ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు. ఆయనను తలసాని పోనీలేండి అంటూ వారించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
గన్‌మెన్లకు స్వయంగా హోంమంత్రే విలువ ఇవ్వకపోతే.. ఇక వారి త్యాగాలు, విధి నిర్వహణకు అర్ధం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీవీఐపీలకు గన్‌మెన్లు.. అత్యుత్సాహంతో తమ పరిథికి మించి సేవలు చేస్తుంన్నందుకే, ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయని పలువురు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. హోంమంత్రి చేయిచేసుకున్న వ్యవహారం, మొత్తం పోలీసు వ్యవస్థకే అవమానకరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వీవీఐపీలకు బొకేలు మోయడం, గొడుగులు పట్టడం, షూలు వేయడం, లేసులు కట్టడం, సరుకులు తీసుకురావడం గన్‌మెన్ల ఉద్యోగాలు కావని స్పష్టం చేస్తున్నారు.
తమ పైఅధికారులను విపక్షాలు విమర్శిస్తేనే తట్టుకోలేక, స్వామిభక్తితో విపక్ష నేతలపై విరుచుకుపడే పోలీసు అధికారుల సంఘ నేతలు.. ఇప్పుడు తమ శాఖ గన్‌మెన్‌పై హోంమంత్రి చేయిచేసుకుంటే, ఎందుకు ఖండించటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.