-డీజీపీ నియామకంలో నిబంధనలను పాటించమంటే … పాటించరు
-సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రెండేళ్ల పాటు పదవిలో కొనసాగించే అవకాశం కల్పించాలి
-రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారికి సుదీర్ఘ లేఖ రాసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
రాష్ట్రంలో ప్రజలను పోలీసులు
ఇలాగే హింసిస్తే అంతర్యుద్ధానికి పరిస్థితులు దారి తీయవచ్చునని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారికి ఆయన ఓ సుదీర్ఘ లేఖ రాశారు. డీజీపీ నియామకంలో నిబంధనలను పాటించమంటే, పాటించరన్న ఆయన, అడిగితే తంతారని… తన్నారు బాబాయ్ అంటే తన్నించుకోండి అన్నట్లుగా వ్యవహార శైలి ఉన్నదని విమర్శించారు. నిబంధనలను కాదని, డీజీపీ నియామకం చేపట్ట డాన్ని నిరసిస్తూ, తాను గతం లో రెండుసార్లు యూపీఎస్సీకి లేఖ రాశానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను అరికట్టడానికి, తన వంతు ప్రయత్నాన్ని తాను చేస్తున్నానన్న ఆయన, మానవ ప్రయత్నానికి భగవంతుడు తోడుగా ఉన్నారన్నారు. ప్రజలు కూడా తోడుగా ఉండాలని కోరారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారు నేరుగా జోక్యం చేసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం అడిగితే, వాళ్లు పచ్చి అబద్దాలకోరులని, ఇదంతా అబద్ధమని చెప్పే అవకాశం ఉందన్నారు. కాబట్టి రాష్ట్రపతి కార్యాలయం నేరుగా సమాచారాన్ని తెప్పించుకోవాలని కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని భంగపరుస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే పోలీసుల కంట్రోల్ లో ఉండాలన్నారు. పోలీస్ కంట్రోల్ ఉండాలంటే, నిబంధనల ప్రకారం డీజీపీ నియామకం జరగాలన్నారు. సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం డీజీపీకి రెండేళ్ల పదవీకాలం ఉండాలని, ముఖ్యమంత్రి పీకి వేస్తే, పీకి వేయించుకునే పరిస్థితి ఉండ కూడదన్నారు. గతంలో కూడా డీజీపీని పీకి వేయడం తప్పేనని, కానీ అతను ప్రశ్నించలేదని గుర్తు చేశారు.. పోలీసులు సజావుగా ఉంటేనే మంచి జరుగుతుందన్నది తన భావన అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
డిజిపి నియామకానికి ఓ విధానం ఉంది…
రాష్ట్ర డిజిపి నియామకానికి ఓ విధానం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తొలుత సీనియర్ ఐపిఎస్ అధికారులతో కూడిన ఐదు మంది జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్ లిస్ట్ చేస్తుందని, అందులో ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని ఆయన తెలిపారు.. ఆ ముగ్గురిలో ముఖ్యమంత్రి తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారని అన్నారు. అంతేకానీ మా ఊరి వాడు, కడప రెడ్డి అని కట్టబెడతామంటే కుదరదని వ్యాఖ్యానించారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలకు పాతర వేస్తూ, 11 మంది సీనియర్ ఐపిఎస్ అధికారులను కాదని, రాజేంద్రనాథ్ రెడ్డికి ఫుల్ అడిషనల్ చార్జ్ డిజిపి పదవి కట్టబెట్టారన్నారు. ఇది కాదనలేని నిజమని ఆయన పేర్కొన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డికి గతం లో మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అన్యాయాలను చూసి కూడా నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి కారణం లేకపోలేదని, ఫుల్ అడిషనల్ చార్జ్ డిజిపి పదవి, తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటిదని… అందుకే ఆయన, ప్రభుత్వ పెద్దలు… తానా అంటే తందానా అంటున్నారని విమర్శించారు.
ఆ సీరియస్ నెస్ ను ఎందుకు అర్థం చేసుకోలేదు?
కుప్పంలో రాళ్లదాడి ఘటన అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి సిక్స్ ప్లస్ సిక్స్ ఉన్న రక్షణ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం 12 ప్లస్ 12 గా మార్చిందంటే… ఐబీ నివేదికలను తెప్పించుకోకుండానే రక్షణ సిబ్బందిని పెంచారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. అయినా ఆ సంఘటన తీవ్రతను గుర్తించకుండా అదేమీ పెద్ద విషయం కాదన్నట్టు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం చూస్తుంటే, రాజేంద్రనాథ్ రెడ్డి చేత … ఎవరో చెప్పించినట్లు స్పష్టమవుతుందన్నారు. రాళ్లదాడి ఘటన పెద్దదేమి కాదంటే, ప్రాణం పోతేనే అది పెద్ద ఘటన అవుతుందా అని ప్రశ్నించిన ఆయన, ప్రత్యర్థుల దాడిలో కన్ను పోతే చిలిపిగా, సరదాగా కొట్టుకున్నారని అంటారా? అంటూ నిలదీశారు. ఇక గతంలో టిడిపి ఆఫీస్ పై మా పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడి చేసి, ధ్వంసం చేసిన ఘటన గురించి అప్పటి డిజిపి మాట్లాడుతూ బీపీ పెరిగినప్పుడు కంట్రోల్ కోసం రాళ్లు విసిరేస్తారని.. అంత సీరియస్ గా తీసుకుంటే ఎలా ? అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు.
మా పార్టీ వాళ్లకు బీపీ పెరిగితే రాళ్లదాడితో దాహం తీర్చుకుంటారని, వేరే పార్టీ వాళ్లకు బీపీ పెరిగితే మరో పరిష్కారమే లేదా?, వాళ్ళు కొంపలో కూర్చుని ఏడవాలా??, తన్నులు తినాల్సిందేనా??? అని ఎద్దేవా చేశారు. ఎవరో పెట్టిన మెసేజ్ ను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినందుకు రంగనాయకమ్మను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు పిలిపించారని, ఇక మరొకరు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి వెంటనే తొలగించినందుకు, ఆ సంస్థ నిర్వాకుడిని విచారణ పేరిట వేధించారని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దిక్కుమాలిన జంతువు పేరుతో అవాకులు చవాకులు పేలుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోరన్న ఆయన, తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడనని తాను సోషల్ మీడియాలో అభ్యంతర కర వ్యాఖ్యలను పోస్ట్ చేస్తే తెలంగాణ పోలీసులు జగన్మోహన్ రెడ్డి నీ విచారణకు పిలుస్తారా? అంటూ ప్రశ్నించారు. మరి అటువంటి అప్పుడు మహాసేన మీడియాకు చెందిన రాజేష్ ను విచారణకు పిలిపించడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ప్రస్తుతం అతనికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక టిడిపికి చెందిన నాయకుల కదలికలపై సమాచారాన్ని ఇవ్వాలంటున్న పోలీసులు, వారిని లేపేసే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదన్న రఘురామకృష్ణంరాజు, డిజిపి నియామకంపై తాను యూపీఎస్సీ చైర్మన్ కు నిబంధనలను అనుసరించడం లేదని గతం లో రెండుసార్లు లేఖ రాశానని, యూపీఎస్సీ చైర్మన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాశారని… కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదన్నారు. ఫుల్ అడిషనల్ చార్జి డిజిపి కాకుండా, యూపీఎస్సీ ద్వారా ప్రతిపాదించిన వ్యక్తి డిజిపి అయితే స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందని, న్యాయంగా పనిచేస్తారని తెలిపారు.
పోలీసు వ్యవస్థ పనితీరు దారుణం…
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు దారుణంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గానికి వెళితే రాళ్లదాడి జరిగిందని గుర్తు చేశారు. ఈ విషయమై రాష్ట్ర డిజిపి స్పందిస్తూ… అదే మీ పెద్ద సంఘటన కాదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అయితే మా పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వాటిని తీసివేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినా సొంత డబ్బులతో ప్రతిపక్ష నేత తన సొంత నియోజకవర్గమైన కుప్పం లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు ద్వారా పేదలకు నామినల్ ధరకే భోజన వసతి కల్పించాలని భావిస్తే, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో… తమ పార్టీకి చెందిన నాయకులు రాళ్లదాడి చేశారన్నారు. రాళ్ల దాడి చేయడమే కాకుండా, టిడిపి కార్యకర్తలు, నాయకుల పైనే తిరిగి కేసులు బనాయించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. ఇక విజయవాడ నగరంలో చెన్నుపాటి గాంధీ పై దాడి చేసి, కన్ను పెరికి వేయగా… దాన్ని క్షణికావేశంలో ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణగా పోలీసులు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు గాంధీ పైనే కేసు పెడతారేమోనని అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పోలీసులకు ఏమైందని ప్రశ్నించిన ఆయన, ఎందుకని ప్రజలని వేధిస్తున్నారంటూ నిలదీశారు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసి వేధించారని, మాస్కులు, హెల్మెట్ ధరించలేదన్న చిన్న చిన్న కారణాలకు సైతం ప్రజలపై పోలీసులు కేసులు నమోదు చేసి భయాందోళనలకు గురి చేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న మారణకాండ, సిఐడి కస్టడీలో తనని చిత్రహింసలకు గురి చేయడం… ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందేనన్నారు. ఇక 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారిపై రాళ్లదాడి చేయడాన్ని పరిశీలిస్తే… రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా రాష్ట్రపతి ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను అపహరించి చంపేస్తామని బెదిరించడంతో… ప్రధాన ప్రతిపక్షం తో పాటు, ప్రతిపక్ష పార్టీలు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించాలని గుర్తు చేశారు. విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను గతం లో పర్యవేక్షించిన ఓ ప్రముఖ నాయకుడు… రెవిన్యూ, పోలీసు అధికారులతో కుమ్మక్కై , బీచ్ రోడ్ లోని ఫైవ్ స్టార్ హోటల్ ను తన బినామీ పేరిట సగం వాటా కొట్టేశారన్నారు. విశాఖ నగరంలో ఖాళీ స్థలాలకు యజమానులు గోడలు కట్టుకునే పరిస్థితి దాపురించడానికి కారణమైన నాయకుడు ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఇక ఒక ఎమ్మెల్యే కబురు పెట్టి ఇచ్చింది తీసుకొని, స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళమని చెబుతున్నారని, చేయకపోతే ఆ మొత్తం కూడా దక్కదని కబ్జా చేస్తామని, హెచ్చరిస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారన్నారు. పోలీసు, రెవిన్యూ అధికారులతో కుమ్మక్కైన పాలెగాళ్లు, చోటా, మోటా నేతలు దొరికిన కాడికి దోచుకుంటున్నారని చెప్పారు. విశాఖలో ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు, మానాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నిస్తే మా పార్టీ ఎంపీనే చితక బాదం… మిమ్మల్ని కొట్టమా? అన్నట్లు ఉంది ప్రభుత్వ పెద్దల తీరు
ప్రశ్నిస్తే మా పార్టీ ఎంపీని కొట్టుకునే సంస్కారవంతమైన పార్టీ తమదని, ఎన్ని మార్లు ప్రశ్నించినా.. సెల్ఫీలు దిగి పంపమని చెప్పినా … పంపమంటే మిమ్మల్ని కొట్టమా? అన్నట్టు ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తీరు ఉందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులకు తమ పార్టీ ఇచ్చే గౌరవం గతంలో ఎవరు ఇవ్వలేదని ముఖ్యమంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత పార్టీ ఎంపీ నే కాళ్లు కట్టేసి కొట్టాం.. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే సిఐడి పోలీసులు కొట్టలేదు కదా… కాబట్టి గౌరవంగా చూసుకుంటున్నామన్నట్టుగా ప్రభుత్వ పెద్దల ఉద్దేశమై ఉంటుందని ఎద్దేవా చేశారు. గురుపూజ దినోత్సవం రోజు కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయుల వద్ద నుంచి పెన్నులు, జేబులో నుంచి కాగితాలను స్వాధీనం చేసుకుని సభా ప్రాంగణానికి పంపినట్లు తెలిసిందని, ఒకవేళ ఎవరైనా ముఖ్యమంత్రిపై ఇంక్ చల్లుతారేమోనని, కాగితాలు విసురుతారేమోనని భావించి ఉంటారన్నారు. విద్యాభివృద్ధి కోసం 53 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. స్కూళ్లను ఎత్తివేసి, ఉపాధ్యాయ పోస్టులను నిలిపివేసి, ఉత్తీర్ణత శాతం తగ్గిలా చర్యలు తీసుకుంటూ విద్యాభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవాలని, జెడ్ ప్లస్ భద్రత కలిగిన ప్రతిపక్ష నేతపై రాళ్ల దాడి జరగగా, వై కేటగిరి భద్రత కలిగిన తాను నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి రాష్ట్రంలో లేదని కానీ మనలో మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉందన్నారు.
కానిస్టేబుల్ ప్రకాష్ పై వేధింపులు ఆపండి
పోలీసులను కాపాడాలంటూ, టి ఎ, డి ఎలు చెల్లించాలని కోరిన కానిస్టేబుల్ ప్రకాష్ పై వేధింపులు ఆపాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప లిక్కర్ దందాపై, కడప ఎస్పీ కర్ణాటకలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ వ్యవహారంపై ప్రకాష్ చేసిన ఆరోపణల నిజాల నిగ్గు తేల్చాలని అన్నారు. ఇక ప్రకాష్ పై కేసు నమోదు కోసం ఒక గృహిణి రోడ్డు పైకి లాగడం సరికాదని పేర్కొన్నారు.