– ఐన్యూస్ ఆఫీసులో ట్యాపింగ్ కోసం సర్వర్
– రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్
– శ్రవణ్‌తో కలసి ట్యాపింగ్ చేశామన్న ప్రణీత్
– డీఎస్పీ ప్రణీత్ సమాచారంతో శ్రవణ్ ఇంటిపై పోలీసు దాడి
– ఇంటలిజన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంటిలోనూ సోదాలు
– పరారీలో శ్రవణ్‌రావు?
– లండన్ పారిపోయారా?
– అమెరికాకు వెళ్లిన ప్రభాకర్‌రావు?
– సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసు
( అన్వేష్)
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి. కేసీఆర్ హయాంలో అప్పటి విపక్ష నేతలు, వ్యాపార ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన కేసున డీఎస్పీ ప్రణీత్‌రావును కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. తనకు రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావుకు ఊరట లభించలేదు. కాగా వెలమ సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులను ఒక బృందంగా ఏర్పాటుచేసి, లక్ష్యంగా ఎంచుకున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసిన కేసు ఇప్పుడు బీఆర్‌ఎస్ మెడకు చుట్టుకోబోతోంది.
కాగా తాము నాటి ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశామని డీఎస్పీ ప్రణీత్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా వెలమ సామాజికవర్గానికే చెందిన ఐన్యూస్ ఎండి శ్రవణ్‌రావు చానెల్ ఆఫీసులోనే, ట్యాపింగ్‌కు సంబంధించిన సర్వర్ రూమును ఏర్పాటుచేశామని పోలీసులకు ఆధారాలు సమర్పించారు. దానితో పోలీసులు హుటాహుటిన ప్రణీత్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. శ్రవణ్‌తోనే కలసి తాను ట్యాపింగ్‌కు పాల్పడ్డానని ప్రణీత్ స్పష్టం చేశారు. అయితే ఆ సమయంలో శ్రవణ్ ఇంట్లో లేరు. ఆయన లండన్ పారిపోయినట్లు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, ప్రణీత్ సమాచారం మేరకు ఇంటలిజన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు నివాసంలోనూ పోలీసులు సోదా నిర్వహించారు. అయితే ఆయన అమెరికాకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.