగానే నేటికి గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. గిరిజన యువత భవిష్యత్తు నిర్యీర్యం చేసిన పాపం జగన్ రెడ్డిదే. జగన్ రెడ్డి కారణంగా తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడిందని గిరిజన తల్లిదండ్రులు జగన్ రెడ్డిపై కోపంతో ఉన్నారు. గిరిజన తల్లిదండ్రుల ఆక్రందనలే జగన్ రెడ్డికి శాపాలుగా మారి రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డిని అధికార పీఠం నుంచి దించడం ఖాయం.

LEAVE A RESPONSE