– కోట్ల రూపాయల పోర్టు నిధులను ధారాదత్తం చేస్తున్న అవినీతి అధికారులు
– పోర్టును నిలువునా ముంచి, ప్రైవేట్ సంస్థకు ఊడిగం చేస్తున్న డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజి, మాజీ కార్యదర్శి టి.వేణుగోపాల్, సీ.ఎం.ఈ సిహెచ్.రాంప్రసాద్,చీఫ్ ఇంజనీర్ ఎన్.శ్రీరామచంద్రమూర్తి, మాజీ చీఫ్ ఇంజనీర్ వేణు ప్రసాద్ లపై సిబిఐ విచారణ జరపాలి
– విశ్వనాథ్ సంస్థకు పరిహారం ఇవ్వటం ఆపేసి పోర్టు స్టేడియం విధ్వంసానికి ఆ సంస్థ నుంచే తిరిగి పరిహారం వసూలు చేయాలి
– విశ్వనాథ సంస్థకు 40 కోట్లు చెల్లించేందుకు సిద్ధం చేసిన ఫైలు పై బదిలీ అయిన ఇన్చార్జి చైర్మన్ అంగముత్తు నిర్ణయం తీసుకోకూడదు
– సిబిఐ ,సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లకు జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు
విశాఖపట్నం: విశాఖ పోర్ట్ స్టేడియం లీజ్ కు తీసుకొని నిర్వహించ లేక చేతులెత్తేసిన M/s.విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట 40 కోట్లు కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్న విశాఖ పోర్టు అధికారులపై సిబిఐ ,సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, పోర్టు మంత్రిత్వ శాఖలు తక్షణమే విచారణ జరపాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
విచారణ పూర్తయ్యేవరకు తక్షణమే ఆ డబ్బు చెల్లింపు ను నిలిపివేయాలని, బదిలీపై వెళుతున్న ఇంచార్జ్ చైర్మన్ అంగముత్తు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని, కొత్తగా చైర్మన్ గా నియమితులైన జస్మిత్ సింగ్ బింద్రా బాధ్యతలు తీసుకున్న వరకు ఆగాలని మూర్తి యాదవ్ కోరారు . మంగళవారం విశాఖలో మేఘాలయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వనాధ్ స్పోర్ట్స్ సంస్థ యాజమాని బొడ్డేటి కాశీ విశ్వనాథం, నరేంద్ర కుమార్ ల పైన, నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ కి సహకరించిన విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారుల పైన సిబిఐ విచారణకు జరపాలని , విచారణ పూర్తయ్యే వరకు వారిని ఆ బాధ్యత నుంచి తప్పించాలని కోరారు.
పోర్టులో జీతాలు తీసుకుంటూ విశ్వనాధ సంస్థ కు సేవచేస్తుంది వీరే
పోర్టును నిలువునా ముంచి ప్రైవేట్ సంస్థకు ఊడిగం చేస్తున్న డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజి, మాజీ కార్యదర్శి టి.వేణుగోపాల్, సీ.ఎం.ఈ సిహెచ్.రాంప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఎన్.శ్రీరామచంద్రమూర్తి, మాజీ చీఫ్ ఇంజనీర్ వేణు ప్రసాద్ ల పై సిబిఐ విచారణ జరపాలని, వీరి అక్రమ ఆస్తులపై వివరాలు సేకరించాలని కోరారు. విశాఖ పోర్ట్ అథారిటీలో కీలకమైన స్థానాల్లో పనిచేస్తూ,40 కోట్ల రూపాయల పోర్టు ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టేందుకు ఈ పై అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అత్యుత్సాహం చూపుతున్నారని ఆరోపించారు. సి.ఎం.ఈ రాంప్రసాద్ ఛాంబర్ వేదికగా ఈ కుంభకోణం కార్యాచరణ గత రెండు నెలలుగా జరుగుతుందని ఆరోపించారు.
ఒక థర్డ్ పార్టీ నీ కాదని మరో పార్టీతో అసెస్మెంట్
పోర్టు స్టేడియం ను విధ్వంసం చేసి, లేని నిబంధనలను ఉల్లంఘించి పోర్టు యాజమాన్యం నోటీసుతో స్వచ్ఛందంగా స్టేడియంను అప్పగించిన విశ్వనాథ సంస్థ తమకు 48 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలంటూ ఫిబ్రవరి 2వ తేదీన కోర్టు చీఫ్ ఇంజనీర్ కి లేఖ రాసిందని చెప్పారు. దీని ఆధారంగా కోర్టు తీర్పులకు విరుద్ధంగా థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకు ఈ అధికారులంతా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశ్వనాథ సంస్థ నుంచి వచ్చిన ఒక ఈమెయిల్ లేఖ కు ఆగమేఘాల మీద స్పందించిన ఈ అవినీతి అధికారుల బృందం ఏప్రిల్ మూడో తేదీన ఆర్ రామకృష్ణారావు అనే చార్టెడ్ ఇంజనీర్ నుంచి పోర్టు కళావాణి ఆడిటోరియం లో చేపట్టిన పనులు కు నష్టపరిహారం కింద 2.46 కోట్ల రూపాయలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నష్టపరిహారంగా 23.95 కోట్ల రూపాయల అంచనాలను తెప్పించారని చెప్పారు.
