హైదరాబాద్ మెట్రో రైల్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం రూపొందించిన “హైదరాబాద్ మెట్రో రైల్ – ఎ పిక్టోరియల్ ఓవర్ వ్యూ” పుస్తకం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ పుస్తకంలో దాదాపు 2000 ఛాయాచిత్రాలు ఉపయోగించారు.భోపాల్‌లో జరిగిన పిఆర్‌ఎస్‌ఐ జాతీయ సదస్సులో మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్య మంత్రి కైలాష్ విశ్వాస్ సారంగ్ ఈ అవార్డును సిపిఆర్‌ఓ మల్లాది కృష్ణానంద్‌కు అందజేశారు.
“ఒక చిత్రం వెయ్యి పదాలు మాట్లాడుతుంది” అనే వాక్యం నిజమైన స్ఫూర్తితో, ఈ 800 పేజీల కాఫీ టేబుల్ పుస్తకం రూపొందించారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహించిన ఈవెంట్‌లు మొత్తం ఈ పుస్తకంలో కవర్ చేశారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్ మరియు స్టేషన్ల చురుకైన నిర్మాణ దశలో ఎదుర్కొన్న వివిధ అడ్డంకులను, వాటితో బాటు పూర్తి అయిన తర్వాత మనోహరమైన ఛాయాచిత్రాలతో ఈ పుస్తకం రూపొందించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ గురించి వివరంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ పుస్తకం పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. జాతీయ అవార్డు అందుకున్న మల్లాది కృష్ణానంద్ ను హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు.