‘కమలం’ కోటాలో కడప?

-కడప ఎంపీ సీటు ఇవ్వాలంటున్న బీజేపీ?
– రాజంపేటను బీజేపీ వదులుకున్నట్లేనా?
– అక్కడ బీజేపీ అభ్యర్ధి ఉంటే ముస్లింలు ఓటేయరని టీడీపీ అభ్యర్ధుల ఆందోళన
– దానికితో విజయనగరం తీసుకోవాలంటున్న టీడీపీ
– కాపు నేత గేదెల శ్రీనివాస్‌కు విజయనగరం సీటు?
– టీడీపీ జాబితాలో బీజేపీ నేతలకు అవకాశం
– బైరెడ్డి శబరి, డాక్టర్ పార్ధసారధి, కృష్ణప్రసాద్‌కు ఎంపీ సీట్లు
– టీడీపీతో సజావుగా సాగుతున్న బీజేపీ సీట్ల సర్దుబాటు
– కమలంలోనే కుదరని సీట్ల కుస్తీ
– పురందేశ్వరి, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజు, గీత పేర్లు ఖరారు?
– మిగిలిన చోట్ల అభ్యర్ధులు-నియోజకవర్గాలపై తకరారు
– కడప ఎంపీ బీజేపీ తీసుకుంటే అసెంబ్లీకోటా సీట్లు తగ్గించుకునే అవకాశం?
– ఐదారు అసెంబ్లీ సీట్లు సర్దుబాటులో టీడీపీకి వెళ్లే చాన్స్?
– అసెంబ్లీకి బలమైన నేతలు?
– ఏపీ బీజేపీలో సీట్ల సర్దుపాట్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీలో సీట్లు-నియోజకవర్గాల సర్దుపాట్లు ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు లేదు. ఆ క్రమంలో కొత్తగా కడప ఎంపీ సీటు తెరపైకొచ్చినట్లు తెలుస్తోంది. కడపలో వైఎస్ కుటుంబమే వైరి వర్గాలుగా విడిపోయి పోటీ చేస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. కడప ఎంపీ సీటుకు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ షర్మిలారెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో వైఎస్ అభిమానుల ఓట్లు భారీ స్థాయిలో చీలిపోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అక్కడ గెలిచి చరిత్ర సృష్టించాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో కడప ఎంపీ అభ్యర్ధులుగా ఎంపీ సీఎం రమేష్ బరిలో ఉంటారా? లేక ఆదినారాయణరెడ్డి ఉంటారో చూడాలి.

కాగా ఇప్పటివరకూ బీజేపీకి వెళ్లిందని భావిస్తున్న రాజంపేట ఎంపీ సీటు, తాజాగా తిరిగి టీడీపీ కోటాకు బదిలీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజంపేట ఎంపీ పరిథిలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉన్నందున.. బీజేపీ అభ్యర్ధి ఎంపీ అయితే తమకు ఓట్లు వేయరని టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారట. ఆ నేపథ్యంలో రాజంపేటను టీడీపీ తీసుకుని, విజయనగరం సీటు బీజేపీకి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో కాపు వర్గానికి చెందిన గేదెల శ్రీనివాస్ బీజేపీ అభ్యర్ధి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక హిందూపురం టీడీపీకి వెళ్లడంతో, బీజేపీ అనంతపురం కావాలని కోరుతోంది. కానీ అక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై వ్యతిరేకత ఉన్నందున, టీడీపీ ఆ ప్రతిపాదనను అంగీకరించకపోవచ్చంటున్నారు. హిందూపురంలో బీజేపీ మాజీ నేత డాక్టర్ పార్ధసారథికి టీడీపీ తాజాగా ఎంపీ సీటు కేటాయించింది.

అసెంబ్లీకి సంబంధించి బీజేపీ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కడప ఎంపీ సీటు తీసుకుంటే.. టీడీపీ ఇచ్చిన ఒకటి, జనసేన ఇచ్చిన 3 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి ఇచ్చేయవచ్చని ఓ సీనియర్ నేత సూచనప్రాయంగా వెల్లడించారు. అప్పుడు అసెంబ్లీ బరిలో బలమైన కొద్దిమంది అభ్యర్ధులు మాత్రమే బరిలో ఉంటారని చెబుతున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలను సైతం అసెంబ్లీ బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

కాగా ఇప్పటివరకూ పురందీశ్వరి, సీఎం రమేష్, రఘరామకృష్ణంరాజు, కొత్తపల్లి గీత పేర్లు మాత్రమే ఖరారయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనూహ్యంగా మరికొందరి పేర్లు తెరపైకొచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. శనివారం రాత్రికల్లా ఎంపీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. దానికోసం సీనియర్ నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు.

ఇక టీడీపీ-బీజేపీ పొత్తు సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నుంచి వచ్చిన వారికి, టీడీపీ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడమే దానికి నిదర్శనం. ఇటీవల కర్నూలు జిల్లా బీజేపీ నేత బైరెడ్డి శబరికి నంద్యాల, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఐపిఎస్ కృష్ణప్రసాద్‌కు తాజాగా బాపట్ల, దంతవైద్య నిపుణుడు డాక్టర్ పార్ధసారథికి హిందూపురం టీడీపీ ఎంపీ సీట్లు కేటాయించింది. అంటే పైస్థాయిలో టీడీపీ-బీజేపీ పొత్తు ప్రక్రియ సుహృద్భావంగానే సాగుతోందని స్పష్టమవుతోంది.

Leave a Reply