– తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు మనకు అమరావతి ఉండాలని భావించాను
– 2019 లో టీడీపీ ఓటమి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం
– టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి:-తాను విజన్ తో చేసిన పాలన కారణంగానే హైదరాబాద్ నేడు ఉన్నత స్థానంలో ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ఎపిలో అన్నీ కూల్చేస్తున్న, ప్రాజెక్టులు ఆపేస్తున్న జగన్ లాంటి వాళ్లు….2004లో తన అనంతరం సిఎం అయ్యిఉంటే హైదరాబాద్ ఏమయ్యి ఉండేదో అని చంద్రబాబు అన్నారు. హైటెక్ సిటీ, ఐఎస్ బి లాంటి వాటిని కూల్చేసి, ఎయిర్ పోర్ట్, రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను అపేసి ఉండేవారేమో అని చంద్రబాబు అన్నారు. నా మీద కక్షతో రాజధాని అమరావతిని స్మశానం చెయ్యాలని చూస్తున్న జగన్ కు అవకాశం వచ్చి ఉంటే… హైదరాబాద్ ను ఎంత నాశనం చేసేవారో అని చంద్రబాబు అన్నారు.
ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా, ఉపాధి కేంద్రంగా, అభివృద్దికి చిరునామా గా మారిందని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి కూడా అలా ఉండాలని తాను భావించానని….అందుకే అభివృద్ది చేశానని చంద్రబాబు అన్నారు. గన్నవరం నియోజకవర్గం, రామవరప్పాడు గ్రామానికి చెందిన బిసి సంఘాల నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో పాలనా వైఫల్యాలపై మాట్లాడారు. ఉడతల కారణంగా కరెంట్ తీగలు తెగిపోవడం, ఎలుకలు మద్యం తాగడం, ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల అకౌంట్లనుంచి మాయం అవడం ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం అని చంద్రబాబు అన్నారు.
ఉద్యోగుల అకౌంట్లలో సొమ్ము మాయం అవ్వడానికి సిఎఫ్ఎంఎస్ విధానంలో లోపం కాదని….వైసిపి విధానంలోనే లోపమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు పాస్ అయితే…..ఎపిలో కేవలం 67 శాతం మంది మాత్రమే పాస్ అవ్వడమే నాడు నేడు కార్యక్రమమా అని చంద్రబాబు ప్రశ్నించారు. 2019 టిడిపి ఓటమితో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇప్పుడు ప్రత్యక్షంగా అంతా చూస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఇప్పటికే తిరుగు బాటు మొదలయ్యిందని…అందుకే వైసిపి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా జనం ఆదరించడం లేదని అన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు.