సమైక్యాంధ్ర చేస్తే రాజధాని ఎక్కడో సజ్జల చెప్పాలి..?

* వైసీపీ ప్రభుత్వ చేతకాని పాలన, ప్రజా సమస్యలపై పోరాడండి
* బ్యాక్ గ్రౌండ్ కాదు… బ్యాటిల్ గ్రౌండ్ చూసి పదవులు ఇచ్చే పార్టీ జనసేన
* ఉత్తరాంధ్రలో కుటుంబ పాలన పోయి కొత్త తరం పాలన రావాలి
* ప్రజా పోరాటాల్లో పార్టీ అండగా నిలబడుతుంది
* ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన
పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ 

‘విజయనగరం ప్రాంతానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు విశాఖను పాలన రాజధాని చేస్తే తప్పు ఏంటి అని అడుగుతారు..?మరోపక్క వైసీపీ షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కలిపితే స్వాగతిస్తామంటారు.. అలా కలిపితే రాజధానిని ఎక్కడ పెడతారు..? ముందు దీనికి సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ల మాటలు వైసీపీ వాళ్లకే అర్ధం కాని విధంగా ఉన్నాయి. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం వైసీపీకి కొత్త కాదు. కుటుంబ పాలన సాగించే వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రకటించిన 25 మండలాల పార్టీ అధ్యక్షులకు శుక్రవారం మనోహర్ విజయనగరంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ” ఉత్తరాంధ్ర నుంచి పదవులు అనుభవించిన నాయకులు.. ఇతరులు వచ్చి అభివృద్ధి చేయాలని చెప్పడం చూస్తే జాలి వేస్తుంది. పదవులు పొందేది మీరు.. అభివృద్ధి చేయాల్సిందే మాత్రం వేరే వాళ్లా…? ఇదేం న్యాయం. వీళ్లకు పరిపాలన చేతకాదు. ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి రకరకాలుగా మాట్లాడటం మాత్రమే తెలిసిన విద్య. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఉద్యోగుల జీతాలు సమస్య నుంచి దృష్టి మళ్లించడానికి ఇప్పుడు సమైక్యం అనే మాటలు మాట్లాడుతున్నారు.

పార్టీ కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు
పార్టీ కోసం మొదటి నుంచి నిలబడిన నాయకులు… ప్రజా సమస్యల పట్ల పోరాడే నైజం… నిస్వార్ధంగా పార్టీ జెండాను పట్టుకుని నిలబడగలిగే ధైర్యం ఉన్న నాయకులనే జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నాం. పార్టీ ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించి అందర్నీ కలుపుకొని వెళ్లి, ఒకరు వేలెత్తి చూపించకుండా స్ఫూర్తివంతంగా పనిచేయాలి. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విజయనగరంలో కుటుంబ పాలన పోవాలి. కొత్త తరం పాలన మొదలు కావాలి అనే నినాదంతో జనసేన పార్టీ ముందుకు వెళుతుంది. రాజకీయాలు అంటే ఒక కుటుంబం చేతిలో ఉండడం కాదు. కొత్త వ్యక్తులు రావాలి. పాలనలో కొత్తదనం ఉండాలి. ఒక ఎలక్షన్ కోసం పనిచేసి వెళ్లిపోయే వాళ్ళు కాకుండా, పార్టీ నిర్మాణం కోసం జనసేనకు అండగా నిలబడే వారి కోసం పవన్ కళ్యాణ్  వేచి చూస్తున్నారు. జనసేన పార్టీ నిర్మాణం ఇతర పార్టీలకు విభిన్నంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించి మాట్లాడే శక్తి సామర్థ్యాలు అంచనా వేసి, క్షేత్రస్థాయిలో ఇటీవల పర్యటనలో 186 మంది ప్రసంగాలు విన్న తర్వాత మాత్రమే 25 మండలాలకు అధ్యక్షులను నియమించాం. మహిళలకు, యువతకు పెద్దపీట వేయాలి అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అదే స్ఫూర్తితో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మండల అధ్యక్షుల నియామకం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని అసంతృప్తులు ఉండొచ్చు. కచ్చితంగా పార్టీ జెండా మొదటి నుంచి మోసిన సీనియర్లకు తగిన గౌరవం ఇస్తాం. జిల్లా కమిటీలో, ఇతర అనుబంధ కమిటీల్లో వారికి తగిన బాధ్యతలు అప్పగించి గౌరవించుకుంటాం. ఎలాంటి అరమరికలు లేకుండా సమష్టిగా పార్టీ సిద్ధాంతాల కోసం, ప్రజా పోరాటాల్లో ముందుకు వెళ్లాలి. పార్టీ నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాదు.. అన్ని ఆలోచించి పార్టీ నిర్మాణం ముందుకు సాగుతుంది.

రాజకీయాల్లో నిజాయతీ అవసరం
రాజకీయాల్లో ఉన్న నాయకులకు నిజాయతీ అవసరం. ప్రజలకు ఒక మాట చెబుతున్నామంటే పూర్తిగా వినే పరిస్థితి ఉండాలి. అంతేగాని అవసరాల కోసం, ఓట్ల కోసం ప్రజలకు ఇష్టానుసారం మాటలు ఇవ్వడం పద్ధతి కాదు. తర్వాత ఆ మాటలను పక్కనపెట్టే నాయకులు అవసరం లేదు. స్థానిక సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోండి.

సమస్యలు సృష్టించడమే ఈ ముఖ్యమంత్రికి తెలుసు
ఈ ముఖ్యమంత్రి సమస్యలు సృష్టిస్తాడు తప్ప తీర్చేవాడు కాదు. పార్టీ కార్యక్రమాలకు బస్సులను పెట్టి ఏపీఎస్ఆర్టీసీని వైసీపీ ఆర్టీసీగా మార్చేశారు. వైసీపీ సమావేశం ఉంటే ఆ పార్టీ కార్యక్రమానికి బస్సులు పెడితే, అదే బస్సును నమ్ముకుని కూలి పనికి వెళ్లే సగటు కూలి ఆ రోజు పస్తులు ఉండాలా..? అంటే వీళ్లకు కావాల్సింది ప్రజా క్షేమం కాదు… వాళ్ళ నుంచి ఓట్లు మాత్రమే. పార్టీ పదవులు పొందిన వారు అందర్నీ కలుపుకొని వెళ్లాలి. ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకోండి. రాష్ట్ర సమస్యల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. క్షేత్రస్థాయిలోని సమస్యల పట్ల బలంగా పోరాడండి. నాయకులు ఎక్కడో తయారు కారు. ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని రాటుదేలండి… పోరాడండి… చివరకు నిలబడితేనే నాయకులు అవుతారు. ప్రజా సమస్యల్లో ఎంతవరకు అయినా పోరాడండి.. మిమ్మల్ని ఇబ్బంది పెడితే పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. చివరి వరకు అండగా నిలబడతాం. క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ కోసం త్యాగాలు చేసి పోరాటం చేసిన వ్యక్తులు జనసేన సమూహంలో ఉన్నారు. వారందరినీ తగిన విధంగా కలుపుకు వెళ్లి ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాడే బాధ్యత తీసుకుందాం. పార్టీ జెండా మోసి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గుర్తిస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అందరితో చర్చించి గ్రామ కమిటీలను వేసే ఏర్పాటు చేయండి. ఎక్కడ విలువలు కోల్పోకుండా జాగ్రత్తగా పని చేద్దాం.

యువశక్తి బలం చూపుదాం
ఉత్తరాంధ్ర యువతలో అపారమైన శక్తి, యుక్తి ఉన్నాయి. ఇక్కడి ప్రాంతం కళలు, పోరాటాలు కలగలిసిన నేల. యువతలో అపారమైన నైపుణ్యం ఉంది. సరైన అవకాశాలు లేక వారు వలసలు వెళ్ళిపోతున్నారు. మత్స్యకారుల సమస్యలు చాలా ఉన్నాయి. జెట్టిలు, ఫిషింగ్ హర్బర్ లు ఉంటే వలసలు ఉండవు. ఇక్కడి ఆటపాట, సంస్కృతి, సంప్రదాయాలు అమోఘం. వాటన్నింటినీ ప్రపంచానికి మరోసారి తెలియజెప్పేలా జనసేన పార్టీ తరఫున “యువశక్తి” కార్యక్రమాన్ని స్వామి వివేకనంద జయంతి అయిన జనవరి 12వ తేదీన రణస్థలం లో నిర్వహిస్తున్నాం. ఆరోజు ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడి యువతతో మమేకం అవుతారు. ఎందరో గొప్ప వ్యక్తులు పుట్టిన నేల ఏది. యువశక్తి కార్యక్రమంలో వారందరితో మాట్లాడించి, ఇక్కడ సంస్కృతులు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సహాయం కావాలన్నా సూచనలు కావాలన్నా పార్టీ పెద్దలను అడగండి.. వారు చెప్పిన దాన్ని స్వీకరించండి. త్వరలోనే పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం మొదలు కాబోతోంది. దానిని వినియోగించుకునేలా యువతను ప్రోత్సహించాలి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ తన కార్యకర్తల కోసం ఇవ్వని బీమా పథకాన్ని జనసేన పార్టీ అందిస్తోంది. దుఃఖంలో ఉన్న కార్యకర్తల కుటుంబానికి అండగా నిలబడుతుంది. పార్టీ తరఫున అస్త్ర యాప్ కూడా కీలకం. అలాగే మండలాల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని వాటిని జాగ్రత్తగా నిర్వహించండి. ప్రజా సమస్యల మీద ఐకమత్యంగా పోరాడుదాం. ప్రజాస్వామ్య పద్ధతిలో చేసే పోరాటంలో మనల్ని ఎవరు ఆపుతారో చూద్దాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు కోన తాతారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలవలస యశస్విని, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply