Suryaa.co.in

Telangana

హైదరాబాద్ ఐటీ పరిశ్రమ కు కేటీఆర్ లాంటి నాయకుడు లేని లోటు కనిపిస్తుంది

– బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఐటీ అభివృద్ధిని ప్రశంసించిన కంపెనీ సీఈఓలు
– అమెరికా డల్లాస్ లో ఐటీ కంపెనీ సీఈఓల సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భవిష్యత్తులో లాభమే జరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పని చేస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మన దేశ యువత పోటీ పడగలుగుతుందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్, అక్కడి ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులతో డల్లాస్ లో సమావేశమయ్యారు.

అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల మీద స్పందించిన కేటీఆర్, చిన్న,మధ్య తరహా ఐటీ కంపెనీలు ఇండియాలో ఆఫ్ షోర్ సెంటర్ లను ఏర్పాటుచేసే అవకాశం ఉందన్నారు. మూడేండ్లలో తిరిగి అధికారంలో వచ్చిన తరువాత ఐటి పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ, అనుబంధ పాలసీలతోనే తొమ్మిదేండ్లలో ఐటీ కి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ అయిందన్నారు. ఐటి రంగ అభివృద్ధి కోసం ఇన్నోవేషన్, ఇంకుబేషన్ లో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన విధానాలతోనే చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా హైదరాబాద్ ఐటి పరిశ్రమ ఎదిగిందన్నారు.

2014లో హైదరాబాద్ లో కేవలం 3,23,000 ఐటి ఉద్యోగాలు మాత్రమే ఉంటే.. తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ సంఖ్య పది లక్షలకు చేరిందని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో టెక్ కంపెనీలు అమెరికా ఆవల తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో నెలకొల్పాయన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా చాలా టెక్ కంపెనీలు ఇండియాలో తమ ఆఫ్షోర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాయన్న కేటీఆర్, ఇండియాలోని టైర్ టూ నగరాలకు ఐటి పరిశ్రమ విస్తరించవచ్చన్నారు. కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఏ కంపెనీ కైనా పనిచేయవచ్చని తెలిసిందన్నారు.

బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో టైర్ టూ నగరాలకు ఐటి పరిశ్రమను విస్తరించామని కేటీఆర్ తెలిపారు. ఖమ్మం, మహబూబ్ నగర్,నల్గొండ, సిద్దిపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి 10 నగరాల్లో ప్రభుత్వం ఐటీ హబ్ లను ఏర్పాటుచేసి మొదటి సంవత్సరం రెంట్ ఫ్రీ, ప్లగ్ అండ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ తో పాటు ఎన్నో రాయితీలను కల్పించామని చెప్పారు. అలా ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన NTT డేటా కంపెనీ 500 మంది ఐటీ నిపుణులతో అద్భుతంగా పురోగతి సాధిస్తుందన్నారు.

అమెజాన్, గూగుల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు టైర్ టూ నగరాలకు వెళ్ళలేవన్న కేటీఆర్, చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు మాత్రమే అక్కడికి చేరగలవన్నారు. ఇండియాలోని టైర్ టూ నగరాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, మంచి రైల్, రోడ్ కనెక్టివిటీతో రాబోయే రెండు దశాబ్దాల్లో అద్భుతాలు జరుగుతాయన్నారు.

అమెరికా హైవేల మీద ఇన్వెస్ట్ చేసినందుకే ధనిక దేశం అయిందన్న ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ మాటల్ని గుర్తుచేసిన కేటీఆర్, దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పన ఎంత ముఖ్యమో కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు. మీలాంటి వారి కోసమే ఇండియాలోని యువత ఎదురు చూస్తుందన్న కేటీఆర్, పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పలువురు ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఐటి పరిశ్రమ అభివృద్ధి మందగించిందన్నారు. కేటీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనలో 9 సంవత్సరాల పాటు ఐటీ రంగానికి చేసిన అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కేవలం హైదరాబాద్ పైనే కాకుండా ఇతర ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరింపజేసి చిన్న మధ్య తరహా కంపెనీలకు భారతదేశంలో కార్యకలాపాల నిర్వహణ లాభసాటిగా ఎలా మార్చవచ్చు నిరూపించారని చెప్పారు.

LEAVE A RESPONSE