– తెలంగాణ మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు లేఖ
సికింద్రాబాద్: తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దంటూ తెలంగాణ మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తన అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు గుండెపోటు రాగా, అక్కడే స్టంట్ వేసిన విషయం తెలిసిందే. నగరానికి వచ్చిన ఆయనను వివిధ పార్టీలకు చెందిన నేతలు, అభిమానులు పరామర్శిస్తున్నారు. ఇటీవలే కేటీఆర్, హరీష్‌రావు, తలసాని, మాగంటి గోపీనాధ్, ప్రశాంత్‌రెడ్డి, కర్నెప్రభాకర్ తదితరులు పరామర్శించిన విషయం తెలిసిందే.
కాగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని పద్మారావు తన అభిమానులకు ఒక లేఖ రాశారు.
దేవుని కృప, అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు ప్రార్థనల వల్ల నేను పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందకండి. డాక్టర్లు ఒక వారం రోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కావున డాక్టర్ల సూచన మేరకు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, ఇంతకుముందు కంటే రెట్టింపు ఆరోగ్యంగా మీ ముందుకు వచ్చి, మునుపటి లాగే అన్ని కార్యకలాపాల్లో ఉంటాను. దయచేసి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు.