November 14, 2026

చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు

  • హక్కుల కోసం నిలదీస్తారా? లేక తలవంచి మౌనంగా తిరిగొస్తారా?
  • గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి
  • ఈ ప్రాజెక్టులో తెలంగాణకు 148 టీఎంసీల్లో 75 టీఎంసీల వాటా కేటాయించాలి
  • పోలవరం–బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి
  • తెలంగాణ 968 టీఎంసీల హక్కుపై ప్రధాని నుంచి హామీ తేవాలి
  • సమ్మక్క సారక్క డీపీఆర్‌ను వెనక్కి పంపడం తెలంగాణకు అన్యాయం
  • ఇచ్చంపల్లి కాదని పోలవరం నుండి ప్రాజెక్ట్ మొదలు పెడితే సహించేది లేదు
  • తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ మరో ప్రజా ఉద్యమం చేస్తుంది
  • సీఎం రేవంత్, ఉత్తం కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? లేక తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్న పరిస్థితి.

తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధిస్తామని ప్రధాని వద్ద స్పష్టమైన హామీ తీసుకోవాలనీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 47 టీఎంసీల జలాల హైడ్రాలజీ క్లియరెన్స్ ఇప్పటికే పూర్తయిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం దారుణం.

ఇప్పటికే ఆమోద ప్రక్రియలో ఉన్న డీపీఆర్‌కు కొత్త మార్గదర్శకాలను వర్తింపజేయడం ఎంతవరకు సమంజసం? హైడ్రాలజీ సహా కీలక విభాగాల పరిశీలన పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను వెనక్కి పంపడం తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు. సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు కేవలం టీఏసీ అనుమతి మాత్రమే రావాల్సి ఉంది. అలాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. కేంద్రం వద్ద తెలంగాణ వాదనను బలంగా వినిపించే చిత్తశుద్ధి రేవంత్ ప్రభుత్వానికి లేక పోవడం సిగ్గుచేటు.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఆరు నెలలుగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రతి వేదికపై మాట్లాడుతున్నారు. నిన్న విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులోనూ గోదావరి–కావేరి అనుసంధానాన్ని పోలవరం నుంచి బనకచర్ల వరకు చేపడతామని ప్రకటించారు. అసలు గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు తెలంగాణలోని ఇంచంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా తమిళనాడులోని గ్రాండ్ అనికట్ వరకు ప్రతిపాదించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా స్పష్టమైన వైఖరి తీసుకుంది. 968 టీఎంసీల గోదావరి జలాలపై తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ ముందుగా కేంద్రం అనుమతులు ఇవ్వాలి, ఆ తర్వాతే నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేసింది. గోదావరి నుంచి కావేరికి తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం అంటే 75 టీఎంసీలు కేటాయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబట్టింది.

ఇంచంపల్లి నుంచే ఈ ప్రాజెక్టు చేపట్టాలని, తెలంగాణ భూభాగం మీదుగా అలైన్‌మెంట్ ఉండాలని స్పష్టం చేసింది. మన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర టాస్క్‌ఫోర్స్ సైతం హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకే NWDA ఇచ్చంపల్లి నుంచి గ్రాండ్ అనికట్ వరకు డీపీఆర్ రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
అందులో నుండి కీలకమైన మూడు రాష్ట్రాల తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుండి అనుమతులు కూడా వచ్చాయి.

కేవలం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఆర్థికంగా వయబుల్ కానీ, ఏపీ మినహా ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం లేని ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. పోలవరం నుంచి బనకచర్లకు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మార్చారు. తెలంగాణకు చెందాల్సిన జలాలను లేకుండా చేస్తూ, తెలంగాణకు సంబంధించిన జాతీయ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టి ఏపీకి అనుకూలంగా మార్చే కుట్రను సహించేది లేదు.

తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈ విషయాన్ని కేంద్రం దగ్గర తేల్చుకొని రాష్ట్రానికి రావాలని సూచిస్తున్నాం.
రేపటి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ డిమాండ్లు: తెలంగాణకు హామీగా ఉన్న 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి. పాత మార్గదర్శకాల ప్రకారమే సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించి, వెంటనే టీఏసీ అనుమతి ఇప్పించాలి. గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి. ఈ ప్రాజెక్టులో తెలంగాణకు 148 టీఎంసీల్లో 75 టీఎంసీల వాటా కేటాయించాలి.

తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పోలవరం–బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. తెలంగాణకు సంబంధించిన ఈ కీలక అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించకుండా, కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా వస్తే ఢిల్లీ పర్యటన అర్థరహితం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. తెలంగాణ హక్కులను కాలరాసే కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. తెలంగాణ నీటి హక్కులను కాపాడుతాం.

Total Visitors: 3,424,840