రిపబ్లిక్ అంటే ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం ఉన్న దేశం.
గణతంత్రం (Republic) ;
గణం…. అంటే సమూహం/గుంపు.తంత్రం….అంటే పాలనకు సంబంధించిన విధానం/ పద్దతి/వ్యవహారం.
భారతదేశానికి సంబంధించి ప్రజల చేత ప్రత్యక్ష లేదా పరోక్ష విధానం ద్వారా ఎన్నికైన వారి పాలన ఉన్న “గణ రాజ్యాలు” చాలాప్రాచీన కాలంలోనే విలసిల్లాయి.మలివేద కాలంలో ఎన్నిక కాబడ్డ “రాజన్ ” అనే ప్రముఖుడి పాలన చాలా ప్రాధమిక స్థాయిలో కనబడుతుంది. బుద్దుడి కాలం నాటికి గణరాజ్యాల వ్యాప్తి పెరిగిపోయింది. ‘కపిలవస్తు’ ‘లిఛ్ఛవీ’….లాంటి బలమైన గణతంత్ర రాజ్యాలు కనపడుతాయి.వజ్జ,మల్ల, కాలమ మొదలైన జాతులకు సంబంధించిన గణసంఘ రాజ్యాలను ‘Proto type Republics’ గా పరిగణించవచ్చు.
క్రీ.పూ.4 వ శతాబ్దంలోనే పాణిని తన అష్టాద్యాయిలో ‘మహాజనపథం’అనే పదాన్ని వాడడం జరిగింది.బౌద్దమత గ్రంధాలైన ‘మజ్జమనికాయ’, ‘అంగుత్తరనికాయ’లలో ఈ షోడష మహా జనపదాల గురించిన ప్రస్థావన చాలా విపులంగా చేయబడింది. పాలనా నిర్ణయాల్లో”గణ’ మరియు ‘సంఘ’ అను రెండు ప్రజాసభల పాత్ర ఎలా ఉండేవో ఈ గ్రంథం వివరిస్తోంది. మెగస్తనీసు తన “ఇండికా” లో కూడా ఈ గణసంఘాల గురించిన ప్రస్తావన చేయడం విశేషం.
ఇంతటి గొప్ప చారిత్రక నేపథ్యం గల రిపబ్లిక్స్ కాలక్రమేణా మధ్యయుగాల నాటికి నిరంకుశ,వారసత్వ, రాచరిక పాలన లోనికి మారిపోయి అంధకార యుగంలోకి జారిపోయాయి. అయితే ఆధునిక యుగంలో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా కొంత ఆలస్యంగానైనా.. 1950 జనవరి 26 నాటికి సంపూర్ణ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
1950 జనవరి 26 తేదీన భారత రాజ్యాంగం తనకు తానుగా భారతదేశాన్ని సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకొన్న నాటి నుండి… భారతదేశ ప్రజలు ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రభుత్వాలను ఎన్నుకోవడం జరుగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశాలలో యజమానికి ( Public Representative), సేవకుడికి (Public Servant) ఉండాల్సిన అనేక విషయాలను వివిధ చట్టాల ద్వారా విపులీకరించబడ్డాయి.
యజమానికి సేవకుడికి జీతం విషయంలో “పరస్పర” ( Mutual Agreement) ఒప్పందం ఉండాలనే వాదన బయలుదేరింది. వేతన జీవికి ఉండే కనీస వసతులు,పని గంటలు,వేతనాల మీద విస్తృతంగా చర్చ జరిగి చట్టాలు చేయబడ్డాయి.
రాచరికం ఉండే ప్రాచీన రాజ్యాలలో సేవకుడికి, యజమానికి “పరస్పర ఒప్పందం” అన్న భావనకు ఏ మాత్రం అవకాశం ఉండేది కాదు.యజమాని ఎంత జీతం నిర్ణయిస్తే అంతకు మాత్రమే పని చేయాలి.యుద్ధం లాంటి సమయాల్లో దొరికే బానిసలను పెద్దపెద్ద కట్టడాల నిర్మాణాలకు చెరువుల తవ్వకాల లాంటి ఎన్నో పనులకు ఎలాంటి జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరి చేయించుకునేవారు. వారికి ఎలాంటి హక్కులు ఉండేవి కావు.
ఆధునిక భారతదేశంలో కూడా ముఖ్యంగా బ్రిటిష్ ఇండియాలో ఈ పరిస్థితిలలో కొంత మార్పు వచ్చింది. పని గంటలు, వేతనాల స్థిరీకరణ లాంటి కొన్ని ప్రజాస్వామిక భావనలు,హక్కులు వేతన జీవులకు ఇవ్వబడ్డాయి. అయితే అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు.కారణం బ్రిటిష్ పాలకులు భారతీయ వేతన జీవులు పాక్షిక బానిసలు పరిగణించడమే.ఇప్పటికీ మన చట్టాలలో మిగిలిపోయి పొరపాటున ఆచరించబడుతున్న నియమాలు నాటి బ్రిటిష్ పాలనా కాలపు ఆనవాళ్లే. ఆ అవశేషాలు నేటికీ కనబడుతూ ఉంటాయి.
1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రావడం, అదే క్రమంలో 1950 జనవరి 26 న ఇండియా పూర్తిస్థాయి రిపబ్లిక్ గా అవతరించడం జరిగింది. తద్వారా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారం చేత అనేక సంస్కరణలను చేపట్టడం జరిగింది.అందులో వేతన జీవులకు సంబంధించిన అనేక చట్టాలు ప్రధానమైనవి.
ప్రభుత్వానికి (Employer ), ఉద్యోగికి (Employee) మధ్య ఉండాల్సిన సంబంధాలను భారతీయ చట్టాలు పునర్నిర్వచించాయి. ఈ క్రమంలో భారతీయ న్యాయస్థానాలు వాటి మీద అనేక మైలురాళ్ళ (Milestone Judgements) వంటి తీర్పులను కూడా యిచ్చాయి.ప్రజా సేవకుడికి (Punlic Servants) కల్పించాల్సిన కనీస సౌకర్యాలలో, వేతనాలలో, పని గంటలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.యజమాని (Master/Employer/Govt..) ఎంత నిర్ణయిస్తే అంతకు పని చేయడం రాజ్యాంగ విరుద్ధం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. ప్రజాస్వామ్య దేశాలలో అలా కుదరదు.రాజరిక ప్రజలలో మాత్రమే ఇది సాధ్యం.
రాజ్యాంగపరమైన హక్కులుకనుగుణంగా వ్యవస్థలు పని చేయాల్సిన అవసరం ఉంది.ఆ దిశగా ప్రజా సేవకుల(Public Servants) క్షేమాన్ని చూడాల్సిన అవసరం ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలున్న రిపబ్లిక్ రాజ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే నిజమైన రిపబ్లిక్ నకు అర్థం,పరమార్థం ఉంటుంది.
ఆధునిక భారతీయ పాలనా వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ సరైన విధంగా వ్యవహరించని సందర్భాల్లో భారతీయ ఉన్నత న్యాయస్థానాలు చాలా క్రియాశీలకంగా వ్యవహరించి అనేక చరిత్రాత్మక తీర్పులను ఇచ్చాయి.న్యాయస్థానాల క్రియాశీలత(Judicial Activism) కు ఉన్న ప్రాధాన్యతను చాలా సందర్భాల్లో విజ్ఞులు ప్రస్తుతించడం గమనార్హం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ” పే రివిజన్ ” విషయాలకు సంబంధించి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కొంత వైరుధ్యం కనబడుతోంది. మేమడుగుతున్న జీతాలకు, ప్రభుత్వం ఇస్తామంటున్న జీతాలకు కొంత తేడా ఉండటం వల్ల ఓ రిప్ పిటీషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఏదీ ఏమైనా ప్రభుత్వం, ఉద్యోగులు వేరు వేరు కాదు. సమర్థవంతమైన అధికారి చక్కగా పని చేస్తే ఆ మేరకు ప్రభుత్వం చక్కగా పని చేస్తుందని పేరు వస్తుంది. ప్రభుత్వం కూడా ఉద్యోగులను తమ బిడ్డల లాగా చూడాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ప్రతిష్టంభన తొలగిందుకు అవకాశం ఉంటుంది.
అద్భుతమైన ప్రజాస్వామ్య రిపబ్లిక్ భారతదేశంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ..