ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు

40

-రాష్ట్ర అభివృద్ధే ప్రాధాన్యతగా ప్రధాని పర్యటన
-బహిరంగ సభ తరలిరానున్న 3 లక్షల మంది

విశాఖపట్నం, నవంబర్ 10: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల బహిరంగ సభ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని, సుమారు రూ. 15 వేల కోట్లతో రాష్ట్రంలో పలు ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.  ఈ మేరకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండులో ఈ నెల 12న జరగనున్న ప్రధాని బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్ నాథ్ తో కలిసి పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభకు సంబంధించి ఇంచుమించుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అన్నారు. 30 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారని, 3 లక్షల మంది హాజరు కానున్నారని అన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుంచి 2 లక్షల మంది, శ్రీకాకుళం, విజయనగరం, ఏఎస్ఆర్ జిల్లాల నుంచి మరో లక్షమంది సభకు హాజరవుతారు. 11వ తేదీ సాయంత్రం ప్రధాన మంత్రి విశాఖ చేరుకుంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలుకుతారు.

ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ప్రధాని విశాఖ పర్యటన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే కార్యక్రమం కావడంతో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన్యతగా భావించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని పర్యటనకు రాష్ట్రప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, దయచేసి దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. సమయం తక్కువగా ఉన్నందున, కోర్టులో అడ్డంకులన్నీ తొలగిపోయినప్పటికీ, భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన వీలు కావడం లేదని అన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైకాపా పార్టీ మొదటి నుంచి వ్యతిరేకమేనని, ఈ మేరకు ధర్నాలు, పాదయాత్రలు నిర్వహించామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ 125 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని గుర్తుచేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, జీవీఎంసీ కమీషనర్ తో ఏర్పాట్లు పరిశీంచిన విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, అమర్ నాథ్ లు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జ్ కేకేరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ సీతంరాజు సుధాకర్, రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మెన్ నర్తు రామారావు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమీషనర్ రాజాబాబు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.