– బీఆర్‌ఎస్ ఇమేజీకి భారీ డామేజీ
– బిడ్డింగ్‌లో ముఖం చాటేసిన తెలంగాణ సర్కార్
– గడువు ఇచ్చినా బిడ్డింగ్ వేయని సింగరేణి
– ఐదురోజుల గడువు అడిగి పత్తాలేని వైనం
– పరువు పోగొట్టుకున్న బీఆర్‌ఎస్
– బీజేపీ-కాంగ్రెస్ అమ్ములపొదిలో కొత్త అస్త్రం
– జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ను ముద్దాయిగా నిలబెట్టే అవకాశం
– బిడ్‌పై పార్టీలో చర్చించకపోవడం వల్లే ఈ అనర్ధమంటున్న సీనియర్లు
– చర్చించే సంస్కృతి లేకపోతే ఇలాంటి ఫలితాలేనని స్పష్టీకరణ
– ఉద్యమం నుంచి ఉక్కు వరకూ అదే వ్యూహం
– ప్రచారంతోనే కేసీఆర్ మైండ్‌గేమ్
– విఫలమైతేకొన్నాళ్లు వ్యూహాత్మక మౌనం
– ‘ఉక్కు’తో తేలిన బీఆర్‌ఎస్ చిత్తశుద్ధి
– రెండు, మూడురోజులు మళ్లీ వ్యూహాత్మక మౌనం
– ఇంతవరకూ వెలువడని అధికారిక ప్రకటన
– కారణాలు ప్రకటించని సింగరేణి యాజమాన్యం
-పత్తా లేని ఏపీ బీఆర్‌ఎస్ నేతలు
– బీఆర్‌ఎస్ గొప్పలపై బీజేపీ విమర్శనాస్ర్తాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇంతన్నాడంతన్నాడే..గంగరాజు..
ముంతమావిడి పండన్నాడే గంగరాజు..
హస్కన్నాడు..బుస్కన్నాడే.. గంగరాజు
నన్నొగ్గీసెల్పోనాడే.. గంగరాజు…
అన్నది ఓ సినిమా పాట.
‘కొండతరాగం తీసి పిచ్చగుంటలో పాటపాడినట్లు ఉంద’న్నది తెలంగాణలో ఓ సామెత.
విశాఖ స్టీల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్లలో , తెలంగాణ సర్కారు పత్తాలేకుండా పోవడంతో.. సింగరేణి సత్తాను వెక్కిరిస్తూ.. బీఆర్‌ఎస్ అత్యుత్సాహాన్ని విమర్శిస్తూ.. ఇప్పుడు ఈ పాటలు- సామెతలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
విశాఖ స్టీల్ ఈవోఐ బిడ్లలో తెలంగాణ సర్కారు పాల్గొని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపుతుందని.. బీఆర్‌ఎస్ నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దానికి తగినట్లుగానే సింగరేణి యాజమాన్యం కూడా, అధికారులను విశాఖకు పంపించింది. స్టీల్ కంపెనీని పరిశీలించి, బిడ్డింగ్ వివరాలపై ఆరా తీసిన సింగరేణి అధికారులు.. తమకు ఓ ఐదురోజులు గడువు ఇవ్వాలని కోరారు. దానితో సింగరేణి నిజంగా బిడ్ వేస్తుందేమోనన్న అంచనాతో, స్టీల్ యాజమాన్యం అందుకు అంగీకరించింది. అయితే సింగరేణి కోరిన ఐదురోజుల గడువు పూర్తయినా, సింగరేణి యాజమాన్యం మాత్రం పత్తా లేకుండా పోయింది. దానితో సింగరేణితో సంబంధం లేకుండా, విశాఖ స్టీల్ యాజమాన్యం తన పని తాను చేసుకుపోయింది.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతున్నామంటూ… రోజుల తరబడి తెగ హడావిడి చేసిన బీఆర్‌ఎస్ నేతలు- మంత్రులు- ఎమ్మెల్యేలలో ఇప్పుడు చప్పుడు లేదు. విశాఖ స్టీల్‌ను ఆదుకుంటున్న కేసీఆర్‌ను, విశాఖకు తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారంటూ.. గొప్పలు చెప్పిన ఏపీ బీఆర్‌ఎస్ నేతలు పత్తా లేరు. అసలు తాము బిడ్డింగ్‌లో ఎందుకు పాల్గొనలేదో, అటు సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటన విడుదల చేయలేదు. తెలంగాణ సర్కారు బిడ్డింగ్‌కు ఎందుకు దూరంగా ఉందన్న కారణాలపై, ఇప్పటిదాకా మంత్రులు కూడా పెదవి విప్పలేదు. అంతా గప్‌చుప్!
