Suryaa.co.in

Features

ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి వడ్డీరేట్లు తగ్గిపోతే అన్నీ మంచి రోజులేనా!

ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాల్లో, చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిన వర్ధమాన దేశాల్లో ఇప్పుడు ఆర్థికవేత్తల నుంచి మధ్యతరగతి ప్రజల వరకూ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు. జనం వినియోగించే వస్తువులు, సరకుల ధరలు పెరుగుతూ పోవడం ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. అమెరికా నుంచి ఇండియా వరకూ ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులే మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) బుధవారం ‘దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేకొద్దీ 2024లో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించగలం,’ అని సూచనప్రాయంగా తెలిపింది. దీంతో ఇండియాలో స్టాక్‌ మార్కెట్లలో సూచీలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్ని నిర్ణయించే ద్రవ్యోల్బణంపై తరచు ‘ఫెడ్‌’ ప్రకటనలు చేస్తూ అమెరికన్లను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుత ద్రవ్యోల్బోణం వచ్చే ఏడాది లేదా తర్వాత ఏ స్థాయిలో అదుపులోకి వస్తుందనే విషయంపై ఫెడ్‌ లేదా దాని సభ్యులు అంచనా వేసి చెబుతుంటారు. ఈ అంచనాల ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తోంది ఫెడ్‌.

రాబోయే మూడేసి నెలల కాలాల్లో వడ్డీ రేట్ల తగ్గింపు లేదా హెచ్చింపు ఎలా ఉండవచ్చనే అంశంపై ప్రజలకు ఫెడ్‌ ఈవిధంగా ముందే సూచనప్రాయంగా చెబుతోంది. ఇలా ద్రవ్యోల్బణంపై ఫెడ్‌ వేసే అంచనాలు లేదా జోస్యాలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫెడ్‌ అభిప్రాయలపై పార్టీల్లో చర్చలు విస్తృతంగా సాగుతాయి. చివరికి ఫలానా ఫలానా వస్తువుల ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే విషయంపై సగటు అమెరికా వినియోగదారుడు ఒక నిర్ధారణకు వస్తాడు. బ్యాంకు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణంపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయం ఆసక్తిదాయకం. అర్ధశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టే అంతా జరుగుతుందా? అంటే, వాటిలో వివరించిననట్టు ప్రపంచం నడవదు.

పుస్తకాల్లో చెప్పినట్టు వాస్తవ ప్రపంచంలో జరగదని నిరూపిస్తున్న మన అనుభవాలు
‘వ్యాపారులు తమ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించాలనుకున్నప్పుడు వారికి అవసరమైనంత మంది కార్మికులు అందుబాటులో లేనప్పుడు ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులకు డిమాండ్‌ ఉండడంతో వారు అధిక వేతనాల కోసం పట్టుబడతారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. అప్పుడు వేరే దారిలేక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు నిర్ణయిస్తారు. జీతాలు పెరగడం వల్ల కార్మికుల జేబుల్లోకి ఎక్కువ డబ్బు వస్తుందిగాని షాపుల్లో కొనుగోలు చేసే అన్ని వస్తువుల ధరలు వారు ఊహించినదాని కన్నా ఎక్కువ ఉంటాయి.

వేతనాల హెచ్చింపుతో వచ్చిన ప్రయోజనం ధరల పెరుగుదల వల్ల మాయమౌతుంది. ఇక ధరలు ఇలాగే పెరుగుతూ పోతుంటాయనే ఆందోళనతో కార్మికులు మరింత ఎక్కువ వేతనాలు కావాలంటూ ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా వర్కర్ల జీతాలతోపాటే వస్తువుల ధరలూ పెరుగుతుంటాయి. దీన్నే «‘ధరల వలయం’ అని సాధారణ ఆర్థికవేత్తలు పిలుస్తారు.’ ఈ రకమైన సూత్రీకరణలు అర్ధసత్యాలేగాని సంపూర్ణ వాస్తవాలు కావు. సరకుల కొరత ఉన్నప్పుడు తమ లాభాలు పెంచుకోవడానికి వ్యాపారులు చేసే ప్రయత్నాల వల్ల (ధరలు పెంచడం ద్వారా) కొన్ని కాలాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిల్లో ఉంటుందని అనేక అధ్యయనాలు పక్కాగా నిరూపించాయి.

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే?

అసలు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే ఏమిటి? అనే విషయంపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ఫెడ్‌ తన ప్రకటనలో వాడిన ఈ మాటలకు (ఇన్‌ఫ్లేషన్‌ ఈజింగ్‌ ) అర్ధం–ద్రవ్యోల్బణం తగ్గిపోవడం. అంటే ధరలు తగ్గవు. గతంతో పోల్చితే ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అమెరికాలో ఇళ్లలో వాడే సరకుల ధరలు కిందటేడాది 12% పెరగగా, గడచిన 12 మాసాల్లో కేవలం 2 శాతమే పెరిగాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇంజిన్‌ మాదిరిగా ముందుకు నడిపించే ఈ దేశంలో గతేడాది ద్రవ్యోల్బణం 9.1% ఉండగా, ఈ ఏడాది నవంబర్‌లో 3.1% గా నమోదైంది. ఈ లెక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం వచ్చే ఏడాది కూడా ఇప్పటిలా ఆశావహంగా ఉండొచ్చని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా.

– వేణుంబాక విజయసాయిరెడ్డి
( రాజ్యసభసభ్యులు)

LEAVE A RESPONSE