టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
వైసీపీ నాయకులు, కార్యకర్తల హత్యాకాండ రోజురోజుకి పెరిగిపోతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ గిరిజన హక్కుల్ని కాలరాస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ సుబ్రమణ్యం అనే దళిత వ్యక్తిని హత్య చేసి శవాన్ని మృతుడి ఇంటివద్ద పడేసివెళ్తే పోలీసులు చోద్యం చూస్తున్నారేతప్ప చర్యలు తీసుకోలేదు. పది సంవత్సరాలుగా తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తిని చంపడానికి ఉదయభాస్కర్ కు మనసెలా ఒప్పిందో అర్థం కావడంలేదు. సుబ్రమణ్యన్ని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ చంపేస్తే శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకోకపోవడం, అతన్ని వెనకేసుకురావడమే.
అనంత ఉదయభాస్కర్ ను గాలింపు చర్యలు చేపట్టాం అని ఎస్పీ మాట్లాడుతున్నారు. నిన్న అనంత ఉదయభాస్కర్ ఒక వివాహ కార్యక్రమానికి ఎలా వెళ్లాడు? గతంలో వెంకాయమ్మ అనే మహిళ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ఆమెపై విచక్షణారహితంగా వైసీపీ నాయకులు దాడి చేశారు. దళితుడిని చంపేసి రూ.10 లక్షలు డబ్బులిచ్చి మేనేజ్ చేద్దామనుకోవడం అనాగరిక చర్య అవుతుంది. హరితాంధ్రప్రదేశ్ ను జగన్ హత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ను వెంటనే శాసనమండలి నుంచి బర్తరఫ్ చేయాలి.
టీడీపీ నేత చంద్రబాబునాయుడు కొంతమందిని నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పాటు చేసి బాధితుల వద్దకు పంపగా అక్కడ చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. గిరిజనుల వనరులను దోచుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి ఉదయభాస్కర్. తనే కారులో తీసుకెళ్లి హత్య చేసి తనే కారులో శవాన్ని తెచ్చి పడేసి వెళ్లాడు. అనంత ఉదయ భాస్కర్ రాసలీలలు, దోపిడీ వ్యవహారాలు, గిరిన హక్కుల్ని ఏ విధంగా దోచుకున్నాడు అనే విషయాలు సుబ్రమణ్యానికి తెలుసు. అందుకే వైసీపీ కార్యకర్తలతో దారుణంగా కొట్టి చంపించి శవాన్ని ఇంటిదగ్గర పడేశాడు.
సుబ్రమణ్యం భార్య గర్భవతి అని కూడా చూడకుండా కనికరం లేకుండా ఉదయభాస్కర్ కారును, శవాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ప్రజా ప్రతినిధి అయితే వదిలేస్తారా? అని పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం. పోలీసులు వైసీపీ నాయకులకు దాసోహం అవుతారా? బాబాయిని గొడ్డలితో చంపించి గుండెపోటు అని నమ్మింపజూసిన జగన్ శిష్యరికంలో ఉన్నవారందరూ ఇంతే. ఉదయం ఒక అత్యాచారం తోటి, సాయంత్రం ఒక హత్యతోటి, ఒక ఆత్మహత్యతోటి రాష్ట్రం హత్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. రాష్ట్రం నేరస్థులతో నిండిపోయింది. నేరాలు, అరాచకాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా వారిలో మార్పులేదు. ప్రజల్లోని ప్రతిఘటనను భయంతో అణచివేయాలని చూస్తున్నారు.
అది వైసీపీ నాయకుల వల్ల కాదు. హత్యలు, అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో గ్రామాలకు వచ్చిన నాయకుల్ని తరిమి కొడుతున్నారు. వీటన్నింటికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఉదయభాస్కర్ పై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మృతుడి భార్యకు వైసీపీ నాయకత్వం ఇస్తామని ప్రలోభపెడుతున్నారు. మీరే చంపి మీరే వైసీపీ నాయకత్వం ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? భవిష్యత్తులో దళితుల కోపాగ్నికి బలికాక తప్పదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు నొక్కి వక్కాణించారు.