తాజా పరిణామాలు రాజకీయంగా బీఆర్‌ఎస్ ఇమేజీకి, భారీ డామేజీగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖ స్టీల్ బిడ్డింగ్‌లో పాల్గొని, అందులో పెట్టుబడి పెట్టడమో, లేక సరుకు సరఫరా చేయడం ద్వారా..బీఆర్‌ఎస్ ఆంధ్ర ప్రజలకు దగ్గరవుతుందని చాలామంది అంచనా వేశారు. మంత్రుల ప్రకటనలు, సింగరేణి అధికారుల విశాఖ పర్యటన, ఏపీ బీఆర్‌ఎస్ నేతల అత్యుత్సాహం చూసి, విశాఖ స్టీల్ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కారు పాల్గొంటుందన్న భ్రమలు కలిగించాయి.
పైగా.. ఏపీ ప్రభుత్వం బిడ్డింగ్‌లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించడ ంతో, సింగరేణి నిజంగానే బిడ్ వేస్తుందన్న అంచనాలు పెంచాయి. చివరకు అటు ఆంధ్రా-ఇటు తెలంగాణ ప్రభుత్వాలు రెండూ బిడ్డింగ్‌లో పత్తా లేకుండా పోవడం విశేషం.
కానీ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కారు పత్తా లేకుండా పోవడంతో, బీఆర్‌ఎస్ విపక్షాలకు అస్త్రంగా మారినట్టయింది. ఇప్పుడున్న ఆర్ధిక సంక్షోభంలో 5 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తుంది? ఇదంతా కేసీఆర్ పబ్లిసిటీ స్టంట్. ఇక్కడ మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించే దిక్కులేదు. ఇక ఆంధ్రాకు వెళ్లి ఏం చేస్తారంటూ బీజేపీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై విమర్శనాస్ర్తాలు సంధించారు. దానిని ఏపీ బీఆర్‌ఎస్ నేతలు తిప్పికొట్టి, భక్తిప్రపత్తులు చాటుకునే ప్రయత్నం చేశాయి.
విపక్షాలు విమర్శించినట్లుగానే.. తెలంగాణ సర్కారు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా, ముఖం చాటేసింది. ఇది సహజంగానే బీఆర్‌ఎస్ చిత్తశుద్ధిని, ప్రచారపటాటోపాన్ని బయటపెట్టినట్టయింది. బీజేపీ-కాంగ్రెస్ విమర్శలు నిజమని, తెలంగాణ ప్రజలు నమ్మేందుకు అవకాశం ఇచ్చిందన్న వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అసలు విశాఖ స్టీల్ వ్యవహారంలో తలదూర్చడమే వ్యూహాత్మక తప్పిదమని, సింగరేణికి అంత ఆర్ధిక స్తోమత లేదని తెలిసికూడా సాహసం చేసి, చేతులు కాల్చుకున్నామని బీఆర్‌ఎస్ సీనియర్లు తలపట్టుకుంటున్నారు.
