ఎన్నికల్లో సింపతీ కోసమే సొంత చిన్నాన్న హత్యకు కుట్ర

– కుట్లు వేసిన డాక్టర్ ఎవరు ?
– అమలాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు అనంతకుమారి
వివేకానంద రెడ్డి హత్య వెనక సీఎం జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉన్నట్లుగా అనుమానం కలుగుతోందని అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి అన్నారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి వాగ్మూలం పరిశీలిస్తే హత్య వెనుక జగన్ కీలక పాత్ర పోషించిన ట్లుగా అర్థమవుతోందన్నారు. కొత్తపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. హత్య కేసులో బయటకు వచ్చిన పేర్లలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి తో పాటు అందరూ జగన్ కు సన్నిహితంగా ఉండేవారని చెప్పారు. అయితే వీరందరి పేర్లు బయటకు వచ్చాయి గానీ కుట్లు వేసి కట్టు కట్టిన డాక్టర్ పేరు బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేసులో అనుమానితులుగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి చనిపోయిన ఏడాది తర్వాత జగన్ మామ గంగిరెడ్డి చనిపోయారన్నారు. గంగిరెడ్డి అస్వస్థతతో చనిపోయారు అన్నారు గానీ తలకు గాయమై, గుడ్డ కట్టి ఉండడం అనుమానించాల్సి వస్తోంది అన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు గుండెపోటు అని విజయసాయిరెడ్డి చెప్పారని, తర్వాత మాట మార్చి లోకేష్ చంద్రబాబులు హత్య చేయించారని ఆరోపించారని గుర్తు చేశారు.
దీనిపై విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. 40 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేయించారని అంటే దేశంలో ఇదే ఖరీదైన మడ్డర్ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసును సిబిఐ విచారణ చేయాలని చెప్పిన జగన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ను సరిగ్గా పది రోజుల తర్వాత విచారణ నివేదిక బహిర్గతం చేయొద్దని ఎందుకు హైకోర్టును కోరారని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక మరోసారి సిట్ ఏర్పాటు చేశారని, ఇంకా ఆ సిట్ వివరాలు బహిర్గతం చేయలేదన్నారు. హత్యకేసు ఇన్ని మలుపులు తిరుగుతుండడం చూస్తే దీని వెనుక సూత్రధారి సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నట్లుగా స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు.

Leave a Reply