– బీఆర్‌ఎస్‌కు మరో షాక్
– బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
– ఇటీవలే కేసీఆర్ ఇలాకాలో ఎంపీపీ ఓటమి
– బీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు ఫలితం
( అన్వేష్)
మొన్నటికి మొన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఇలాకాలో సొంత పార్టీ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం. ఇప్పుడు కేసీఆర్ ఓడిన కామారెడ్డిలో, ఆయన పార్టీకే చెందిన మున్సిపల్ చైర్మన్‌పై నెగ్గిన మరో విశ్వాసం. రెండుచోట్లా తిరుగుబాటు చేసింది బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులే. రెండు చోట్లా నెగ్గింది కాంగ్రెస్ నేతలే. అదీ ఇక్కడ విశేషం. ఓటమి తర్వాత కేసీఆర్‌కు శరపరంపరగా తగులుతున్న శరాఘాతాలివి.
ఓటమి బహు విషాదం. దాన్ని తట్టుకోవడం కష్టం. అధికారంలో ఉంటేనే ఎవరి హవా అయినా. ఓడితే సొంత వారూ వెక్కిరించి వెళ్లిపోతారు. దండేసిన వాళ్లే దణ్ణం పెట్టిపోతారు. పదేళ్లు తెలంగాణను ఒక రాజ్యంగా చేసుకుని పాలించిన రారాజు కేసీఆర్‌కు, ఓటమి తర్వాత ఇలాంటి పరాజయ విషాదాలే వెన్నాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే సొంత ఇలాకాలో.. ఎంపీపీపై కాంగ్రెస్-బీజేపీ-బీఆర్‌ఎస్ తిరుగుబాటు సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గి, అక్కడ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఇప్పుడు కేసీఆర్ ఓడిన కామారెడ్డిలో, మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కృష్ణార్పణమయింది. సొంత బీఆర్‌ఎస్‌కు చెందిన 9 మంది తిరుగుబాటు సభ్యులు, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన ఫలితంగా.. బీఆర్‌ఎస్ సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఓటింగ్‌లో 27 మంది అవిశ్వాసానికి చేతులెత్తడంతో బీఆర్‌ఎస్ చైర్మన్ తన పదవి కోల్పోవలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ ఇందుప్రియను చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
నిజానికి కామారెడ్డి లో మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టిన వెంటనే, ట్రబుల్‌షూటర్ హరీష్‌రావు చక్రం తిప్పుతారని ఆ పార్టీ నేతలు భావించారు. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిన కేసీఆర్‌కు, ఈ వ్యవహారం అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి. అందువల్ల హరీష్ లేదా కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి, చక్రం తిప్పుతారేమోనని అటు బీఆర్‌ఎస్ నేతలూ భావించారు.
అయితే బీఆర్‌ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్లనే ఆ ఇద్దరూ అడ్డుకోలేకపోయారు. దానితో అవిశ్వాసం నెగ్గుతుందని అప్పుడే తేలిపోయింది. అంటే కేసీఆర్ గెలిచిన చోట ఎంపీపీని, ఓడిన చోట మున్సిపల్ చైర్మన్‌ను కూడా కాపాడుకోలేకపోయారన్నమాట.