Suryaa.co.in

National

భారత సాహిత్య రాయబారి ఆచార్య యార్లగడ్డకు మిచిగాన్ గవర్నర్ ప్రశంస

మిచిగాన్: ప్రముఖ హిందీ, తెలుగు సాహితీవేత్త, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మిచిగాన్ గవర్నర్ గౌరవ గ్రెట్చెన్ విట్మర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యార్లగడ్డ అమెరికా పర్యటన సందర్భంగా గవర్నర్ ప్రత్యేకంగా లేఖ రాసి, భారతీయ భాషల అభివృద్ధికి, సాంస్కృతిక బంధాల బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.

“మీరు భారతదేశం, అమెరికా మధ్య సాంస్కృతిక వారసత్వానికి మార్గం వేశారన్నారు. సాహిత్య, విద్యా సేవలు అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి,” అని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ ఆచార్యులు‌గా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడిగా, భారత ప్రభుత్వ హిందీ సలహా మండలిలో సభ్యుడిగా యార్లగడ్డ నిర్వహించిన కీలక పాత్రలను గవర్నర్ గుర్తుచేశారు. “మీ సాహిత్య సేవలు, ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల సౌందర్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి,” అని గవర్నర్ యార్లగడ్డ ను అభినందించారు.

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సుదీర్ఘ కాలంగా భాష, సాహిత్యం, సాంస్కృతిక పరస్పర సంబంధాల కోసం కృషి చేస్తూ భారతీయ మేధస్సును ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నారు. ఆయన విశ్వవ్యాప్త సాహిత్య చర్చలకు వేదిక కల్పిస్తూ, భాషల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన యార్లగడ్డకు వచ్చిన ఈ గౌరవం తెలుగువారందరికీ గర్వకారణమని పలువురు సాహితీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A RESPONSE