– నన్ను నమ్మినంత కాలం నమ్మండి
– అనుమానం వచ్చిన రోజు నన్ను నమ్మడం మానేయండి
– కులాల పిచ్చి, రాజకీయ పిచ్చి నుంచి బయట పడాలి
– నేను వెళ్తే సీఎస్ ముఖం కూడా చూపించలేదు
– నేను దేన్ని వదిలిపెట్టను.. ఎవర్నీ వదిలిపెట్టను
– కుల గుర్తింపు ఇంటి వరకే పరిమితం కావాలి
– మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు
సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా తానిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాజీనామా చేస్తానంటారు. లేకపోతే అందుకు ఎదుటి పార్టీ వారే కారణమని నిందిస్తారు. కానీ.. నన్ను నమ్మినంతకాలం నమ్మండి. అనుమానం వచ్చినరోజు నమ్మడం మానేయడంటూ చెప్పిన తొలి రాజకీయనాయడు కొత్తగా తెరంగేట్రం చేశారు.
‘నేను నిజాయితీతో కూడిన రాజకీయాలే చేస్తా. ఆ మేరకు నా అడుగులు చూసి, నన్ను నమ్మినంతకాలం నమ్మండి. అనుమానం వచ్చిన రోజు నన్ను నమ్మడం మానేయండి’’అని విభిన్నంగా వ్యాఖ్యానించారు మాజీ డీజీపీ, తాజాగా రాజకీయ అరంగేట్రం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు! తాను నమ్మిన సిద్ధాంతం, నిజం కోసం ఎంతదూరమైనా వెళ తానన్నారు. ఎవరినీ వదిలిపెట్టను. దేనినీ వదిలిపెట్టనంటున్న ఏబీవీ.. ఏపీలో పెరుగుతున్న కులపిచ్చి, కులాంతర వివాహాలు, విద్వేష రాజకీయాలు, జగన్‌పై తన యుద్ధవ్యూహం, సర్వీసులో ఉండగా తన వృత్తిపరమైన అనుభవాలు, తీపి-చేదు ఘటనలను ‘విజిల్’ డిజిటల్ చానెల్‌తో పంచుకున్నారు.
విజిల్: ఒక అధికారి రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో దూరంగా ఎలా ఉండాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?
ఏబీవీ: నిజాయితీ, నిబద్ధతలే 50 శాతం రక్షిస్తాయి. ముక్కుసూటి మనిషి, డబ్బుకు లొంగడు అని తెలిసినప్పుడు.. సగం మంది దగ్గరకు కూడా రారు. అయినా సరే ఒకసారి అడిగి చూద్దాం అనే వాళ్లు ఉన్నారు. ఒత్తిడి చేస్తారు. బదిలీ చేస్తామని బెదిరిస్తారు.. దానికి కూడా సిద్ధంగా ఉంటే.. ఏ ఒత్తిడి ఉండదు. వాట్ యువర్ కమిట్‌మెంట్.. వాట్ యూ స్టాండ్ ఫర్.. నిర్ణయం నీదే.
విజిల్: జగన్ ఏలుబడిలో.. గడిచిన ఐదేళ్లల్లో జరిగిన దాష్టికాలకు, అకృత్యాలకు సంబంధించి, కూటమి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదనే విమర్శలు ఉన్నాయి. అవి సహేతుకమేనా..?
ఏబీవీ: ప్రత్యేకమైన యంత్రాంగం ఏం లేదు. అక్కడక్కడా ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. అవి పని చేస్తున్నాయి.
విజిల్: జగన్ బాధితులకు సాయం చేయాలని, అండగా ఉండాలనే లక్ష్యంతోనే మీరు కాలు బయటపెట్టారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది.?
ఏబీవీ: నేను 35 ఏళ్లు ఉద్యోగం చేశాను. 30 ఏళ్లు ఒకెత్తు.. గత ఐదేళ్లు ఒకెత్తు. ఈ స్థాయిలో వ్యవస్థల విధ్వంసం ఎప్పుడూ జరగలేదు. పోలీసు శాఖ ద్వారా జరిగిన విధ్వంసంలో బాధితులే కాకుండా.. ఇతర విభాగాల బాధితులందరికీ న్యాయం చేయాలంటే ఒకరు ముందుకు రావాలి. వీరికి న్యాయం చేయాలంటే శ్రద్ధ పెట్టాలి. తప్పు చేసిన వారిని శిక్షించాలని అంతా అనుకుంటారు. కానీ కొన్ని రోజులకు బాధితులను పట్టించుకోరు. కాబట్టి ఇలాంటి వారి మీద శ్రద్ద పెట్టాలని నేను భావించాను. ఐదేళ్ల పాలన ప్రత్యక్షంగా చూశాను కాబట్టి.. జగన్ నెవర్ ఎగైన్ అనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నా. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తాను. అన్యాయం చేసిన వాళ్లను చట్టం ముందు దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తా.
విజిల్: జగన్‌పై వ్యక్తిగత కక్ష లేదు అన్నారు. కానీ జగన్ మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కాబట్టి అలా అన్నారా మీరు?
ఏబీవీ: వ్యక్తిగతంగా జగన్ నన్ను ఏం ఇబ్బంది పెట్టాడో.. దానికి నేను ఏ రకంగా సమాధానం చెప్పానో అవన్నీ చెల్లు అయిపోయాయని నేను భావిస్తున్నా.. ఆయన భావిస్తున్నారో లేదో నాకు తెలియదు. నా వరకు అదే విషయాలు పట్టుకుని పనిచేసే మనిషిని కాదు. రిటైర్ అయిపోయాను.. ఇప్పటికిప్పుడు నన్ను ఏం చేయలేడు. ఐదేళ్లు అధికారం అడ్డుపెట్టుకుని చేయగలిగింది చేశారు. నేను వెళ్తే సీఎస్ ముఖం కూడా చూపించలేదు. నేనిచ్చిన కాగితం కూడా తీసుకునేందుకు ఇష్టపడలేదు. అంత కంట్రోల్ చేశారు. నేను కూడా చేయగలిగింది చేశాను. కాబట్టి చెల్లు అయిపోయినట్లు నేను భావిస్తున్నా.
విజిల్: జగన్‌కు మీకు ఎక్కడ వైరం ఎక్కడ మొదలైంది?
ఏబీవీ: నాకు జగన్‌తో పరిచయం కూడా లేదు. అసలు ప్రత్యక్ష వైరం అనేదే లేదు. నేను విజిలెన్స్ విభాగాన్ని చూసినప్పుడు నేనేదో చేశానని ఆయనకు మోసిన వాళ్లు మోశారు. అది ఆయన నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిశీలించాలి. నిజంగా నేను వెధవ పని చేసుంటే.. నా మీద చర్యలు తీసుకోవాలి. కానీ.. విచారణ ఎందుకు?
మనం గట్టిగా నమ్ముతున్నామంటే.. నిజమే అని అనుకున్నారో ఏమో.. లేకపోతే వీడి మీద విచారణ.. దానికి ఆయన వివరణ ఇచ్చుకోవడం అనేది వేస్ట్ అనుకున్నారో ఏమో.. వేటు వేయండి అని నిర్ణయానికి వచ్చారేమో తెలియదు కానీ.. ఎన్నోసార్లు వాళ్ల అనుమానాలు నివృతి చేసేందుకు నేను ఎంతో ప్రయత్నం చేశా.
అడిగితే నిజమే చెప్తా.. ఎంత వరకు నిజమో.. ఎంత వరకు అబద్ధమో చెప్తా… నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా చేయాల్సినంత అవసరం ఎందుకు. జగనే కాదు.. చుట్టు ఉన్న సిస్టమ్ మొత్తం దానిని ముందుకు తీసుకెళ్లలేదు. డీజీపీ, అజయ్ కల్లాం, ప్రవీణ్ ప్రకాశ్, ధనుంజయ్ రెడ్డి, సీఎస్.. చివరికి సీఎస్ఓకు కూడా చెప్పాను. అపాయింట్‌మెంట్ ఇస్తే అనుమానాలు నివృతి చేస్తానని చెప్పా. మరి అడిగారో లేదో తెలియదు. చివరికి నన్ను సస్పెండ్ చేశారు.
విజిల్: నంద్యాల ఉప ఎన్నికలో మీరు టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు.. ఆ విజయం వెనుక మీరున్నట్లు జగన్ నమ్మటం.. ఫలితం టీడీపీకి అనుకూలంగా రావడం.. ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుంది.. నారోజు వచ్చినప్పుడు నేను చెప్తా.. అంటు జగన్ చేసిన వ్యాఖ్యలు.. అన్నట్లుగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మీపై నేరుగానే టార్గెట్ చేశారు. మీరు కూడా హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు…
ఏబీవీ: కాసేపు నిజమే అనుకుందాం… 151 సీట్లతో గెలిచారు కదా.. బోడి ఎప్పుడో జరిగిపోయిన ఉప ఎన్నిక ఫలితాల గురించి అంత పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంత ముఖ్యం కాదు. రాజకీయాల్లో ఉండే వాళ్లు వాటిని లైట్‌గా తీసుకోవాలి. 151 సీట్లు గెలిచిన తర్వాత ఉప ఎన్నికల గురించి కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది?
విజిల్: ఆనాటి ప్రభుత్వం మీ మీద టార్గెట్‌గా వ్యవహరించడం.. కొంతమంది అధికారులు కూడా సాటి అధికారి అనేది కూడా లేకుండా అత్యంత అమానవీయంగా వ్యవహరించడం.. కొన్ని ఫేక్ పత్రాలు కూడా తయారు చేశారు. అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయా?
ఏబీవీ: 2022లోనే నేను పిటిషన్ వేశాను. అది ఇంకా కోర్టులోనే ఉంది. నేను దేన్ని వదిలిపెట్టను. ఎవర్నీ వదిలిపెట్టను. అది ఎక్కడి వరకు వెళ్తుందో.. వాళ్లకు నిజంగా శిక్షలు పడతాయో లేదో వేరే విషయం.. కానీ నేనైతే వదిలిపెట్టను. చివరి వరకు పోరాడుతా. వారి తప్పులను బయటపెడతా.. వెంటపడతా.
విజిల్: సాక్షి దినపత్రిక మిమ్మల్ని మళ్లీ టార్గెట్ చేసింది కదా..
ఏబీవీ: విరుచుకుపడకపోతే విచిత్రం కదా?
విజిల్: మీరే కోడికత్తి శ్రీనును తయారు చేయించి.. అతనికి కత్తి ఇచ్చి పొడిపించారని అర్థం. ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇవాళ కూడా మళ్లీ ఆరేళ్ల క్రితం స్టోరీని ఎలా అర్థం చేసుకోవాలి?
ఏబీవీ: వాళ్లు స్టోరీ రాయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అది ఎవడైనా చూసి నమ్మితే వాళ్ల మీద జారి పడతా. కొంచమైనా ఆలోచించండి. ఏదిబడితే అది రాస్తే నమ్మద్దు అని సూచిస్తా.. అది చూసిన తర్వాతే సాక్షి పత్రిక వాళ్లకు నేను ఒక ట్వీట్ పెట్టా.. ఈ కోడికత్తి విషయంలో అన్ని అనుమానాలు తీర్చేందుకు ఓపెన్ డిబేట్‌కు నేను సిద్ధం.. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయమని కూడా చెప్పా.
కానీ ఎలాంటి బదులు రాలేదు. వాళ్లు ఓకే అంటే.. అన్ని రకాల ఆధారాలతో అన్ని అనుమానాలు నివృతి చేస్తా.. కుట్ర చేసిన వాడినే అయితే.. నేను వెళ్లి వాళ్లను ఎందుకు కలుస్తా.. రాసేవాళ్లకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదా. ఓపెన్‌గా కలవాల్సిన అవసరం ఏముంది నాకు. ఫోటో దిగితే అతనికేం వస్తుంది?
విజిల్: ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిరూపించాలి కదా దానిని?
ఏబీవీ: కొన్ని లక్షణాలు కొంతమంది మనుషులకు, పార్టీలకు కూడా ఉంటాయి. ఒక అబద్ధాన్ని నిజం లాగా నిరూపించేందుకు ప్రయత్నం చేస్తారు. పదే పదే చేస్తారు. చేసిన తర్వాత ఆ అబద్ధాన్ని నిజమని వాళ్లే నమ్ముతారు. ఇదొక మానసిక సమస్య. చాలామంది రాజకీయ నేతల్లో చూశాను. పార్టీ పేపర్ కాబట్టి సాక్షికి కూడా వచ్చింది. అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నంలో మీరు కూడా దానిని నిజమని నమ్మే మానసిక వైకల్యానికి అది దారి తీసింది. అందుకే ఓపెన్ డిబేట్‌కు నేను రెడీ అని చెప్పా.. ఇక వాళ్ల ఇష్టం.
విజిల్: బాల్యం, స్కూల్, తల్లిదండ్రుల వివరాలు క్లుప్తంగా తెలియజేస్తారా?
ఏబీవీ: నూజివీడు తాలుకా పాఠాశాలలో తల్లిదండ్రులిద్దరు ఉపాధ్యాయులు. కృష్ణా జిల్లా మీర్జాపురంలో జన్మించాను. మూడో ఏడాది నుంచే విద్యాభ్యాసం ప్రారంభం. అన్నవరం గ్రామంలోనే ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి. నూజివీడు ఎస్ఆర్ఆర్ జెడ్పీ పాఠశాలలో హైస్కూల్ విద్య పూర్తి. డీఏఆర్ కాలేజీలో ఇంటర్, ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి.
విజిల్: మీరు మంచి రచయిత కూడా అంట కదా.. వేరే పేరుతో..?
ఏబీవీ: తెలుగులో సాహిత్యం చదవటం చిన్నప్పటి నుంచే అలవాటు. ఊర్లో ఉన్న గ్రంధాలయంలో చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు. నూజివీడు లైబ్రరీకి కూడా రోజు వెళ్లేవాడిని. అలాగే డిటెక్టివ్ నవలలు చదివే వాడిని. చిన్నప్పటి నుంచే ఉన్న అలవాటు.. అలాగే కొనసాగింది. పెద్దైన తర్వాత ఇంగ్లీష్ సాహిత్యం కూడా చదివేవాడిని. తెలుగు మీడియం విద్యాభ్యాసం వల్ల, తెలుగులో రాయడం కష్టం అనిపించలేదు. అందుకే అప్పుడప్పుడు రాస్తుంటాను.
విజిల్: అంతకు ముందు పత్రికల్లో మీరని తెలియకుండా మీ కలం పేరుతో రాసిన రచనలు ఏమిటవీ..? కలం పేరు ఏమిటి?
ఏబీవీ: మేథోమధనం అని ఒక శీర్షికను ముందు వారం వారం.. తర్వాత 15 రోజులకు ఓసారి .. ఎడిటోరియల్ పేజీలో రాశాను. వర్తమాన పరిస్థితులపైన, సంఘటనలపైన సైద్దాంతిక ధృక్కోణంలో చూసి వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా రాశాను. దానిని చాలామంది వామపక్ష రచయితలు, సిద్ధాంతకర్తలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లు కూడా వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. దానిని జవాబుగా నేను వ్యాసాలు రాశాను. నాలుగేళ్ల పాటు ఈ ప్రయాణం కొనసాగింది. నా కలం పేరు జాహ్నవి.
విజిల్: పోలీసు ఉద్యోగంలో ఎదుర్కొన్న మొదటి సంఘటన ఏమిటి?
ఏబీవీ: ఏఎస్పీగా ఉద్యోగం చేస్తున్న సమయంలో 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత. నేను పనిచేసిన ఊర్లో.. ముస్లిం జనాభా ఎక్కువ. వాళ్లంతా చేసిన ఊరేగింపు ఉద్రిక్తంగా మారింది. చివరికి దాడులు జరుగుతాయనే వరకు వెళ్లింది. దానిని కంట్రోల్ చేయడమే నేను ఎదుర్కొన్న మొదటి సవాల్.
విజిల్: మీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే సంఘటన అంటే ఏమిటి?
ఏబీవీ: చాలా ఉన్నాయి..ఒకదానిని ఎంచుకోవటం చాలా కష్టం. వాటిల్లో జూబ్లీహిల్స్ బాంబు పేలుళ్ల కేసు విచారణ ఒకటి. విజయవాడ కమిషనర్‌గా పనిచేసిన సమయం చాలా ప్రత్యేకం. చాలా ప్రయోగాలు చేసి విజయం సాధించాం.
విజిల్: ఒక అధికారిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో నైతికత చాలా ప్రామాణికం. మీ వృత్తి ధర్మంలో ఎప్పుడైనా గందరగోళానికి గురైన సందర్భాలున్నాయా?
ఏబీవీ: సవాళ్లు ప్రతి అధికారికి, ప్రతి మనిషికి ఖచ్చితంగా ఎదురవుతాయి. అలాగే అధికారులకు ఇంకా ఎదురవుతాయి. ఎందుకంటే కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి. చాలాసార్లు అధిగమించాం. కేసులు మాఫీ చేయాలని, కేసు తీవ్రత తగ్గించమని, అరెస్టులు ఆపాలని.. ఇలాంటి ఒత్తిళ్లు చాలా వచ్చాయి. అలాగే డబ్బు కూడా ఆశ చూపారు. కానీ ఒత్తిడికి ఏ రోజు లొంగలేదు.
విజిల్: మీరు చేయని ఒక తప్పునకు.. వృత్తి ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తించినందుకు మీరు ఒక ఘటన ఎదుర్కొన్నారు. అప్పటి మీ పై అధికారి ఆంజనేయ రెడ్డి మీకు అండగా నిలబడ్డారు. ఆ ఘటన గురించి?
ఏబీవీ: అనుకోకుండా.. ఒక డీఎస్పీ సెలవులో ఉన్నప్పుడు నేను ఇంఛార్జ్‌గా వ్యవహరించాను. ఆ సమయంలో ఒక గ్రామంలో హత్య జరిగినట్లు తెలిసి ఓఎస్డీ హోదాలో దర్యాప్తు అధికారిగా వెళ్లాను. దారిలో ఒక దగ్గర జనం ఉండటం చూసి ఏమైంది అని అడిగితే.. అగ్నిప్రమాదం జరిగిందని చెప్పారు. అది కావాలని చేసిన అగ్నిప్రమాదం అని నాకు అర్థమైంది. కావాలనే అలా చేశారని నాకు అనిపించింది.
ఇన్సూరెన్స్ చీటింగ్్ కేసు అని అర్థమైంది. ఆ కేసును డీఎస్పీ హోదాలో నేనే టేకప్ చేశాను. సాక్ష్యాలు సేకరించాను. స్టేట్‌మెంట్ రికార్డు చేశాను. వాళ్ల మోసాన్ని బయటపెట్టి అరెస్టులు చేశాం. నేనేదో సింపుల్ కేసు.. కిందవాళ్లకు అప్పగిస్తే.. వదిలేస్తారని భావించి అరెస్టుల వరకు తీసుకెళ్లా.. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే.. అరెస్టు అయిన వారిలో ఒకరు అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు బంధువులు సంబంధించిన వాళ్లు అని.
ఆ తర్వాత పీవీ కుటుంబ సభ్యులతో పాటు పీసీసీ పెద్దలు కూడా నాటి సీఎం విజయభాస్కర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఒత్తిడి భరించలేక విజయభాస్కర్ రెడ్డి నన్ను బదిలీ చేశారు. ఎందుకు చేశారని అడిగితే.. పీవీ బంధువును అరెస్టు చేశావని చెప్పారు. అదో చిన్న కేసు… దాని కోసం నన్ను బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించా… కులం పేరు పెట్టి తిట్టానని కొత్తగా సృష్టించారు. వాళ్ల కులమే నాకు తెలియదని నేను ఎంత చెప్పినా వినలేదు.
నన్ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఒత్తిడి చేశారు. అప్పుడు ఆంజనేయ రెడ్డి దగ్గరకు విషయం వెళ్లింది. ఉన్నది ఉన్నట్లు చేసినా ఇలా బదిలీ చేస్తారా అని ప్రశ్నించాను. నాకు బాధ ఏమిటంటే.. నాటి డీజీపీ పేరు ఎందుకు.. పిలిపించారు. ఏఎస్పీ ర్యాంక్ అధికారిని కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. పైగా నాపైనే కేకలు వేశారు. నేనేదో తప్పు చేసినట్లు నిలబెట్టి మాట్లాడటం నన్ను చాలా బాధించింది.
ఆ విషయంపై ఆంజనేయ రెడ్డి చెప్పాను. వెంకటేశ్వర్రావు ఇవన్నీ ఉంటాయి.. మనం కేవలం చట్టానికి, కోర్టులకే జవాబుదారి. తప్పు చేస్తే.. కోర్టులు మొట్టికాయలు వేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ నీతి సూత్రం నా కెరీర్ చివరి రోజు వరకు గుర్తుంది. ఏం చేసినా సరే.. ఖచ్చితంగా కోర్టులకు బాధ్యత పడాలి.
విజిల్: పోలీసు సేవలోకి రావాలనుకునే నేటి యువతకు మీరిచ్చే సలహా?
ఏబీవీ: కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఈ రోజు చాలామంది యువకులకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఇప్పుడు బాగా పెరిగాయి. వీటిని తట్టుకునే ధైర్యం, స్థైర్యం ముందు నుంచే అలవాటు చేసుకోవాలి. నాలాగా అమాయకత్వంగా ఉండకూడదు.
విజిల్: పోలీసు విభాగంలో సాంకేతిక పరమైన మార్పులు ఏం తీసుకువచ్చారు..?
ఏబీవీ: నాకు టెక్నాలజీ అంటే కొంచెం పిచ్చి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి పోస్టింగ్. అప్పట్లో రహదారులు చాలా అధ్వాన్నం. ప్రయాణం నరకం. జిల్లాలో పర్యటించే సమయంలో టెక్నాలజీ పుస్తకాలు బాగా చదివాను. టెక్నాలజీ విషయంలో అప్‌డేట్‌గా ఉన్నాను. 2003లో చీఫ్ ఇన్‌ఫర్‌మేషన్ ఆఫీసర్ అని ప్రభుత్వం ఓ కార్యక్రమం మొదలుపెట్టింది. ఐఐటీ అహ్మదాబాద్ వాళ్లు ఆ కార్యక్రమం నిర్వహించారు. అవగాహన పెరిగింది.
టెక్నాలజీని పోలీసింగ్‌లో ప్రవేశపెట్టడంలో చాలా ప్రయత్నాలు చేశా. నేను చేసిన ప్రయత్నాలు విఫలం కాలేదు. ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ ఇవ్వటం అనేది దేశంలోనే మొదటి సారి ప్రవేశపెట్టాం. అమెరికాలో అమలవుతున్న విధానాన్ని పరిశీలించి.. దానిని ఏపీలో మొదటిసారి అమలు చేశాం. విజయం సాధించాం కూడా. గ్రామీణ ప్రాంతాల కోసం 3 ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశాం.
పోలీస్ స్టేషన్‌లలో రిసెప్షన్ ఏర్పాటు చేశాం. ఫిర్యాదు చేసిన వెంటనే ఓ రశీదు ఇస్తాం. ఆ వివరాలు ఎస్సై, సీఐ, డీఎస్పీ, డీసీపీతో పాటు కమిషనర్ వరకు చేరుతాయి. పై అధికారికి కూడా మెసేజ్ వెళ్లింది కాబట్టి.. సమస్యలను వెంటనే పరిష్కారం చేశారు. దీని వల్ల ఎఫ్ఐఆర్ సంఖ్య తగ్గింది. పోలీసులపైన, కోర్టులపైన పని భారం తగ్గింది. ఇది నా జీవితంలో చాలా పెద్ద విజయం.
విజిల్: విజయవాడలో ఈట్ స్ట్రీట్ ఆలోచన మీదే అంటారు?
ఏబీవీ: రాత్రి పూట బయట తిరిగే సమయంలో ఒక సందులో కొంతమంది గుమ్మిగూడి ఉన్నారు. కారు చూసి పారిపోయారు. అసలు ఎందుకు పారిపోయారని అడిగాను. విద్యార్థులకు రాత్రి పూట టిఫిన్ అమ్ముతున్న విషయం గుర్తించా. ఇంత చిన్న విషయానికి పోలీసు ఆంక్షలు ఎందుకు అని ఆలోచించా. చీకట్లో నిలబడి దొంగల్లా తినాల్సిన అవసరం ఏమిటని ఆలోచించా.
విజయవాడలో చిన్నప్పటి నుంచి తిరిగాను కాబట్టి.. ఇక్కడి పరిస్థితులు పూర్తిగా తెలుసు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు ఎక్కువ. ఇలాంటి వారి కోసమే ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆలోచించాం. బహిరంగంగా వ్యాపారం చేసుకునేందుకు అనుమతిస్తే.. వాళ్లు ముందు భయపడిపోయారు. లైసెన్స్ అవసరం లేదనే కనీస విషయం కూడా తెలియదు. ధైర్యం చేసి కొంతమంది ముందుకు వచ్చారు. రఘునందనరావు కలెక్టర్, నాగలక్ష్మి సబ్ కలెక్టర్, వీరపాండియన్ కమిషనర్.. వాళ్లే దానిని ప్రారంభించారు.
ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను. రుచిగా, శుచిగా, శుభ్రంగా ఉండాలని ఆదేశించాను. చాలా కఠినంగా వ్యవహరించాను. దీనిని అప్పట్లో ఉన్న మేయర్, శాప్ అధికారులు అభ్యంతరం చెప్పారు. అందరితో మాట్లాడి సమస్య పరిష్కరించాం. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఒక ముస్లిం మహిళ ఒంటరిగా ఈట్ స్ట్రీట్‌కు వచ్చి తనకు కావాల్సినవి తీసుకెళ్లే పరిస్థితి విజయవాడలో ఉంది. ఇది కదా నిజమైన స్వాతంత్ర్యం?
విజిల్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలో కులాల కుంపట్లు.. కొత్తగా మతాల రగడ మొదలైంది. ప్రతి కులంలో మహనీయులు, భావ దరిద్రులు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాష్టికానుంచి బయటపడే పరిస్థితి లేదంటారా?
ఏబీవీ: దానంతటది బయటపడలేదు. ఇలా అని మనం ఏం చేయకపోతే దాన్నుంచి బయటకు రాలేం. ఇంకా ఇరుక్కుపోతాం. ప్రతి కులంలో ఉపకులాలను కూడా సృష్టిస్తారు. కాబట్టి దాని కోసం పని చేయాలి. ఒకరి వల్ల సాధ్యం కాదు. ఒకప్పుడు సోషల్ నార్మ్ అనుకున్నవి కాలక్రమేణా దానిపై చర్చలు జరిగి.. మేధావులు మాట్లాడుతూ.. ఇంకా ఎక్కువ మంది ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినపుడు సమాజంలో మార్పు వచ్చింది.
అది తప్పు అని ఎత్తి చూపే మేధోపరమైన ఉద్యమం అవసరం. పాత రోజులతో చూస్తే ఇప్పుడు మూఢ నమ్మకాలు తక్కువ. అలాగే ఆచార వ్యవహారాల్లో, నియమాల్లో మార్పులు వచ్చాయి. పెళ్లిళ్లు, వర కట్నం విషయంలో చాలా మార్పులు. సామాజికంగా అభిప్రాయాలు మారాయి. సాహిత్యం, సినిమాలు, కళల్లో వివరించారు. డిబేట్ జరగాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.
కులాల దరిద్రం నుంచి మనం బయటపడాలి అంటే ఇలాంటి ఉద్యమం అవసరం. నా ఉద్దేశ్యంలో చారిత్రకంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 1953 నుంచి ఆంధ్ర, తెలంగాణ కలిసి పోయిన 1956 తర్వాత నుంచి కూడా.. ఈ కులాల జాడ్యం ఇంకా వదలకపోవడానికి కారణం.. మనం తెలుగు మాట్లాడే వారికి కులం తప్ప వేరే ఏ గుర్తింపు నేర్పలేదు. ఆంధ్రులుగా ఒక గుర్తింపు, తెలుగు వారిగా ఒక గుర్తింపు కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు.
మండలి వెంకట కృష్ణారావు విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాషా సంరక్షణ గురించి చాలా కృషి చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా నేను పాల్గొన్నా. తెలుగు గుర్తింపు కోసం జలగం వెంగళరావు బాగా కృషి చేశారు. ఆ తర్వాత ప్రపంచమంతా తెలుగు వారికి గుర్తింపు తీసుకువచ్చింది ఎన్టీ రామారావు. ఆయన హయాంలో కులాల గొడవలు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయి.
మేరు పర్వతం లాంటి ఆయన ముందు ఏ రకమైన విభజనలు పని చేయలేదు. ఆయనకు కులం అంటించేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా సరే ఆ మహానుభావుడి ముందు అవేవీ పెద్దగా పనిచేయలేదు. తెలంగాణలో ఈ జాడ్యం కొంచెం తక్కువ స్థాయిలో ఉండటం వల్ల.. ఆ రోజుల్లో బాగా గడిచింది. తెలుగు గుర్తింపు కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అప్పుడే కులం అనేది చేతుల్లో ఉండే గుర్తింపు. దానిని రాజకీయ పరంగా అంగీకరించినంత వరకు రాజకీయ నాయకులు దానిని ఇంకా వాడుతూనే ఉంటారు.
సమస్యను ఎత్తి చూపిస్తున్నా.. పరిష్కారం చూపించటం లేదు. పరిష్కారం అవసరం. ముఖ్యంగా ఏపీలో గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా బతకాలి అంటే.. దీని మీద మేధావులు అంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో భావ విప్లవం తీసుకురావాలి. కుల గుర్తింపు ఇంటి వరకే పరిమితం కావాలి. బయటకు వచ్చి మాట్లాడటం అసహ్యించుకునే రోజు రావాలి. అప్పుడు దీని ప్రభావం రాజకీయాల మీద తగ్గుతుంది. రాజకీయాల మీద తగ్గినపుడు మిగిలినవన్నీ సర్దుకుంటాయి.
విజిల్: దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య కులం. రాజకీయ నేతలు కూడా కులాల ప్రాతిపదికనే ఓటు రాజకీయాలు నడుపుతున్నారు. అయితే సోషల్ రీ ప్రొడక్షన్ జరగకుండా ఈ కులజాడ్యం వెళ్లిపోవడం సాధ్యమేనా?
ఏబీవీ: సోషల్ రీ ప్రొడక్షన్ అంటే.. కులాంతర వివాహాలు జరగాలంటారా? ఇది సమస్యకు పరిష్కారం కాదు. కులం ప్రభావం రాజకీయాల మీద, సమాజం మీద తగ్గించడానికి కులాంతర వివాహం సాయం చేస్తుందంతే.. కానీ అదే పరిష్కారం కాదు.
విజిల్: రీ ప్రొడక్షన్.. అంటే జాతి ఉన్నంత వరకు ఇది ఇలా మోయాల్సిందే…
ఏబీవీ: అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఐడెంటిటీ ఫీ కొంచమైన ఫీల్ అవుతారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన వారు కూడా ఏ ప్రాంతం నుంచి వచ్చారో దానిపైన ఆధారపడతారు. ఆ ప్రాంతంపైనే ఎక్కువగా ఆధారపడతారు. అక్కడ కులాంతర వివాహలు ఎక్కువ కాబట్టి.. అక్కడ కులం, ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. కానీ నేను ఐరిష్ కాబట్టి.. ఇలా ఉంటాను అంటే.. అంతా అసహించుకుంటారు. ఆ రకంగా మన దగ్గర కూడా వ్యవహరించాలి. అలా చేస్తేనే సమాజంలో వచ్చిన రోజు.. దాని ప్రభావం ఎవరి మీద ఉండదు. ఉండకూడదు.
విజిల్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ కేడర్, జగన్ బాధితుల కోసం ప్రత్యేకమైన యంత్రాంగం ఏర్పాటుచేసి దానికి ఏబీ వెంకటేశ్వర్రావు లాంటి అధికారిని నియమిస్తే.. అరాచకాలను బయటకు తీసేందుకు ఆలపాటి సురేష్ కుమార్ అనే సీనియర్ పాత్రికేయులు విధ్వంసం అనే 600 పేజీల పుస్తకం రాశారు. దానికి ఓ ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసి.. ఓ అధికారిని నియమించాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. మిమ్మల్ని పెడతారని కూడా అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తూ జీవో కూడా విడుదల చేశారు. దానిపైన ఎక్కడా మాట్లాడలేదు కూడా. దాని గురించి మీ స్పందన?
ఏబీవీ: మనిషికి జీవితకాలం తక్కువ. మనకున్న సమయంలో ఏం చేయగలమనే విషయంపై స్పష్టత ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. ప్రాధాన్యత ప్రకారం నడుచుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్‌సీపీ అనే రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనేది వాళ్లు అధికారంలోకి రాకముందే నాకు అవగాహన ఉంది. కానీ ప్రజలు గెలిపించారు.. ఆయన ఐదేళ్ల పాలన చూశారు.
కానీ మళ్లీ అలాంటి పరిస్థితి ఏపీకి రాకూడదు అనే కృత నిశ్చయంతో ఆ పనిలోనే నా జీవిత కాలాన్ని గడిపేందుకు నేను అడుగులు వేస్తున్నా. నా లక్ష్యానికి నాకు వచ్చిన పదవికి సంబంధం లేదు కాబట్టి.. దానిని తిరస్కరించాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నా అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తా. ఇదే నాకు ఈ రోజు ఉన్న ప్రాధాన్యత..
విజిల్: జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ముందే ఊహించా అన్నారు. జగన్ అధికారంలోకి వస్తున్నాడు అని మీరు ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఉన్నప్పుడు ముందే ఊహించారా?
ఏబీవీ: ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చేసినప్పటి పనుల గురించి బహిరంగంగా మాట్లాడటం విజ్ఞత కాదు.. అది రాజనీతిజ్ఞత కాదు. దాని గురించి నేను కామెంట్ చేయను.
విజిల్: జగన్ పాలనలో జరిగిన బాధితులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తామన్నారు.
ఏబీవీ: పర్యటన అనేది నాకు లేదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తా.. ఎక్కడెక్కడ నా అవసరం ఉందో.. అక్కడికి తప్పకుండా నేను వెళ్తా.. అందులో భాగంగానే కోడికత్తి శ్రీను కుటుంబాన్ని కలిశాను. అతని జీవితం మొత్తం నాశనం చేశారు. అతని కుటుంబం కూడా పూర్తిగా నాశనం. అతను చేసింది తప్పే కదా అని కొంతమంది ప్రశ్నించారు.. నిజమే.. అతను చేసింది వంద శాతం తప్పు.. నేను దానిని సమర్థించటం లేదు.
తెలిసో తెలియకో.. వయసెంత.. ఏం అవగాహన ఉంది.. ఇంటర్ కూడా చదవలేదు. జీవితం మీద ఏం అవగాహన ఉంది.. జగన్ అంటే ఒక పిచ్చి అభిమానం తప్ప అతనికి ఏం తెలియదు. ఒకప్పుడు వైఎస్ఆర్ అంటే అభిమానం. తర్వాత జగన్ అంటే అభిమానం. తమిళనాడులో రాజకీయ నేతను అరెస్టు చేసినప్పుడో, నాయకుడికి దెబ్బ తగిలినప్పుడో.. ఆత్మహుతి చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. రాజకీయాల్లో అంత పిచ్చి ఉంటుంది. శ్రీనుకు కూడా అలాంటి పిచ్చే ఉంది.
కాకపోతే.. కాస్త తక్కువ స్థాయిలో ఉంది. ఆ పిచ్చి వల్లే పిచ్చి పని చేశాడు. అందుకు శిక్ష కూడా అనుభవించాడు. చిన్న తప్పుకే ఉరి వేస్తారా? ట్రాఫిక్ లైట్ జంప్ చేస్తే జైలులో పెడతారా? తప్పు చేశాడు.. చేసిన తప్పుకు నాలుగు రెట్లు శిక్ష అనుభవించాడు. ఇవాల్టికి స్వేచ్ఛ లేదు. ఎక్కడికైనా వెళ్లి పని చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే విచారణ పూర్తి కాలేదు కాబట్టి. పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలి.
ఎందుకంటే పిటిషన్ మీద పిటిషన్ వేసి ఆ విచారణను జగన్ జరగనివ్వడం లేదు. ఆయనకెందుకు బాధ? జగన్ నిందితుడిగా ఉన్న సీబీఐ, ఈడీ కేసులు సాగదీస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అవి రుజువైతే శిక్ష పడుతుంది కాబట్టి. సాక్షిగా ఉన్న కేసులో కూడా విచారణకు రావడానికి ఏమిటి భయం?
ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. ఉద్యోగం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వడ్డీలు కట్టలేక పోతున్నారు. ఇదీ పరిస్థితి. అందుకే నిన్న అక్కడికి వెళ్లాను. నేను చేయగలిగింది, లాయర్ చేయగలిగింది, స్థానికులు చేయగలిగింది చేస్తాం. అందరం తలో బాధ్యత పంచుకున్నాం. దానికి కూడా కుట్ర అంటున్నారు. కుట్ర చేసే ఆలోచన ఉంటే.. చాటుగా కలుస్తాం కానీ… ఓపెన్‌గా ఎందుకు కలుస్తాం. ఇది వాస్తవం.
విజిల్: తెలుగు సమాజానికి మీరు ఇచ్చే సందేశం?
ఏబీవీ: విజిల్‌తో పాటు నేను కూడా రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఇకపై సమాంతరంగా ప్రయాణం సాగుతుంది. విజిల్ అనే సంస్థ నిజానికి కట్టుబడి ఉంటుంది. నిజాయతీకి కట్టుబడి నిజాలు చెబుతుంది. కాబట్టి ఈ సంస్థను నమ్మొచ్చు. నేను కూడా నిజాయతీగానే పనిచేసిన వాడినే… నిజాయతీగానే నిబద్ధతతోనే రాజకీయాలు చేస్తా.. నన్ను నమ్మినంత కాలం నమ్మండి.. అనుమానం వచ్చిన రోజు నన్ను నమ్మడం మానేయండి.
కానీ.. విజిల్ మీద నా మీద మనలాంటి ఎంతో వందల వేల మంది మీద కీలక బాధ్యత ఉంది. ముఖ్యంగా తెలుగు సమాజాన్ని, ఆంధ్ర సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా విషయాల్లో సంస్కరణలు తీసుకురావాలి. ఈ కులాల పిచ్చి, రాజకీయ పిచ్చి నుంచి బయట పడాలి. సాధించగలిగినటువంటి విజయాల గురించి ఆలోచించుకోవాలి. ప్రజలంతా ఇందులో వీలున్నంత వరకు భాగస్వామ్యులు కావాలి. విజిల్‌తో పాటు నాలాంటి వారిని ప్రొత్సహిస్తే… ఇంకా మెరుగ్గా పని చేస్తాం.