-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-‘మహాశూన్యం’ హిందీ అనువాదం ఆవిష్కరణ
తెలుగు రచనలు హిందీలోకి అనువదిస్తే.. తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
శుక్రవారం విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన ‘మహా శూన్యం’ కవితా సంకలనం హిందీ అనువాదాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆవిష్కరించారు.
తెలుగులో రాసిన ఈ సంకలనాన్ని కవి, రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు హిందీలోకి అనువదించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహాశూన్యం కవితా సంకలనం సృష్టి, స్థితి, లయ గురించి మాత్రమే కాకుండా పర్యావరణం, మానవత్వం గురించి 50 కవితలు ఉన్నాయని ప్రశంసించారు.
తెలుగు పద్యాల్లో జాషువా ఘనాపాటి అయితే.. సమకాలీన కవుల్లో విజయభాస్కర్ తిరుగులేని కవి అని కొనియాడారు. తెలుగులో మరిన్ని మంచి కవితలు, కవులు రావాలని ఆకాంక్షించారు. గుమ్మా సాంబశివరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పేరిశెట్టి శ్రీనివాసరావు గ్రంథ సమీక్ష చేశారు. సాహిత్యాభిమాని గోళ్ల నారాయణరావు గ్రంథాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కొచ్చర్లకోట వెంకట సుబ్బారావు, దుగ్గరాజు శ్రీనివాసరావు, జి.వి.పూర్ణచంద్, మద్దాల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.