– అమిత్ షాకు విషయం చెప్పకుండా ఎంపీ తీసుకువస్తున్నారేమో
– పసుపునకు మద్దతు ధర ప్రకటించాలి
– జగ్గారెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ విధానమా ?
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : నిజామాబాద్ పసుపు బోర్డును ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పుడు మూడోసారి ప్రారంభించేందుకు వస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, యాకుత్ పురా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు శనివారం కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పసుపు బోర్డుకు పదే పదే ప్రారంభోత్సవాలు చేయడం కాదు.. ఎన్ డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించాలన్నారు. పసుపు బోర్డుకు ఇదివరకే ప్రారంభోత్సవాలు చేసిన సంగతి ఎంపీ అర్వింద్ కేంద్ర హోం మంత్రికి చెప్పకపోవచ్చని అన్నారు.
నిజామాబాద్ లోనే పసుపునకు క్వింటాల్ కు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించి వెళ్లాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించలేదు కాబట్టే మొన్నటి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు సంతోష పడేలా అమిత్ షా మద్దతు ధరపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే మహిళలను తక్కువ చేసి కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టింది అంటే అది మహిళల వల్లనే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ, సోనియా గాంధీలే నిలబెట్టారని తెలిపారు. మహిళల గురించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ విధానమా అని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను ప్రశ్నించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డిని ఆయన భార్య, కూతురే సరి దిద్దాలన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉందని.. ఆ బిల్లును పాస్ చేస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతితో కలిసి పని చేస్తాం : సీపీఐ ఎంపీ సందోష్
తెలంగాణ జాగృతితో సీపీఐ సాంస్కృతిక విభాగం యువ కళావాహిని కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని కేరళకు చెందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సందోష్ కుమార్ తెలిపారు. శనివారం బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెతో సందోష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో యువ కళావాహిని జాగృతి కలిసి పని చేస్తాయన్నారు. తన నివాసానికి వచ్చిన సందోష్ ను ఎమ్మెల్సీ కవిత ఘనంగా సత్కరించారు.
వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
గ్రామ రెవెన్యూ సేవకుల (వీఆర్ఏ) వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వీఆర్ఏ జేఏసీ నాయకులు శనివారం ఎమ్మెల్సీ కవితను కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు ఉండగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 16,758 మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 61 ఏళ్ల వయసు పైబడిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.