అయితే ఈ నష్టపరిహారం తక్కువగా ఉందంటూ విశ్వనాథ సంస్థ సంతృప్తి చెందకపోవడంతో కోల్కతా కేంద్రంగా పనిచేసే మెకాన్ అనే మరో సంస్థ కు అంచనా బాధ్యతలు అప్పగించారని, పాత అంచనాల కంటే అదనంగా కనీసం 50 శాతం అంచనాలను పెంచాలని లోపాయి కారిగా ఆ సంస్థకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.
పోర్టు ఆస్తులను రక్షించాల్సిన అధికారులు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు పరిహారం బాధ్యతను ఒక సంస్థను కాదని మరో సంస్థకు ఇవ్వటం వెనకే అవినీతి కుంభకోణం దాగి ఉందని చెప్పారు. విశ్వనాథ సంస్థ నుంచి వచ్చిన 48 కోట్ల పరిహారం లేఖ పై న్యాయ సలహా తీసుకోకుండా, కోర్టును ఆశ్రయించకుండా నేరుగా థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట పరిహారం ఇచ్చేయటం అత్యంత దారుణమని మూర్తి యాదవ్ పేర్కొన్నారు.
అసలు ఆ సంస్థ ఇచ్చింది ఎంత? తిరిగి ఇచ్చే పరిహారం ఎంత?
2023 లో 20 ఎకరాల పోర్టు స్టేడియం ను లీజుకి తీసుకున్న విశ్వనాథ సంస్థ లీజ్ ఒప్పందం ప్రకారం సక్రమంగా అద్దెలు చెల్లించలేదు. విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. గతంలో పోర్ట్ నిర్మించిన పలు కట్టడాలను అనుమతి లేకుండా కూల్చివేసింది. అనుమతి లేకుండా ఇష్టానుసారం కొత్త కట్టడాలను నిర్మించింది. సబ్ లీజ్ లకు ఇచ్చి కోట్ల రూపాయలు గడించింది.
చివరికి పోర్ట్ అధికారులు లీజు ఒప్పందాన్ని రద్దుచేసి, న్యాయపోరాటం ద్వారా విశ్వనాధ్ సంస్థ అద్దె బకాయిలు ను బ్యాంకు గారంటీ గా వున్నా 4.12 కోట్ల రూపాయలును పోర్టు తన ఖాతాలో జమ చేసుకుంది.అంతా చేసిన కేవలం నాలుగు కోట్లు మాత్రమే పోర్టుకి వచ్చాయి. విచిత్రంగా పరిహారంగా పోర్టు 40 కోట్ల రూపాయలను విశ్వనాథ సంస్థకు చెల్లించేందుకు సిద్ధమవుతోంది. విశాఖ నగరవాసులందరికీ ఉపయోగపడాల్సిన పోర్టు స్టేడియం ను మూడేళ్ల పాటు అక్రమంగా వినియోగించుకున్నందుకు డబ్బు కట్టకపోగా ఆ సంస్థకే తిరిగి నష్టపరిహారం పేరిట 40 కోట్ల రూపాయలు ఇవ్వజూపడం కొత్త రకం అవినీతి కుంభకోణమే అవుతుంది.
బదిలీ అయిన ఇన్చార్జి చైర్మన్ నిర్ణయం తీసుకోకూడదు
విశ్వనాథ సంస్థపై ప్రస్తుత చైర్మన్ అంగముత్తు చర్యలు తీసుకొని లీజు ఒప్పందాన్ని రద్దు చేయించారు. ఆయన మరో పోర్టుకు బదిలీ కావడంతో ఇన్చార్జి చైర్మన్ గా కొనసాగుతున్నారు. కొత్తగా ఆదివారం నాడే జస్మిత్ సింగ్ బింద్రాను ఆయన స్థానంలో ప్రభుత్వం నియమించింది. అయితే ఇప్పుడు బదిలీపై వెళుతున్న అంగముత్తు పైన ఒత్తిడి తీసుకొచ్చి భారీ పరహారాన్ని ఇప్పించేందుకు కొందరు పైరవీ కారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీపై వెళ్లే ఆయన 40 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే పోర్టు స్టేడియం ఫైల్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చి ఉన్నందున వారి విచారణ పూర్తయ్యేంతవరకు వేచి చూడాలని కోరుతున్నాను.
సబ్ లీజుదారులకు ఓ అండ్ ఎం పేరిట తాత్కాలిక లీజులా?
పోర్టు నుంచి స్టేడియంలో లీజుకు తీసుకున్న విశ్వనాథ సంస్థ పనుల పేరిట, నిర్వహణ పేరిట 12 మందికి పైగా నిబంధనలకు విరుద్ధంగా సబ్ లీజులకు ఇచ్చింది. విశ్వనాథ సంస్థ లీజ్ రద్దు కావడంతో ఆ సంస్థ 48 కోట్ల రూపాయల పరిహారాన్ని కోరింది. ఆ సంస్థ నుంచి సబ్లీజలకు తీసుకున్న వారు పోర్టులోని అవినీతిపరులైన అధికారుల ముఠా సహకారంతో తాత్కాలికంగా ఆపరేషన్ అండ్ మెయిన్టెనెన్స్ పేరిట తిరిగి లీజు పొందేందుకు నేరుగా దరఖాస్తులు చేస్తున్నారు.
ఈ దరఖాస్తుల వెనుక కూడా విశ్వనాథ సంస్థ ప్రమేయం ఉండటం, లోపాయి కారీగా అందులో వారికి వాటాలు ఉండటం గమనార్హం. ఈ మేరకు ఫన్ విల్లే కార్నివాల్ కంపెనీ తో పాటు ఫన్ జోన్ అండ్ వాటర్ పార్కు నిర్వహించె సంస్థ లు మార్చి 23వ తేదీన పోర్టు చైర్పర్సన్ కు లేఖ రాస్తూ తమకు స్నో స్టేషన్ మరియు ఫన్ జోన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. రానున్న మండు వేసవిలో నాలుగు నెలల పాటు ప్రజా సౌకర్యార్థం తమకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో మేనేజింగ్ పార్ట్నర్ వీ రాకేష్ వర్మ, బండారు జగ్గారావు, శివరాత్రి చిరంజీవి మధుకుమార్ లు కోరారు. ఇందుకోసం పోర్టుకు తమ లాభాల్లో 25% వాటా ఇస్తామని కూడా ఆఫర్ చేశారు.
విశ్వనాథ సంస్థకు డబ్బులు ఇవ్వద్దు
అయితే ఇందుకు విరుద్ధంగా పోర్టు స్టేడియం లో ఫన్ జోన్, వాటర్ పార్క్ అభివృద్ధి చేసిన బండారు జగ్గారావు ,చిరంజీవి మధుకర్ లు ఏప్రిల్ 24 న చైర్మన్ కు మరో లేఖ రాశారు. విశ్వనాథ సంస్థను నమ్మి తాము 6.8 3 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ఇప్పుడు రాజీ పేరిట పోర్టు యజమాన్యం విశ్వనాథ సంస్థకు డబ్బులు ఇస్తే తాము నిండా మునిగిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్వనాథ సంస్థ చెబుతున్న విషయాలను గుడ్డిగా నమ్మకుండా బ్యాంక్ స్టేట్మెంట్లు, వెండార్ ఇన్వాయిస్ లను తనిఖీ చేసి తమ పెట్టుబడులను నిర్ధారించాలని కోరారు. రాజీ పేరిట విశ్వనాథ స్పోర్ట్స్ సంస్థ చేసే అవినీతి అక్రమాలను నిరోధించి నిజాయితీగా పెట్టుబడులు పెట్టిన తమను కాపాడాలని వారు కోరారు.
విశ్వనాథ సంస్థ వ్యవహారాల పైన పోర్టును ముంచేస్తున్న అవినీతి అధికారుల పైన సి.బి.ఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంస్థ లు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణ పూర్తయి నివేదిక వచ్చేవరకు పోర్ట్ స్టేడియం ను పోర్టు ఆధీనంలోనే ఉంచాలని, ఎటువంటి పరిహారం చెల్లించకూడదని, కొత్తగా బహిరంగ టెండర్ పిలవకుండా లీజు ఒప్పందాలు చేయకూడదని కోరుతున్నాం. పోర్ట్ స్టేడియం విశాఖ వాసుల ప్రయోజనాలను కాపాడాలి తప్ప కొందరు వ్యాపారుల ప్రయోజనాల కోసం వ్యాపార వస్తువుగా మారకూడదని భావిస్తున్నాం.