– ప్రజాభీష్టం మేరకే కూటమి ప్రభుత్వ పాలన
– ఇది మంచి ప్రభుత్వం – మన ప్రభుత్వం
– అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
– క్షేత్రస్థాయిలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
– మన గ్రామం -మన మంత్రి కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం
కె. గంగవరం : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులని, వారి అభీష్టం మేరకే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజవర్గంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని తక్షణం పరిష్కరించేందుకుగాను “మన గ్రామం -మన మంత్రి” (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) పేరుతో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా గురువారం బ్రహ్మపురి, మసకపల్లి, భట్లపాలిక, తాళ్లపోడి,పేకేరు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసి అనంతరం జరిగిన సమావేశాల్లో వాసంశెట్టి సత్యం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
తొలుత గ్రామాల్లో వివిధ శాఖల అధికారుల సమక్షంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపురి, మసకపల్లి గ్రామాల్లోని పలువురు ప్రజలు తమ గ్రామంలో వేసవి కాలంలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని, స్మశాన వాటికల్లో సౌకర్యాలు లేవని, సిసి రోడ్లు నిర్మించాలని, డ్రైన్ ల పూడికలు తీయించాలని తమ సమస్యలు విన్నవించారు.
భట్లపాలెం గ్రామంలో జరిగిన సమావేశంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు హాజరై సమస్యలు తెలియజేశారు. త్రాగునీటి సమస్యకు తక్షణం పరిష్కారం చూపించాలని, విద్యుత్ లో వోల్టేజ్ సమస్య, గృహ నిర్మాణం కోసం రుణాలు మంజూరు, ఆక్రమణలకు గురైన మంచినీటి చెరువును పరిరక్షించాలని కోరుతూ పలువురు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ ఆయా గ్రామాలకు సంబంధించిన సమస్యలపై అధికారులు అంచనాలు రూపొందించి ఇస్తే, మంత్రి సుభాష్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి సుభాష్ శాసనసభ సమావేశాల్లో బిజీగా ఉన్నందున మంత్రి సుభాష్ తరఫున ప్రతినిధిగా హాజరైనట్లు చెప్పారు. తక్షణం మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా మంత్రి సుభాష్ తక్షణ చర్యలు గైకొంటారని వివరించారు. భట్లపాలిక గ్రామానికి జల జీవన్ మిషన్ ద్వారా రూ.1 కోటి రూపాయల నిధులు మంజూరయ్యా అని, ఇవి కాకుండా ఇప్పటికే రూ. 25 లక్షలతో పనులు చేపట్టామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వివరించారు.
లో వోల్టేజ్ సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చాలని కూటమి నాయకులు రవ్వా నాగభూషణం, కాటే సుబ్రహ్మణ్యంలు సభలో ఫిర్యాదు చేశారు.
సమస్యలన్నీ పరిష్కరించేదుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగానే కాకుండా, “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” ద్వారా నిరుపేద విద్యార్థుల చదువుకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మెరుగైన చికిత్స కోసం మంత్రి సుభాష్ వ్యక్తిగతంగా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఆ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సత్యం కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.