-గిరి‘జనం’పై ‘హైడ్రో’ బాణం
– హైడ్రామా మధ్య పవర్ ప్రాజెక్టు అనుమతి
– వైఎస్ లక్ష్యం నెరవేరుస్తున్న జగన్
– బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేస్తూ బాబు సర్కారు కొత్త జీఓ
– ఆ జీవోను రద్దు చేసిన జగన్ ప్రభుత్వం
– గిరిజన సలహామండలి తీర్మానం లేకపోయినా హైడ్రోకు గ్రీన్‌సిగ్నల్
– ప్రజాభిప్రాయ సేకరణకు పాతర
– పట్టించుకోని కేంద్రం
– 32 గ్రామాలు నేలమట్టం
– 1500 ఎకరాల కాఫీతోట ఖతం
– 600 ఎకరాల అనాస, జామ, కమల తోటలు నేలమట్టం
– రోడ్డుపాలవనున్న 20 వేల గిరి‘జనం’
– నిబంధనలకు నీళ్లొదినా పట్టించుకోని కేంద్రం
– అయినా ‘షిర్డిసాయి మహిమ’తో ప్రాజెక్టు మంజూరు
– అయినా ప్రాజెక్టుకు అనుమతించిన కేంద్రంపై ఆదివాసీల ఆగ్రహం
-హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దంటూ రోడ్డెక్కిన పార్టీలు
– కొండల్లో ప్రతిధ్వనిస్తున్న గిరిజనగర్జన
– ఆదివాసీల ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు
– అనుమతించిన బీజేపీపై గిరిజనుల ఆగ్రహం
– మన్యంలో ‘షిర్డిసాయి’ మహత్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)
జనాలను రక్షించేవాడని షిర్డిసాయికి పేరు. కానీ.. అక్కడ షిర్డిసాయి మాత్రం గిరిజనుల గుండెపై బాణం సంధిస్తున్నాడు. వేలాది జనాలను రోడ్డున పడేస్తున్నాడు. వందల ఎకరాలు నేలమట్టం చేయిస్తున్నాడు. ప్రకృతి ఒడిలో పెరిగిన పంటలను ధ్వంసం చేయిస్తున్నాడు. షిర్డిసాయి తలచుకోవడం.. కేంద్రం తలవంచటం చకచకా జరిగిపోయాయి. మరి అనుగ్రహించాల్సిన షిర్డిసాయినే ఆగ్రహిస్తే, వాళ్ల బతుకులేం కాను? నోరు లేని గిరిజనం, తమ గోడు ఎవరికి వినిపించాలి? కొత్తగా వచ్చే ప్రాజెక్టు వల్ల ఊళ్లు వదిలి వెళ్లేవారికి దిక్కెవరు? షిర్డిసాయి అంత పనిచేస్తాడని ఊహించని ఆ అమాయకులను ఆదుకునేదెవరు? అసలు ఎవరీ షిర్డీ సాయి? పల్లెపై ఎందుకు పగ పట్టారు? ఇదీ ఇప్పుడు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం యర్రవరంలో గిరిజనగోస.
దీన బాంధవుడు షిర్డీసాయి ఏమిటి? ఆదివాసీలను రోడ్డుపాలు చేయడమేమిటనుకుంటున్నారా? పేరులో కొంత గందరగోళం ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం షిర్డీసాయినే! ఆయన పేరు పెట్టుకున్న ఆ కంపెనీ ఇనుపపాదాల కింద, ఇప్పుడు వేలాది గిరిజనుల జీవితాలు నలిగి నాశనం కానున్నాయి. సర్కారే సదరు కంపెనీకి సలాము కొడుతున్నందున, గత్యంతరం లేని గిరిజనం పిడికిలి బిగించింది. షిర్డిసాయి కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకొద్దంటూ, మన్యంవీరులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కారుకు వ్యతిరేకంగా, చింతపల్లి ఏజెన్సీ బంద్‌తో తమ తడాఖా చూపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, గొందిపాకలు పంచాయతీలోని ఎర్రవరం గ్రామంలో.. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి సర్కారు ధారాదత్తం చేసిన హైడ్రోపవర్ ప్రాజెక్ట్, కొండా కోనల నడుమ ప్రశాంతంగా ఉండే గిరిజనుల గూడేల జీవితాల్లో చిచ్చుపెట్టింది. యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును, ఒక్కొక్కటి 300 మెగావాట్ల సామర్థ్యంతో, నాలుగు యూనిట్లు ప్రారంభించాలన్నది లక్ష్యం. తాండవ రిజర్వాయర్‌లో కలిసే పిట్ట ఒరుకుగెడ్డపై , రెండు రిజర్వాయర్లు నిర్మించాలన్నది ఒక ప్రతిపాదన. యర్రవరం ఎగువ డ్యాం నుంచి, గానుగుల దిగువ ప్రాంతంలోని దిగువ డ్యాం వరకూ సొరంగం తవ్వి, మధ్యలో జలవిద్యుదుత్పత్తి యూనిట్ ఏర్పాటుచేయాలన్నది మరో ప్రతిపాదన. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం 5,400 కోట్లుగా అంచనా వేశారు.
నిజానికి 2020లో చింతపల్లి మండలంలో బాక్సైట్ తవ్వకాల ఆలోచనకు నాటి సీఎం వైఎస్ బీజం వేశారు. దానిని నక్సలైట్లు సహా, అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, జీఓ 97ను రద్దు చేస్తూ మరో జీఓ ఇచ్చింది. దానితో మన్యంలో మంటలు చల్లారాయి.
జగన్ సీఎం అయిన తర్వాత, బాబు సర్కారు ఇచ్చిన జీవోను రద్దు చేసింది. ఫలితంగా పులివెందులకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే షిర్డీసాయి కంపెనీపై, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ శరపరంపరగా ఆరోపణలు గుప్పిస్తోంది. అది పాలక ప్రముఖుల బినామీ అని కడప జిల్లా టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
ప్రైవేట్ కంపెనీ ఏజన్సీతో సర్వే చేయించడం, ఆ వెంటనే డీపీఆర్ సిద్ధం చేయించడం, ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ, పర్యావరణ శాఖ అనుమతి కోసం ఢిల్లీకి పంపించడం, ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగించేందుకు అంగీకారం, 2021 డిసెంబర్ 21న కేంద్రం అనుమతులు జారీ చేయడం యుద్ధప్రాతిపదికన జరిగిపోయాయి. ఆ తర్వాత దానిని షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అప్పగిస్తూ, జగన్ సర్కారు మంత్రివర్గం తీర్మానించింది.
షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ పాలక పార్టీకి, ఆత్మబంధువులన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆ కంపెనీకి ప్రాజెక్టు ధారాదత్తం చేసిన వైనం విమర్శలకు గురవుతోంది. ప్రాజెక్టును షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీకి కట్టబెట్టే అత్యుత్సాహంలో.. నిబంధనలకు నీళ్లొదిరారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భూబదాలయింపు చటట్టం అమలులో ఉన్న అల్లూరి జిల్లాలో, ఎవరైనా సరే వాణిజ్యపరమైన ప్రాజెక్టులు, కంపెనీలు పెట్టాలంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. అందులో మూడు వంతుల ప్రజల ఆమోదం తీసుకోవాలి. ఆ మేరకు గ్రామసభలో వాటిని రికార్డు చేయాలి. ఇలాంటి నిబంధలేవీ పాటించకుండానే, షిర్డీసాయి కంపెనీకి ప్రాజెక్టుకి కట్టబెట్టడంపై, గిరిజనులు తిరగబడుతున్నారు.
విచిత్రంగా నిబంధనలు నిశితంగా పరిశీలించిన తర్వాతనే, ఏ ప్రాజెక్టునయినా ఆమోదించే కేంద్రం ప్రభుత్వం కూడా.. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చకచకా అనుమతి ఇచ్చిందంటే, ‘షిర్డీసాయి మహత్యం’ ఏ స్థాయిలో పనిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటు హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటుపై గిరిజనం ఆందోళనచేస్తుంటే.. ఇటు బీజేపీ వారికి మద్దతునివ్వకపోగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుమతులన్నీ ఆగమేఘాలపై జారీ చేయడాన్ని గిరిజనులు మండిపడుతున్నారు. ఫలితంగా ఈ వివాదంలో బీజేపీ అడ్డంగా ఇరుక్కుపోయినట్టయింది.
ఇక తమ జీవనాధారమైన పంటపొలాలు ధ్వంసమయి, జీవితాలు రోడ్డునపడటంపై గిరిజనం గగ్గోలు పెడుతోంది. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా చింతపల్లి ఏజెన్సీ ఏరియాను బంద్ ప్రకటించగా, అనూహ్య స్పందన లభించింది. ఆదివాసీలు మూకుమ్మడిగా రోడ్డెక్కి, సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. మా జీవితాలు హరించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని గర్జించారు. షిర్డీసాయి కంపెనీకి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ గళమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తాము అనాధలమవుతామని ఆందోళన వ్యక్తం చేశారు.
షిర్టీసాయి కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టు వల్ల.. చింతపల్లి, కొయ్యూరు మండలాల్లోని 2500 ఎకరాలు నేలమట్టమవుతాయి. ఆరకంగా నాలుగు పంచాయతీలోని ఆదివాసీలు రోడ్డునపడతారన్నమాట. దాదాపు 20 వేల మంది ఆదివాసీలు, 32 గిరిజన గ్రామాలు ప్రాజెక్టు కోసం పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, మూటా ముల్లె సర్దుకుని పోవాల్సిందే.
అదొక్కటే కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి, తాత ముత్తాతల కాలం నుంచీ సాగుచేసుకుంటున్న పంటలు కూడా ప్రాజెక్టుకు బలవుతాయన్నది గిరిజనుల ఆందోళన. 600 ఎకరాల్లో గిరిజనులు సాగుచేస్తున్న జామ, అనాస, మల తోటలు నేలకూలనున్నాయి. 1500 ఎకరాల్లో సాగుచేస్తున్న మిరియాలు, కాఫీ తోటలు నేలమట్టం కానున్నాయి. మొత్తంగా అక్కడ ఇక పచ్చని చెట్లు, పంటపొలాలు మాయమవుతాయన్నమాట.
ఇవన్నీ.. షిర్డీసాయి కంపెనీ పాలక పార్టీ ప్రముఖుల బినామీలంటూ, టీడీపీ చేస్తున్న విమర్శలను నిజం చేసేవేనని గిరిజన సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజాభిప్రాయసేకరణ చేయకుండా, ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర వైఖరికి బీజేపీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి, ఆదివాసీల బతుకును అంధకారం చేస్తున్నాయని సీపీఐ, సీపీఎం నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ప్రాజెక్టుకు అనుమతివ్వాలని గిరిజనులు కోరుతున్నారు. చూడాలి కేంద్రం ఎలా స్పందిస్తుందో?!