రైతుల వద్ద ధాన్యముంటే, ప్రభుత్వం కొనుగోళ్లు నిలిపేయడమేంటి?

Spread the love

– తెలంగాణ ప్రభుత్వం కోటిలక్షల మెట్రిక్ టన్నులు కొంటే, అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్ 47లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి పరిమితం కావడం సిగ్గుచేటు
• ధాన్యం కొనుగోళ్లలో అడ్డమైన నిబంధనలు అమలుచేస్తూ, ప్రభుత్వమే రైతులకు క్రాప్ హాలిడే ఆలోచన వచ్చేలా చేస్తోంది.
• కోడిపందేలు, జూదం, గుండాటపై సమీక్షలు చేసే ప్రభుత్వానికి, ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఇబ్బందులపై సమీక్షించే సమయం లేదా?
• జగన్ రెడ్డి చెప్పే రైతు సంక్షేమమంతా రంగురంగుల ప్రకటనలకే పరిమితం.
• ప్రభుత్వం రాష్ట్రంలోని ధాన్యంమొత్తం కొని, రైతులకు సకాలంలో డబ్బులిచ్చి వారికి న్యాయంచేయకుంటే, ‘రైతుకోసం-తెలుగుదేశం’ దెబ్బేంటో ముఖ్యమంత్రికి చూపిస్తాం.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

తానో రైతుబాంధవుడైనట్టు, రైతులసంతోషమే, తనసంతోషమైనట్టు జగన్ రెడ్డి చెప్పే మాట లన్నీ కల్లబొల్లికబుర్లేనని, ఆయన ప్రభుత్వంలో రైతుసంక్షేమమంతా రంగురంగుల ప్రకటనల కే పరిమితమైందని, రైతులవద్ద ధాన్యం నిల్వలుండగానే, ప్రభుత్వం ధాన్యంకొనుగోళ్లు నిలిపే సి, వారికి కన్నీళ్లు, కడగండ్లు మిగిల్చిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరం నుంచి జూమ్ ద్వారా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“జగన్ రెడ్డి ముమ్మాటికీ రైతుద్రోహే. రైతుభరోసా కేంద్రాల పేరుతో, రైతులనోట్లో మట్టికొడు తున్నాడు. అడ్డమైన నిబంధనలతో ధాన్యంకొనుగోళ్లు నిలిపేసిన ప్రభుత్వం, రైతువ్యతిరేక ప్రభుత్వం కాక, అనుకూల ప్రభుత్వమెలా అవుతుంది? గతంలో రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజ కొంటానన్న జగన్ రెడ్డి, ఇప్పుడు చేతులెత్తేశాడు.

తెలంగాణ కోటిలక్షల మెట్రిక్ టన్నులుకొంటే, ఏపీ 47లక్షల మెట్రిక్ టన్నులే కొనడమేంటి?
2020-21లో 47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం ఏటా పెరగాలి. కానీ 2022-23లో ప్రభుత్వ ధాన్యంకొనుగోళ్ల లక్ష్యం 37 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే పరిమితమైంది. ఏటా ధాన్యం సేకరణ పెంచాల్సిన ప్రభుత్వం, ఒకేసారి 10లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ తగ్గించి, రైతుల కళ్లల్లో కారం కొట్టింది? ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తయిందంటూ, ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముంచుతోంది. రైతుల వద్ద ధాన్యం నిల్వలుంటే, ప్రభుత్వం అప్పుడే లక్ష్యం పూర్తయిందని కొనుగోళ్లు నిలిపేస్తే, పండిన ధాన్యా న్ని రైతులు నీళ్లపాలుచేయాలా? పొరుగురాష్ట్రమైన తెలంగాణ కోటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే, దానిలో సగంకూడా ఏపీ ప్రభుత్వం కొనకపోవడం రైతుల్ని దగాచేయడం కాదా? జగన్ రెడ్డి రైతు ద్రోహి అనడానికి ఇంతకంటే రుజువేంకావాలి?

ప్రభుత్వం రైతుపేరుతో ప్రకటనలకు చేసే ఖర్చుతో పోలిస్తే, రైతులకు ఇచ్చేది తక్కువే
జగన్ అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో ఏటాసాగు విస్తీర్ణం కూడా తగ్గుతోంది. 2022-23 ఖరీఫ్ కి సంబంధించి, 40.75లక్షల ఎకరాలు సాగుఅవుతాయని ప్రభుత్వం అంచనావేస్తే, విస్తీర్ణం 35.97లక్షలకే పరిమితమైంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 5లక్షల ఎకరాల్లో సాగువిస్తీర్ణం తగ్గింది.
ఎందుకు విస్తీర్ణం తగ్గిందనే దిశగా ఈప్రభుత్వం ఎప్పు డూ ఆలోచించలేదు. ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే రైతులు క్రాప్ హాలిడే వైపు మొగ్గు చూపుతున్నారు. జగన్ రెడ్డి చెప్పే రైతుసంక్షేమం రంగురంగు ప్రకటనల్లోనే కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటనలకు పెట్టేఖర్చుతో పోలిస్తే, రైతులకు అందించే సాయం చాలాచాలా తక్కువనే చెప్పాలి.

తేమశాతం పేరుతో రైతుల నిలువుదోపిడీ
ధాన్యం కొనుగోళ్లను దారుణంగా తగ్గించిన ప్రభుత్వం, కొన్నధాన్యానికి కూడా సరిగా డబ్బు లు ఇవ్వడంలేదు. రైతులపేర్లు ఈ క్రాప్ లో నమోదైతేనే పంటలు అమ్ముకునే అవకాశం ఉందని, పంట అమ్ముకోవడానికి కౌలురైతులకు గుర్తింపు కార్డులుండాలనే నిబంధనలు తీసుకొచ్చారు. అప్పులు తెచ్చి, పెట్టుబడిపెట్టి పంటలు పండించి, ఆ పంటను అమ్ముకోలేని కౌలురైతుల దుస్థితిని ఈప్రభుత్వంలోనే చూస్తున్నాం. కౌలురైతులు పొలం యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితిని ప్రభుత్వమే కల్పించింది. ధాన్యం కొనుగోలు చేయాలంటే అధికారులు వచ్చి, తేమశాతం పరిశీలించాకే కొనుగోళ్లు జరుగుతున్నాయి.

అంతా అయ్యాక ధాన్యాన్ని మిల్లులకు తరలించే తంతులో కూడా రైతులకే పంగనామాలు పెడుతున్నారు. రైతులకు సమీపంలో రైస్ మిల్లులు ఉన్నా, వాటిని కాదని ప్రభుత్వం చెప్పిన మిల్లులకే తరలించాలి. దానికి సంబంధించిన రవాణాఛార్జీలు కూడా రైతులపైనే వేస్తున్నారు. మిల్లర్లవద్దకు వెళ్లాక కూడా మరలా అక్కడ తేమశాతం పేరుతో వారు రైతుల్ని దోచుకుంటున్నారు. కొన్నిసందర్భాల్లో రైతులే ఎదురు మిల్లర్లకు డబ్బులు కట్టే దుస్థితి జగన్ రెడ్డి తీసుకొచ్చాడు. ధాన్యం కొనుగోళ్లులో తేమశాతం పేరుతో అధికారులు, దళారులు, మిల్లర్లు అన్నదాతల్ని దోచుకుంటున్నారు. ధాన్యం రైతులకు అవసరమైన గోతాలను పౌరసరఫరాలశాఖ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందించాలి.

కానీ ఆ శాఖ మొద్దునిద్ర పోవడంతో గోతాలు లేవంటూ అధికారులు, దళారులు 15రోజుల పాటు రైతులు రోడ్లపై పడిగాపులు పడేలా చేస్తున్నారు. పొలాల్లో యంత్రాలద్వారా వరి కోసిన ప్పుడు సాధారణంగా ధాన్యంలో ఎంతోకొంత తేమశాతం ఉండటం సహజం. దానికే సవాలక్ష నిబంధనలు పెడుతు న్న ప్రభుత్వం, రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనకుండా, కొనుగోళ్ల లక్ష్యం పూర్తయిందని ఎలా చెబుతుంది?

పందెం కోళ్లకు జూదానికి ఇచ్చిన విలువకూడా రైతులకు ఇవ్వరా?
పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు దేశంలోనే వరిపండించడంలో పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. అలాంటి పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యంసేకరణ లక్ష్యం 4.22లక్షల మెట్రిక్ టన్నులు నిర్దేశించుకోవాల్సి ఉండగా, 3.42లక్షలకే పరిమితమైంది. 80వేల మెట్రిక్ టన్నులు తగ్గిస్తే, రైతులు పండించిన ధాన్యం ఏం చేయాలి? రైతులు గొడవచేశారని 25వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతించారు. ఆలెక్కన చూసినా మిగిలిన 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వృథా అయినట్టేగా? ఒక్క జిల్లాలోనే 50వేల మెట్రిక్ టన్నులు వృథా అయితే, రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కావాలనే నీళ్లపాలు చేస్తోంది.

రైతుల ధాన్యాన్ని కొనలేని ప్రభుత్వం సంక్రాంతి జూదం, కోడిపందేలు, జూదాలపై మాత్రం ఎనలేని శ్రద్ధాసక్తులు చూపింది. ఉపముఖ్యమంత్రి కోడిపందేలపై సమీక్ష చేస్తుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు కోడిపందాల పంచాయతీలు తీర్చేపనిలో నిమగ్నమయ్యారు. పందెంకోళ్లకు, జూదాలకు ఇచ్చిన విలువకూడా ఈ ప్రభుత్వం రైతులకు ఇవ్వదా? ఎన్నో కష్టాలు అనుభవించి ఆరుగాలం శ్రమించి పండిన పంటను అమ్ముకోవడానికి రైతులకు ఇన్ని అవస్థలా? ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన అడ్డమైన నిబంధనలను తక్షణమే తొలగించాలి.

ధాన్యం కొనుగోళ్లకు సరిపడా గోతాలను రైతులకు అందించాలి. గిట్టుబాటు ధరకు రాష్ట్రంలోని ధాన్యం మొత్తంకొని, సకాలంలో రైతులకు డబ్బులివ్వాలి. లేకుంటే ‘రైతుకోసం – తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను తెలుగుదేశంపార్టీ తీసుకుంటుంది” అని నిమ్మల హెచ్చరించారు.

Leave a Reply