తెలంగాణ రాష్ట్రంలో నెలకు 971 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం

• ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 861 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తే…
తెలంగాణ రాష్ట్రంలో నెలకు 971 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం

• దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా అన్ని వర్గాలకు పెన్షన్ ఇస్తున్న మనసున్న మారాజు సిఎం కేసిఆర్
• వయో పరిమితి 65 నుంచి 57కు తగ్గించాక కొత్తగా 6,05,018 మందికి పెన్షన్లు
• తెలంగాణ 2వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే కేంద్రం ఇచ్చేది 200 రూపాయలు
• రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్లలో కేంద్రం వాటా 6లక్షలే..అది కూడా 200 రూపాయలే
• ఆసరా పెన్షన్లపై తెలంగాణ శాసనమండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో 44,12,882 మందికి నెలకు 2వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే…ఇందులో కేంద్ర ప్రభుత్వం 6లక్షల 66 మందికి నెలకు 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందని, ఇది దేనికి సరిపోతుందో బిజెపి వాళ్లే చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

తెలంగాణ శాసనమండలిలో నేడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో గౌరవ సభ్యులు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, మిర్జా రియాజుల్ హసన్ ఎఫెండి మరియు జీవన్ రెడ్డి గారు ఆసరా పెన్షన్లపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. కేంద్రం పదే, పదే పెన్షన్లు మేమే ఇస్తున్నామని చెప్పుకుంటోందని, అయితే వారిచ్చే పెన్షన్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లలో ఏమాత్రం కాదన్నారు.అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఏటా 861 కోట్ల రూపాయలు ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం నెలకు 971 కోట్ల రూపాయలను పెన్షన్ల కోసం నెలనెలా ఇస్తూ ఏటా 12వేల కోట్ల రూపాయలను ఈ ఏడాది బడ్జెట్ లో మంజూరు చేసిందన్నారు.

ఆసరా పెన్షన్ల వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన తర్వాత మీసేవ ద్వారా 8 లక్షల 11వేల 817 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో అర్హులైన 6,05,018 మందికి కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేశామన్నారు.హైదరాబాదులో 69,141 దరఖాస్తులు వస్తే 52, 392 పింఛన్లు మంజూరు చేశామన్నారు. వేలిముద్రల సమస్య తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. డయాలిసిస్ రోగులకు కూడా 4వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి వ్యాధి గ్రస్తులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు మన రాష్ట్రంలోనే పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో కూడా మనవలె పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. 2019 నుంచి వికలాంగుల పెన్షన్ ను 1500 నుంచి 3వేల రూపాయలకు పెంచామన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే 200 రూపాయల పెన్షన్ ను తెలంగాణ వచ్చాక వెయ్యి రూపాయలకు పెంచుకుని, ఇప్పుడు దానిని 2వేల 116 రూపాయలుగా ఇస్తున్నామన్నారు.ఈ ఆర్ధిక సంవత్సరంలో 12వేల కోట్ల రూపాయల ఆసరా పెన్షన్లకు బడ్జెట్ కేటాయించామన్నారు.

ఆసరా పెన్షన్ల వయో పరిమితి 57 ఏళ్లకు తగ్గించిన తర్వాత లబ్దిదారుల సంఖ్య 35, 04, 473 నుంచి 44,12 882 మందికి పెరిగిందన్నారు.కేంద్రం పింఛన్లు మేమే ఇస్తున్నామని చెప్పుకోవడం తప్పన్నారు.కేంద్రం తెలంగాణలో 6,00,066 మందికి మాత్రమే ఇస్తున్నదన్నారు. ఒక రాష్ట్రానికి ఇంతమందికే ఇస్తామని ఫిక్స్ చేసుకున్నారని, అది కూడా 200 రూపాయలే ఇస్తున్నారని చెప్పారు. ఈ 200 రూపాయలకు ఏమి వస్తుంది అర్థం చేసుకోవాలన్నారు.కానీ తెలంగాణ ఇచ్చేది 44 లక్షల మందికని, ఇందులో వారిచ్చే పెన్షన్లు 6 లక్షల మందికి 200 రూపాయలు మాత్రమే అని చెప్పారు. కేసీఆర్ మనసున్న మారాజు కాబట్టి ఆయా వర్గాల ఇబ్బందులు గుర్తించి అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారన్నారు.