నాలుగుపదుల ‘కమల’ విషాదం

– భల్లాలదేవుళ్లే తప్ప బాహుబలి ఏరీ?
– వెంకయ్యనాయుడు స్థాయిలో ఎదగని పార్టీ
– ఆరెస్సెస్ ఆలోచనా లోపమే అసలు కారణం
– రాజకీయ సోయ లేని సంఘటనామంత్రులు
– వలస నేతలకు చోటివ్వని నాయకత్వం
– తెలుగు రాష్ట్రాల్లో నాలుగు దశాబ్దాలయినా వికసించని ‘కమలం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

వాళ్లు జీరో స్థాయిలో ఉన్న త్రిపురలో పార్టీ గెలిస్తే సంతోషపడతారు. క్రైస్తవానికి చిహ్నమయిన గోవా రాష్ట్రంలో గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. యుపీలో గెలిస్తే పండగ చేసుకుంటారు. అసోంలో గెలిస్తే స్వీట్లు పంచుకుంటారు. ఎంతగా అంటే.. తమ సొంత రాష్ట్రంలో గెలిచినంత ఆనందంగా! కానీ.. తమ రాష్ట్రాల్లో పార్టీ గెలిచి ‘సొంత సంబరాలు’ చేసుకోవాలని ప్రయత్నించరు. అప్పుడెప్పుడో చైనాలో వర్షం పడితే, కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పడతారన్న సామెత మాదిగా అన్నమాట! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనే జాతీయ పార్టీ పరిస్థితి కూడా అదేనన్నది నిష్ఠుర నిజం.

బాహుబలి ఏడీ?
ఎమ్మెల్యే నుంచి కేంద్రమంత్రి, అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు మాదిరిగా.. అందులో కనీసం రెండోవంతు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎదగలేని ‘పువ్వుపార్టీ ’ ఇప్పుడు నలభైమూడవ పుట్టినరోజు చేసుకుంటోంది. నాయకులు మాత్రం కేంద్రమంత్రులు, గవర్నర్లు, జాతీయ నాయకుల స్థాయికి ఎదిగితే.. పువ్వుపార్టీ మాత్రం.. అసెంబ్లీలో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేల సంఖ్యకూ విస్తరించని విషాదం! అందరూ భల్లాలదేవుళ్లే.. కానీ భూతద్దం వేసి వెతికినా బాహుబలి కనిపించడు. బాహుబలి కావాలనీ ప్రయత్నించరు!! ఒకవేళ ప్రయత్నించిన వారి ముందరికాళ్లకు బంధాలు. అసలు తెలుగురాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు లోపం ఎక్కడ?.. ఎవరిది? పార్టీకి దిశానిర్దేశం చేసే ఆరెస్సెస్‌దా? లేక తెలుగు రాష్ట్రాలపై అవగాహన లేని పార్టీ నాయకత్వానిదా?

డజను మంది ఎమ్మెల్యేలకూ దిక్కులేని విషాదం
ప్రపంచంలో ఏ పార్టీకీ లేనంత సభ్యుల సంఖ్య, దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద పార్టీ. నాలుగుసార్లు అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీ. పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర వంటి కమ్యూనిస్టుల కోటలో పాగా వేసిన పార్టీ. అనేక రాష్ట్రాల్లో అసలు జీరో నుంచి అధికారపగ్గాలందుకునే స్థాయికి ఎదిగిన ఓ జాతీయ పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకూ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కాదుకదా.. అటూ ఇటూ కలిపి ఓ అరడజను ఎమ్మెల్యేలు కూడా గెలవలేని దయనీయం కూడా అదే జాతీయ పార్టీది. అదే భారతీయ జనతా పార్టీ.

అంతా వెలిగిన వారే…
సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలుగా పనిచేసిన వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కృష్ణంరాజు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, వి.రామారావు, హరిబాబు, కిషన్‌రెడ్డి వంటి ప్రముఖులు కేంద్రమంత్రి, గవర్నర్ల స్థాయికి ఎదిగారు. వీరిలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఆయనే కర్త,కర్మ,క్రియ. వీరిలో కృష్ణంరాజు మినహా పార్టీ స్థాపన నుంచీ పనిచేసిన వారే. బంగారు లక్ష్మణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడి వరకూ ఎదిగినా, విషాదకర పరిస్థితిలో ఆయన వైదొలగాల్సి వచ్చింది. అది వేరే విషయం. ఇక రాంమాధవ్, భాగయ్య సంఘ్‌లో శాసించే స్థాయి పదవులు నిర్వహించారు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ అధ్యక్షుడు, ఉప రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు పొందే అవకాశం లభించిందన్నమాట.

బలహీనమైన రాష్ట్రాల్లో కూడా బలపడి…
అయితే విచిత్రం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు ఆ స్థాయికి ఎదిగినప్పటికీ, పార్టీ మాత్రం సంస్థాగతంగా అందులో రెండో వంతు కూడా విస్తరించలేకపోవడం! బీజేపీకి అసలు ఏమాత్రం బలంలేని పశ్చిమబెంగాల్‌లో ఇప్పుడు ఆ పార్టీది విపక్షపాత్ర. అసలు ఊహించేందుకే వీలులేని కమ్యూనిస్టుల కోట త్రిపుర, క్రైస్తవులకు పట్టున్న గోవా, ఏమాత్రం బలం లేని అసోం, బీహార్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఏకంగా అధికారం సంపాదించింది.

ఒడిషా వంటి రాష్ట్రాల్లో అయితే ఆ పార్టీది ప్రతిపక్షపాత్ర. క్రైస్తవులకు పట్టున్న ఈశాన్య రాష్ట్రాలు, ముస్లింల పట్టున్న జమ్ముకాశ్మీర్‌లో కూడా కమలం వికసించడమంటే ఆషామాషీ కాదు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ రాత్రికి రాత్రి అధికారంలోకి రాలేదు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, కార్యకర్తల ఆత్మబలిదానాలు, రాజకీయ ఎత్తుగడతోనే అది సాధ్యమయంది. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఆరెస్సెస్ కష్టం కూడా కీలకమన్నది విస్మరించకూడదు.

ఆప్, మజ్లిస్ పాటి విస్తరణ ఏదీ?
ఎవరూ ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ను పక్కకునెట్టి మమతాకు సవాలు విసరడం అదో అద్భుతం. దానికి కాషాయసైనికుల ఆత్మబలిదానాలు, శ్రేణుల పోరాటస్ఫూర్తి ప్రధాన కారణం. హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ మహారాష్ట్ర, బీహార్‌లో ఎంపీ, ఎమ్మెల్యేలనూ సాధించింది. ఢిల్లీకే పరిమితమైన ఆప్ పంజాబ్‌లో అధికారం సాధించి, ఇప్పుడు గుజరాత్, తెలంగాణ వైపు చూస్తోంది.

‘నాయుడు గారి స్థాయి’లో వెలగని పార్టీ
మరి అసలు ఉనికి కూడా లేని రాష్ట్రాల్లో ఏకంగా అధికారపగ్గాలే చేపట్టిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా కనీసం ప్రతిపక్ష స్థానంలోకి ఎందుకు రాలేదు? దానికి కారణం ఎవరన్నది ప్రశ్న. రాష్ట్ర విభజన ముందు వరకూ ఏపీ బీజేపీకి వెంకయ్యనాయుడే ఆత్మలా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. వెంకయ్యనాయుడు కంటే సీనియర్లు, ఆయన కంటే జూనియర్లు చాలామంది ఉన్నప్పటికీ వారెవరూ ఢిల్లీలో పాగా వేయలేకపోయారు. దానితో ఆయనే ఢిల్లీలో పార్టీతోపాటు, తెలుగునేతలకు కొండంత దిక్కయ్యారు. ఆయన చల్లనిచూపులున్న వారంతా రాణించారు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వారు తర్వాతి కాలంలో పార్టీలో కనుమరుగయిపోయారు. ఆ స్థాయిలో ఇప్పటివరకూ జాతీయ స్థాయిలో రాణించిన వారెవరూ లేరు. సరే.. ఇప్పుడు నాయుడు గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున, అంతకుమించి ముందుకు వెళ్లడం భావ్యం కాదు.

నాయుడుగారి కాలం నుంచీ…
నాయుడు గారు ఉపరాష్ట్రపతి చేపట్టకముందు వరకూ క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నారు. అప్పుడు కూడా ఏపీలో బీజేపీ పెద్దగా వెలిగిందీ లేదు. 1998 ఎన్నికల్లో పొత్తు లేకుండా 18 శాతం ఓట్లతో నాలుగు ఎంపీలు సాధించగలిగారు. తర్వాత టీడీపీతో పొత్తు వల్ల రాజకీయంగా లాభపడినా, దానిని పార్టీ విస్తరణకు వినియోగించడంలో నాయకత్వం విఫలమయింది. టీడీపీ కూడా బీజేపీ పొత్తుతో బాగా లబ్ధిపొందింది. ఆ సమయంలో పొత్తును రాజకీయ విస్తరణకు వాడుకోవడానికి బదులు, నేతల వ్యక్తిగత లబ్థికి వినియోగించుకోవడంతో బీజేపీ విస్తరణకు నోచుకోకుండా పోయింది. అందులో టీడీపీ పాత్ర కంటే బీజేపీ స్వయంకతమే ఎక్కువ. బీజేపీ విస్తరిస్తే టీడీపీ అడ్డుకునే అవకాశం ఎందుకు ఉంటుంది?

పైగా టీడీపీ అధికారంలో ఉండగా, చాలామంది బీజేపీ నేతలు సొంత పనులు చేసుకుని లాభపడగా, పార్టీ మాత్రం అడుగుకూడా ముందుకుపడకుండా ఉండిపోయింది. అందుకే టీడీపీ పొత్తుతో తమ పార్టీ
babu-adwani నష్టపోయిందన్న కొందరి వాదనను సీనియర్లు ఆక్షేపిస్తుంటారు. అసలు కారణం ఎన్నికల్లో పోటీ చేస్తే నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చన్న ముందుచూపు. అందుకే బీజేపీ లోకి కింది స్ధాయి నేతలు పొత్తులను వ్యతిరేకిస్తుంటారన్నది ఓ ప్రచారం.

పార్టీ బలహీనమైదయినా.. నేతలు ఆర్ధికంగా బలవంతులే
తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా బీజేపీ బలంగా లేకపోయినా, ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు మాత్రం ఆర్ధికంగా బలపడ్డారు. పలు రాష్ట్రాల్లో పవర్ ప్రాజెక్టులు, ఇన్‌ఫ్రా , రియల్‌ఎస్టేట్, పారిశ్రామికరంగాల్లో బలంగా ఉన్నవారే. ప్రధానంగా చాలాకాలం నుంచి పార్టీలో ఉన్న ఈ తెలుగునేతలంతా ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నారంటే.. పార్టీకి నాయకులు సేవచేస్తున్నారా? నాయకులకు పార్టీ సేవచేస్తోందా అన్న సందేహం రావటం సహజం. అయితే ఈ తరహా వ్యాపారులెవరూ ఎన్నికల్లో పోటీ చేయరు. ఢిల్లీలో గాడ్‌ఫాదర్లను పట్టుకుని వ్యాపారాభివృద్ధిలో మునిగితేలుతుంటారన్నది మరో విమర్శ.

లిమిటెడ్ కంపెనీగా మారి..
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ‘లిమిటెడ్’ కంపెనీ మాదిరిగానే నడుస్తోంది. పాతికేళ్ల క్రితం వార్డు స్థాయి నాయకుడిగా ఉన్న నేత ఇప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యుడిగానో, జాతీయ కమిటీలో ఏదో ఒక పదవిలో ఉంటారు. ఆయన భార్య, లేక కొడుకు మహిళామోర్చాలోనో, యువమోర్చాలోనో పనిచేస్తుంటారు. ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ఓ పెద్దాయన.. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో, గుంటూరు జిల్లా నుంచి పార్టీ నాయకుడొకరు కుటుంబసభ్యులతో వచ్చి కలిసి పరిచయం చేసుకున్నారు. ఆ సందర్భంలో తన కొడుకు, భార్యను పరిచయం చేసినప్పుడు… వీరు మహిళామోర్చాలో పనిచేస్తున్నారా? బాబు యువమోర్చాలో పనిచేస్తున్నాడా? అని ఆ అధ్యక్షుడు అడిగేశారట. అంటే పార్టీలో కొత్తవారెవరూ రారన్నది ఆకాలం నాటి మాట అన్నమాట.

కొత్తవారికి కష్టాలే
ఆ పరిస్థితి ఇప్పుడూ ఉంది. తొలి నుంచీ బీజేపీలో పనిచేస్తున్న వాళ్లెవరూ ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని స్వాగతించరు. ఒకవేళ వచ్చినా వారికి సహ కరించరు. గౌరవించి, ఆదరించే అలవాటు లేదు. పోనీ వ్యవస్థాపక కాలం నుంచీ ఉన్న వాళ్లెవరయినా, తెగించి పార్టీని ఉద్ధరిస్తారా అంటే అదీ లేదు. ఈ సంధియుగంలో సగం చచ్చిపోయిన కొత్తవాడు, తనంతట తానే పార్టీ నుంచి నిష్క్రమిస్తాడు. ఆ తర్వాత పార్టీ నేతలు.. నాయకత్వం వద్దకు వెళ్లి, ‘‘మేం చెప్పేది మీరు వినరు కదా? ఇతర పార్టీల వాళ్లు మన పార్టీలో ఇమడలేరు. వాళ్లు వచ్చి వెళ్లిపోతే మేమే మళ్లీ పార్టీకి పనిచేయాలి. మీరేమో మమ్మల్ని గుర్తించరు’’ అని నిష్ఠూరాలాడుతుంటారు. అయితే.. ‘‘పార్టీలో కొత్తవాళ్లు వస్తారు. వారిని చేర్చుకోండి. గౌరవించండి. వారికి పనిచెప్పండి’’ అని అమిత్‌షా నుంచి నద్దావరకూ చెబుతూనే ఉంటారు. దాన్నెవరూ పాటించరు అది వేరే విషయం. అమిత్‌షా తిరుపతి పర్యటనలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్టీలో ఎందుకు చేర్చుకోలేదు అని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా, బీజేపీ నాయకత్వంలో చలనం లేదంటే, రాష్ట్ర నేతల ధిక్కారపర్వం.. కేంద్ర నాయకత్వం నిర్లిప్తత ఏస్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఇది కొన్నేళ్ల నుంచి కమలం పార్టీలో విజయవంతంగా జరుగుతున్న కథే.

సీనియర్లకే దిక్కులేదు
టీడీపీలో దశాబ్దాలు పనిచేసిన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, డాక్టర్ పరకాల ప్రభాకర్, ముద్రగడ వంటి అగ్రశ్రేణి నేతలను కూడా, ఇలాగే తమంతట తాము వెళ్లేలా చేయడంలో బీజేపీ నేతలు విజయం సాధించారు. జనతాదళ్ జాతీయ అధికార ప్రతినిధి, బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ బీజేపీలో చేరిన తర్వాత, పార్టీ విధాననిర్ణయమైన అమరావతిపై వ్యాసం రాసినందుకు ఆయనపై వేటు వేశారు. మీడియాలో చరుకుగా ఉండే ఆర్ధికశాస్త్ర విశ్లేషకుడు లంకా దినకర్ చాలాకాలం తర్వాత అధిష్టానం జోక్యంతో బయటపడగలిగారు. అధికార ప్రతినిధి ఆర్‌డీ విల్సన్ కూడా తృటిలో వేటు తప్పించుకున్న నాయకుడే. ఇక సొంతంగా పోటీ చేసిన గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలిపి, పార్టీ పరువు నిలబెట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను అర్ధంతరంగా తొలగించారు. ఏమాత్రం ఉనికి లేని ఏపీలో అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్ధులు దొరకడమే బ్రహ్మాండంగా మారిందంటే పార్టీ ఎంత బలంగా ఉందో ఊహించుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులే కరువైన విషాదానికి పార్టీ పడిపోయింది.

త్రిపురలో అలా.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఒకప్పుడు త్రిపుర కమ్యూనిస్టు- కాంగ్రెసు ఖిల్లా. అక్కడ బీజేపీ ఉనికి సున్నా. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలంతా ఖాళీ చేసి బీజేపీకి రావడంతో, అక్కడ అధికారంలోకి రాగలిగింది. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో సీఎం అయిన నాయకుడయితే.. ఇప్పుడు సంప్రదాయ బీజేపీనేత కంటే హిందుత్వాన్ని బలంగా వినిపిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పరిస్థితి ఇలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం కూడా పార్టీ విస్తరణకు ఓ ప్రధాన లోపమన్నది ఓ విశ్లేషణ.

సంఘ్ కోణమే అసలు సమస్య
modi-amithshahఇక ప్రధానంగా… ఆరెస్సెస్ నియమించే పార్టీ రాష్ట్ర సంఘటనా మంత్రులకు రాజకీయ అవగాహన లేకపోవడం కూడా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అభివృద్ధికి ఓ అవరోధమన్నది నేతల వ్యాఖ్య. మారుతున్న పరిస్థితిలకు అనుగుణంగా సంఘ్ నేతలు నిర్ణయాలు తీసుకోకుండా, ఇంకా సంప్రదాయ పద్ధతులనేపట్టుకుని వేళ్లాడుతుండటం కూడా మరో సమస్య అంటున్నారు. మోదీ-అమిత్‌షా మాదిరి కాకుండా, ఇంకా వాజపేయి-అద్వానీ కాలం నాటి ఆలోచనాధోరణి
vajpai-adwaniకొనసాగిస్తున్నారన్నది మరికొందరి వ్యాఖ్య. ‘క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్టే ఆడాలి. కానీ సంఘ్ షటిల్ ఆడుతోంది. అదే సమస్య’ అని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు.

పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వ్యవహరించే సంఘటనా మంత్రులకు రాజకీయ కోణం లేకపోవడం, ఫక్తు రాజకీయ పార్టీ మాదిరిగా ఎత్తుపైఎత్తు వేసే సామర్థ్యం లేకపోవడం, సమర్ధులైన నేతలకు పదవులు సిఫార్సు చేయకపోవడం వంటి బలహీనలతోపాటు.. ఇంకా కొన్ని ‘వ్యక్తిగత బలహీనత’లు కూడా ఉన్న సంఘటనా మంత్రుల ఆలోచనా కోణమే, బీజేపీ బలపడకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

గతంలో సంఘటనా మంత్రిగా పనిచేసిన ఓ నాయకుడి ‘వ్యక్తిగత బలహీనత’లపై మీడియాలో కథనాలొచ్చి ఢిల్లీకి అనేక ఫిర్యాదులు వెళ్లగా, ఆయనను అక్కడి నుంచి తొలగించి వేరే రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో వేణుగోపాల్‌రెడ్డి స్థాయిలో, ఇప్పటివరకూ ఎవరూ సమర్ధవంత ంగా పనిచేయలేకపోయారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంటుంది.