ఈ పరిణామాలన్నీ బీఆర్‌ఎస్‌ను, జాతీయ స్థాయిలో అప్రతిష్ఠ చేసేందుకు కారణమవుతాయని విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో విస్తరణకు ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్ చిత్తశుద్ధిని.. బీజేపీ-కాంగ్రెస్ నేతలు, ఆయా రాష్ర్టాల్లో ప్రచారం చేస్తే పరిస్థితి ఏమిటన్నది బీఆర్‌ఎస్ నేతల ఆందోళన. ఈ అంశంపై ఇప్పుడు విపక్షాలు విమర్శనాస్ర్తాలు సంధిస్తే ఎలా తిప్పికొట్టాలని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి కీలక, సున్నిత అంశాలపై ఏ స్థాయిలో కూడా.. ఎప్పుడూ చర్చ జరగకపోవడంపైనా బీఆర్‌ఎస్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్టీల్ కంపెనీలో బిడ్ల దాఖలుపై సాధ్యాసాధ్యాలపై చర్చించకుండా, బిడ్ వేస్తామని.. తీరా సమయానికి పత్తా లేకుండా పోవడం వల్ల, పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనయినా కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో చర్చిస్తే మంచిదన్న సూచన వ్యక్తమవుతోంది.
ఇలాంటి ప్రచారం అన్ని వేళలా సక్సెస్ కాదన్నది సీనియర్ల వాదన. నిజానికి ఉద్యమ కాలం నుంచి పార్టీ అధినేత కేసీఆర్, ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ముందు ఒక అంశంపై లీక్ ఇవ్వడం, దానికి మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం, తర్వాత దానిపై కొన్నాళ్లు , మీడియా ముందుకు రాకుండా వ్యూహాత్మకమౌనం పాటించడం అలవాటయిందని విశ్లేషిస్తున్నారు.
అప్పుడు ఈ వ్యూహాలు ఫలించినప్పటి కీ..పక్క రాష్ర్టాల్లో విస్తరణకు ప్రయత్నిస్తున్న ఈ కాలంలో, అలాంటి పాత వ్యూహాల వల్ల పార్టీ ప్రతిష్ఠ-చిత్తశుద్ధి-విశ్వసనీయత దెబ్బతింటుందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వైఫల్యాలను విపక్షాలు ప్రచారం చేస్తే, పక్క రాష్ర్టాల్లో ప్రజలు తమ పార్టీని ఎలా నమ్ముతారన్నది వారి వాదన.
విశాఖ స్టీల్ బిడ్లపై కేసీఆర్ చిత్తశుద్ధిని తాము ఎప్పుడో అనుమానించామని, ఇప్పుడు అదే నిజమైందని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు వ్యాఖ్యానించారు. బిడ్లపై గొప్పలు చెప్పిన బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. విశాఖ ప్రజలు-కార్మికులను మోసం చేసినందుకు, బీఆర్‌ఎస్ ఏపీ నేతలు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మూతపడిన ఫ్యాక్టరీలనే తెరిపించడం చేతకాని కేసీఆర్, విశాఖ స్టీల్‌కు ఏం చేస్తారని తాము మొదటనే ప్రశ్నించిన విషయాన్ని నాగోతు గుర్తు చేశారు.
తాజా పరిణామాలతో ఏపీ బీఆర్‌ఎస్ నాయకులు కూడా నీరసపడాల్సి వచ్చింది. విశాఖ స్టీల్ బిడ్‌లో పాల్గొనడం ద్వారా, ఉత్తరాంధ్ర-ముఖ్యంగా విశాఖలో కాస్త హడావిడి చేసి, జనం మార్కులు కొట్టేద్దామనుకున్న ఏపీ బీఆర్‌ఎస్ నేతలు చతికిలపడ్డారు. విశాఖకు కేసీఆర్‌ను తీసుకురావాలని కార్మికుల కోరుతున్నారని ప్రకటించి, ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించారు.
అది చాలదన్నట్లు విశాఖలో కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. పైగా ఏపీ ప్రభుత్వం ఎందుకు బిడ్డింగ్ వేయదని నిలదీశారు. ఏపీని ఆదుకుని, అభివృద్ధి చేసేది బీఆర్‌ఎస్ మాత్రమేనని తెగ హడావిడి చేశారు. ఇప్పుడు తీరా బిడ్డింగ్‌కు.. తెలంగాణ సర్కారు దూరంగా ఉండటంతో, ఏపీ బీఆర్‌ఎస్ నేతలు సంకటంలో పడినట్టయింది.