Suryaa.co.in

Telangana

విశ్వనగరంలో ‘హైడ్రా’ ముఠా కలెక్షన్ల వేట

– సరికొత్త విధ్వంస పాలనకు నాంది
– యూపీ సర్కారును తలదన్నేలా రేవంత్ బుల్డోజర్ పాలన
– మోడీకి ఈడీ, రేవంత్ కు జేసీబీ, ఏసీబీ జనాలను ఏడిపించే వెపన్స్
– కూల్చివేతలు, కాల్చివేతలు, పేల్చివేతలతో ప్రజల విలవిల
– హైడ్రా’ బ్లాక్ మెయిలింగ్ తో కాంగ్రెస్ నేతలకు కాసుల గలగల
– కాంగ్రెస్ ‘చేతి ‘లో తెలంగాణ విధ్వంసం
– ఒక వైపు అందాలపోటీలు, మరో వైపు హైడ్రా పేరుతో లూటీలు
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్: హైడ్రా డిపార్ట్ మెంట్ లో బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సరికొత్త విధ్వంస పాలనకు నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. 200 బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి పదివేల దరఖాస్తులు వచ్చాయని ఆయన గుర్తు చేస్తూ, అభివృద్ధి కోసం కాకుండా వినాశం కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు.

యూపీలో యోగి సర్కారును తలదన్నేలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన సాగుతోందని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లనే నమ్ముకోవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు.

తెలంగాణ సంస్కృతికి సమాధి చేస్తూ అందాలను ఆరబోయడం పాపులర్ సంస్కృతిగా చిత్రీకరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవ భాషను, యాసను గోసపెడుతూ డిల్లీ కాంగ్రెస్ పెద్దల దోపిడీ భాషను పరిచయం చేసిన రేవంత్ రెడ్డి, చివరకు సాధారణ ప్రజల జీవితాల్లోకి బుల్డోజర్ న్యాయాన్ని తేవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.

అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే వారిని బుల్డోజర్‌ పాలన పేరుతో అక్రమ కేసుల్లో ఇరికించి జైలుపాలు చేయటం సర్వ సాధారణమైంది. వారు పేదలా, మేధావులా, చరిత్రకారులా, జర్నలిస్టులా, వైద్యులా అన్నది కాంగ్రెస్ కు పట్టదు. తనకు ఎవరు నచ్చరో, కాంగ్రెస్ పాలనను ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిపై అక్రమ కేసులు పెట్టడం వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడం తెలంగాణ రాష్ట్రంలో నిత్యకృత్యమైంది అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

మోడీకి ఈడీ, రేవంత్ కు జేసీబీ, ఏసీబీ జనాలను ఏడిపించే వెపన్స్ గా మారాయన్నారు. పొద్దున లేస్తే బూతులు తిట్టడాలు, అక్రమ కేసులు పెట్టి కొట్టడాలు, ఉన్న అద్భుతమైన నిర్మాణాలు కూలగొట్టడాలు తప్ప కొత్త కట్టడాలు లేని రేవంత్ పాలన దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. డిల్లీ కాంగ్రెస్ పెద్దలకు డబ్బు మూటలు మోయడమే పనిగా పెట్టుకొని మన హైదరాబాద్ విశ్వనగరంలో ‘హైడ్రా’ ముఠా కలెక్షన్ల వేట సాగిస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యకృత్యమైన కూల్చివేతలు, కాల్చివేతలు, పేల్చివేతలతో ప్రజల విలవిలలాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘హైడ్రా’ బ్లాక్ మెయిలింగ్ తో కాంగ్రెస్ నేతలకు కాసుల గలగల అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ‘చేతి ‘లో తెలంగాణ విధ్వంసం కొనసాగుతోందన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాల ఆకృత్యాలే దర్శనమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా సర్కార్ చేసిన గాయంతో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. పంటలు కొనే దిక్కు లేదు, పెండ్లిండ్లు చేసుకున్న పేదింటి ఆడపిల్లల కు తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కు లేదు. రియల్ ఎస్టేట్ డమాల్ అయింది. రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఆదాయాలు గోల్ మాల్ అయి ప్రభుత్వ పెద్దలను ఎవరూ నమ్మకపోగా చెప్పులెత్తుకెళ్లే దొంగల్లా చూస్తున్నారు. ఉద్యోగులను శత్రువుల్లా చూస్తున్నారు. కాంగ్రెస్ అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆక్రందనల పాలయ్యారని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే అవినీతి కత, అరాచకాలు, అబద్దాలమోత అని ఆయన అభివర్ణించారు.

ఒక వైపు అందాలపోటీలు, మరో వైపు హైడ్రా పేరుతో లూటీలు తప్ప ఏమీ లేదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లితే రేవంత్ పాలనలో రాష్ట్రమంతా దుర్భిక్షంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ.. ఇకనైనా రేవంత్ మోసపు పాలనపై నోరు విప్పు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు సారీ చెప్పు అని ఆయన డిమాండ్ చేశారు.

లేకుంటే రేవంత్ రెడ్డి పాలనపై రగులుతున్న తెలంగాణలో కాంగ్రెస్ మాడిమసిగాక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE