-స్వామీజీలు పెదవి విప్పరేం?
-ఆలయ భూముల స్వాహాపై స్పందించరా?
-మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
దేవాదాయ శాఖలో 41 వేల ఎకరాల భూములు మాయమయ్యాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ‘‘రెండేళ్ల క్రితం వరకూ రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కలిపి 4,21,941 ఎకరాల భూమి ఉందని లెక్కల్లో చూపించేవారు. ఆ శాఖ రికార్డుల్లో కూడా ఇదే లెక్క చూపించేవారు. ఇప్పుడా భూములు 3,80,600 ఎకరాలకు తగ్గిపోయాయి. దాదాపు 41,340 ఎకరాలు తగ్గి పోయాయి. 2 వారాల క్రితం దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయాల భూములపై సమీక్ష నిర్వహించారు. మొన్నటి వరకూ రికార్డుల్లో ఉన్న భూమి ఎలా తగ్గిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
రాష్ట్రంలో చాలా మంది స్వామీజీలు ఉన్నారు. ఇంత ఆక్రమణ జరుగుతున్నా ప్రజల్ని ఎందుకు చైతన్యం చేయడం లేదు. మనలాంటి వాళ్లకి ఆపద వస్తే దేవుడుకి చెప్పుకుంటాం. అలాంటిది దేవుడు భూములకే ఆపద వస్తే పరిస్థితి ఏంటి?. దీనిపై మొక్కుబడిగా విచారణ జరపకుండా.. న్యాయపరమైన విచారణ జరిపించి ఆక్రమణదారులపై కఠినచర్యలు తీసుకోవాలి.’’ అని అయ్యన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవుడి కోసం-భక్తుల కోసం ఇప్పటికయినా స్వామీజీలు పెదవి విప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.