వాస్తవాలు తెలుసుకోకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గొర్రెల పంపిణీ పథకం లో కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం, బాధ్యతా రాహిత్యం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గొర్రెల పెంపకం దారుల జీవితాలలో వెలుగులు నింపాలనే సంకల్పంతో రాష్ట్రంలో ఉన్న 7.31 లక్షల మంది లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం కు రూపకల్పన చేసి 2017 నుండి అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని రెండు విడతలుగా అమలు చేయాలని నిర్ణయించి మొదటి విడతలో 3549.98 కోట్లు NCDC ద్వారా రుణం తీసుకొని పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. తీసుకున్న రుణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అసలు 1723.62 కోట్లు, వడ్డీ 1177.12 కోట్లు మొత్తం 2900.74 కోట్ల రూపాయలను NCDC కి తిరిగి చెల్లించినట్లు చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్ధిక భారం పడినప్పటికీ గొర్రెల పెంపకం దారుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని వివరించారు. అవగాహన లేకుండా అన్ని అబద్దాలు మాట్లాడుతున్న బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అద్యక్షుడిగా ఎలా అధ్యక్షుడిగా పెట్టుకుంది ? అని ప్రశ్నించారు. దమ్ముంటే గొర్రెల పంపిణీ పథకాన్ని దేశమంతా అమలు చేసి చూపాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపులో మా పాత్ర లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు అవార్డ్స్ ఇస్తున్నారు తప్ప… నిధులు మాత్రం ఇయ్యడం లేదు అన్నారు. బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.
ఇస్తామని చెప్పిన వెయ్యి కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని, అన్యాయం చేసింది అని మేము ఎక్కడ చెప్పలేదన్నారు. సకాలంలో రుణాన్ని చెల్లిస్తుండటం పట్ల అభినందించి రెండో విడత పథకం అమలుకు నిధులు విడుదల చేసేందుకు NCDC అంగీకరించిందని అన్నారు. గొర్రెల పంపిణీ పథకం రెండో విడత అమలులో భాగంగా 6,125 కోట్ల రూపాయల వ్యయంతో 3.50 లక్షల మంది లబ్దిదారులకు గొర్రెలను అందజేయాలని నిర్ణయించి 4,593.75 కోట్ల రూపాయలను NCDC నుండి అప్పుగా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రెండో విడత రుణంలో కేంద్రం నుండి ఎలాంటి సబ్సిడీ రాదని NCDC ఖరాఖండిగా చెప్పిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.