– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి
సంఘటన.. సమైక్యతతోనే హిందుత్వం వర్ధిల్లుతుందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి పండరినాథ్ అన్నారు. కులాలు, ప్రాంతాలు, పేద, ధనిక, నిమ్న, అగ్రవర్గాల అంతరాలు తొలగిపోయి.. హిందుత్వం దేదీప్యమానంగా వెలుగొందాలని వారు ఆకాంక్షించారు. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రశిక్షణ శిబిరంలో భాగంగా వారు మాట్లాడారు. భాగ్యనగర్ లోని బండ్లగూడ జాగిర్ ప్రాంతంలో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో నిర్వహించిన శిబిరం సందర్భంగా సోమవారం ఉదయం సత్సంగ్ ర్యాలీ నిర్వహించారు.
కిస్మత్పూర్, బండ్లగూడ జాగిర్, సన్ సిటీ ప్రాంతాలలో హిందూ ధర్మాన్ని కొనియాడుతూ భక్తి పాటలు పాడుతూ ర్యాలీ సాగించారు. విశ్వహిందూ పరిషత్ దక్షిణ భారత అధికారి కేశవ్ హెగ్డే కాషాయం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి హిందువు సత్సంగంలో పాల్గొని సమైక్యంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. సత్సంగంలోనే హిందుత్వం శక్తి దాగి ఉందని.. ప్రతి నిత్యం భగవంతుడిని భజిస్తూ ధర్మ రక్షణ చేయాలన్నారు.
గుంట నక్కల్లా వేచి ఉన్న పరాయి మతస్తులు హిందువులను మతం మార్చేందుకు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ఇతర మతస్తుల ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి హిందువు తనను తాను కాపాడుకొని, ధర్మాన్ని రక్షించాలని విశ్వహిందూ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు కోరారు. కాషాయ రంగులో భగవంతుడు ఉన్నాడని.. అందుకు కాషాయ జెండాను గుండెల మీద ఉంచుకొని ధర్మరక్షణ కోసం నిరంతరం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ లో పనిచేస్తూ గోవులను కాపాడుతూ.. మతమార్పిడులను అరికడుతూ.. ధర్మరక్షణ కోసం పోరాడితే భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేసినట్లేనని వారు వివరించారు.
హిందువులు ఎవరి ఆరాధ్య దైవాన్ని వారి వారి భక్తి నిష్టలతో పూజించుకోవచ్చు అని.. అంతిమంగా ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్ లో చేరాలని వారు కోరారు. ధర్మరక్షణ కోసం ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్ ను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. మన ధర్మం మరుగున పడితే.. మన అస్తిత్వం అంతమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మరక్షణతోనే హిందువుల మనుగడ సాధ్యమని విశ్వహిందూ పరిషత్ పెద్దలు వివరించారు.
కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సత్యం జి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి, సహకార్య దర్శులు రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, శశిధర్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ జి, మోహన్ రావు, కోశాధికారి లక్ష్మీ శేఖర్, గోరక్ష ప్రముఖ్ ఇసంపల్లి వెంకన్న, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ ప్రముఖ్ శివరాం, దుర్గా వాహిని ప్రముఖ్ వాణి సక్కుబాయి, ధర్మ ప్రసార్ ప్రముఖ్ వెంకటేశ్వర జాదవ్, అర్చక పురోహిత ప్రముఖ్ సురేష్, కన్నెబోయిన వెంకట్, కిషోర్, పుప్పాల వెంకటేశ్వరరావు, గణేష్, వీరేశలింగం, మహేష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, రంగనాథ్, శ్రీనివాస్, తిరుపతి, సాయి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 230 మంది ప్రతినిధులు రెండు రోజులపాటు శిక్షణ పొంది వారి వారి స్థానాలకు చేరుకున్నారు.