Suryaa.co.in

Andhra Pradesh

సీఎం వచ్చారంటే.. జనం చచ్చారంతే!

– షాపుల మూత
– జనసంచారంపై ఆంక్షలు
– తాజాగా పత్తికొండలోనూ అదే సీను
– సీఎం పర్యటన.. జన సంచారం పూర్తిగా నిషిద్ధం

సీఎం జగన్.. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇంట వివాహ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. భద్రతా కారణాల పేరుతో పోలీసులు కృష్ణానగర్‌లో దుకాణాలన్నీ మూయించారు. వీధులన్నీ మూసివేసి, జనసంచారాన్ని పూర్తిగా నిషేధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో విధించిన ఆంక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. కృష్ణానగర్‌లో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇంట వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం సీఎం విచ్చేశారు. భద్రతా కారణాల పేరుతో పోలీసులు కృష్ణానగర్‌లో దుకాణాలన్నీ మూయించారు. కృష్ణానగర్‌ మీదుగా బిర్లాగేట్‌ వరకు ప్రధాన రహదారిపై ఇరువైపులా దుకాణాల ముందు శుక్రవారమే బారికేడ్లు పెట్టారు.

జనం వాటిని దాటి రాకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.దీంతో వ్యాపారాలు సాగక వ్యాపారులు నష్టపోయారు. ఎమ్మెల్యే శ్రీదేవి నివాసం ఉండే కాలనీలో నివాసితులు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు.ప్రతి ఇంటి వద్ద, మిద్దెలపైన పోలీసు పహరా ఏర్పాటు చేశారు.కొందరి ఇళ్లకైతే ఏకంగా తాళాలు వేశారు.

వీధులన్నీ మూసివేసి, జనసంచారాన్ని పూర్తిగా నిషేధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ముఖ్యమంత్రి పర్యటనకు ఆటంకం కలిగిస్తారన్న ఉద్దేశంతో తెదేపా, సీపీఎం, సీపీఐ నాయకులు, కొందరు ఉపాధ్యాయులను ముందస్తు అరెస్టు చేశారు.సీఎం తిరిగివెళ్లాక విడిచిపెట్టారు.
భద్రత పేరుతో పోలీసులు చేపట్టిన చర్యలు హక్కుల ఉల్లంఘన అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సుభద్రమ్మకు దక్కని జగనన్న దర్శనం

గతేడాది డిసెంబర్‌ 22న కర్నూలు మండలం పంచలింగాల పరిధిలో ఓ వివాహానికి ముఖ్యమంత్రి హాజరైనప్పుడు కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన దివ్యాంగురాలు సుభద్రమ్మ భద్రతాసిబ్బందిని దాటుకుని సీఎంను కలిసింది.ఉద్యోగం ఇప్పించాలని విన్నవించింది.

ఇది నిఘా వైఫల్యమేనని విమర్శలు రావడంతో అప్పటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన ప్రతిసారి పోలీసులు సుభద్రమ్మను గృహ నిర్బంధం చేస్తున్నారు.ఈసారీ ముందురోజు నుంచే ఆమెను ఇల్లు దాటి రాకుండా కట్టడి చేశారు. ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చినవారినీ పోలీసులు అనుమతించలేదు. వారు సీఎంను నేరుగా కలవకుండా అధికారులే రోడ్లపై ఉండి ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు.

ఎక్కడికి వెళ్లినా ఇదే తీరు

సీఎం జగన్ ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. చివరకు తాడేపల్లి నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిలోనూ ఇలాంటి ఆంక్షలే ఎదువడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులను షాపులు మూసివేయాలంటున్న పోలీసులు, వైన్‌షాపులు మాత్రం మూసివేయించని వీడియాలు గతంలో సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అసలు గతంలో ఏ సీఎం పర్యటనకూ ఇలాంటి ఆంక్షలు ఎదుర్కొన్న దాఖలాలు లేవని, ఇలాంటి కొత్త పద్ధతులు ఇప్పుడే చూస్తున్నామని జనం వాపోతున్నారు. గత నెలలో సీఎం గుంటూరు పర్యటించిన సందర్భంలో అయితే ఏకంగా రోడ్డుకు ఒకవైపు వరసగా బారికేడ్లు ఏర్పాటుచేసి, ప్రజలను ఇబ్బందిపెట్టిన వైనం జనాలను ఇబ్బందిపాలుచేసింది. ప్రజాభిమానం ఉన్న సీఎంను ప్రజలు కలవకుండా పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? లేక సీఎం స్వయంగా ఇలాంటి ఆదేశాలిస్తున్నారా అన్న ప్రశ్నలు ప్రజలు, జగనన్న అభిమానులను వేధిస్తున్నాయి. ఈవిధంగా ప్రజలను ఇబ్బందిపెట్టేలా సీఎం పర్యటనలు ఉంటే, అసలు అలాంటి పర్యటనలు విరమించుకుంటే, ప్రజల్లో వ్యతిరేకత రాదన్నది వైసీసీ నేతల అభిప్రాయం. ఆ విషయం జగనన్నకు చెప్పే ధైర్యం ఎవరికి ఉందన్నది ప్రశ్న.

 

LEAVE A RESPONSE