– ఇన్నర్ రింగ్ రోడ్డు పడితే హెరిటేజ్ భూములు పోతాయి
– నిన్న అడిగిన సంబంధంలేని ప్రశ్నలు మళ్లీ అడిగారు
– స్కిల్ ప్రాజెక్టులో కీలకమైన అజయ్ రెడ్డి, ప్రేమచంద్రారెడ్డి పేర్లు ఎఫ్ఐఆర్‌లో లేవేం?
– ఈ ఇద్దరూ సైకో జగన్ పక్కనే సలహాదారులుగా ఉన్నారని వదిలేశారా?
– సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డు పడితే హెరిటేజ్ భూములు పోతున్నాయని సీఐడీ విచారణలో ఓ నిజం తనకు తెలిసిందన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రెండో రోజు సీఐడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను ఆరుగంటలపాటు విచారించారని, నిన్నటి ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని, ఇందులో 3కొత్త ప్రశ్నలున్నాయన్నారు.
ఈ కేసుకి అసలు సంబంధమే లేని నా తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ నా ముందు పెట్టి ప్రశ్నించారని, నా తల్లి ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమన్నారు. లింగమనేని రమేష్ కి అద్దె చెల్లింపులపై నన్ను ప్రశ్నించారని, అద్దెకి తీసుకోవడం క్విడ్ ప్రోకో కాదన్నారు.
సాక్షి షేర్ రూ.10 ఉన్నది తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని రూ.350కి కొనుగోలు చేయించినట్లు ..లింగమనేని రమేష్ మా షేర్ లు ఎక్కడా కొనలేదని స్పష్టం చేశారు. ప్రజా ధనాన్ని లూటీ చేసి సాక్షికి కట్టబెట్టినట్లు తాము ఎక్కడా చేయలేదన్నారు. సాక్షి ఉద్యోగుల జీతాలకు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రజాధనంతోనే వాలంటీర్ల సాయంతో సాక్షి సర్క్యులేషన్ పెంచే కుట్రను న్యాయస్థానం కూడా తప్పుబట్టి జగన్ భార్య భారతికి నోటీసులు ఇచ్చిందన్నారు.
సీఆర్డీఏ ఏర్పాటు, రాజధాని ఎంపిక నిర్ణయం వంటి నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పై సీఐడీ తనకు ఓ సినిమా చూపించిందని, అలైన్మెంట్ మార్పు వల్ల హెరిటేజ్ భూమి కోల్పోతోందని స్పష్టమైందన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు, జీవో, కోర్టు ఆదేశాలతో 99 ప్లాట్లకి ఇచ్చిన రిలాక్సేషన్ గురించి అడిగారని తెలిపారు.
ఏపీ హైకోర్టు ఒక రోజు విచారణే అని చెప్పినా సీఐడీ అధికారుల నోటీసు మేరకు రెండోరోజూ విచారణకి హాజరయ్యానని, మూడోసారి విచారణకు పిలిచినా హాజరవుతానని, ఇప్పటివరకూ తనకు నోటీసు ఏమీ ఇవ్వలేదన్నారు. మేము అమరావతి కోర్ కేపిటల్‌లో ఒక్క గజం భూమి కొనలేదని, మేము ప్రతీ ఏటా ఆస్తులు ప్రకటిస్తున్నామని, అదనంగా ఒక్క గజం ఉన్నా తీసుకోవచ్చన్నారు.
స్కిల్ స్కాం అంటున్నారని, గుజరాత్ వెళ్లి ఆ ప్రాజెక్టు అధ్యయనం చేసింది ప్రేమ్ చంద్రారెడ్డి, ఫైళ్లపై సంతకాలు చేసిన కల్లం అజయ్ రెడ్డి ఇద్దరూ కూడా సైకో జగన్ పక్కనే సలహాదారులుగా ఉన్నారని, వీరిద్దరినీ ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదని లోకేష్ ప్రశ్నించారు. సంబంధమేలేని చంద్రబాబుని కేసులో ఇరికించి అక్రమంగా నెల రోజులకి పైగా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచడం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని లోకేష్ అన్నారు.