సంఘటనా మంత్రి దిశానిర్దేశ లోపం
ఇప్పుడు ఏపీలో సంఘటనా మంత్రిగా పనిచేస్తున్న మధుకర్‌జీ పార్టీని సరైన దిశలో నడిపించలేకపోతున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పార్టీకి బలం లేకపోయినా వివాదాలు మాత్రం బలంగా ఉన్నప్పటికీ, ఆయన ఏ మాత్రం చొరవ చూపి వాటిని పరిష్కరించలేకపోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కో కన్వీనర్ ఒక వర్గంగా ఏర్పడి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఫిర్యాదు అమిత్‌షా వరకూ వెళ్లిందంటే, సంఘటనా మంత్రి పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుంది. ఒక జాతీయ కార్యదర్శికి సన్మానం నిర్వహించిన సొంతపార్టీ నేతను, రాష్ట్ర అధ్యక్షుడు ఏకపక్షంగా దళితమోర్చా ఇన్చార్జి బాధ్యత నుంచి తప్పించడమంటే. అది జాతీయ కార్యదర్శిని అవమానించడమనే భావన.. అది ఎలాంటి సంకేతాలకు కారణమవుతుందన్న ఆలోచన, సంఘటనా మంత్రికి లేకపోవడమే ఆశ్చర్యం.

ఏపీలో సంఘటనా మంత్రిని రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశిస్తున్నారా? రాష్ట్ర అధ్యక్షుడిని సంఘటనా మంత్రి ఆదేశిస్తున్నారో తెలియని పరిస్థితి. దేశంలో ఒక్క ఏపీలోనే కోర్ కమిటీని జాతీయ పార్టీ నాయకత్వం ప్రకటించిందంటే, నేతలను సమన్వయం చేయడంలో సంఘటనా మంత్రి ఎంత సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాలపై అవగాహనేదీ?
‘‘గతంలో నాయుడుగారు పార్టీలోచురుకుగా ఉన్నప్పుడు ఆయనకూ సంఘ్‌కూ పొసగేది కాదు. సంఘటనా మంత్రి ఆయన నిర్ణయాలను వ్యతిరేకించేవారు. వేణుగోపాల్‌రెడ్డి గారు చాలా కఠినంగా వ్యవహరించి నాయుడు గారి దూకుడుకు చెక్ పెట్టేవారు. నాయుడు గారు కూడా తన మనుషుల కోసం కృషి చేసేవారు. అంతజరిగినా ఇద్దరూ పార్టీకి నష్టం కలిగించే పనిచేయలేదు. ఇప్పుడు ఏపీలో సంఘటనా మంత్రికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయిందంటే దానికి కారణం ఏమిటన్నది ఆత్మపరిశీలన చేసుకోవాల’ని పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. మధుకర్జీతోపాటు కో ఇన్చార్జి సునీల్ దియోథర్‌కు ఆంధ్రా రాజకీయాలు, కులసమీకరణలు, వ్యక్తుల ప్రాధాన్యతల గురించి పెద్దగా అవగాహన లేకపోవడం కూడా పార్టీకి ఒక మైనస్ పాయింటని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

మిత్రపక్షమా? శత్రుపక్షమా?
ఇవన్నీ నిజమే అయినప్పటికీ.. అసలు ఏపీలో తాము అధికార వైసీపీకి మిత్రపక్షమా? శత్రుపక్షమా? తమది తెరచాటు బంధమా? తెరపై బంధమా? అన్న అంశంపై రాష్ట్ర స్థాయి నేతలకూ స్పష్టత లేకపోవడం పార్టీకి మరో మైనస్ పాయింట్. మంత్రులు బీజేపీని విమర్శిస్తారు. బీజేపీ నేతలు మంత్రులు, సీఎంను
amith-apవిమర్శిస్తారు. కానీ ఢిల్లీలో అధికార వైసీపీ-బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉంటాయి. సీఎంకు జగన్‌కు రాజకీయంగా, పాలనాపరంగా సమస్యలు లేకుండా చూస్తారు. అసలు యుద్ధానికి వెళ్లే సైనికుడికి తాము ఎవరిపై యుద్ధం చేయాలో చెప్పరు. యుద్ధం చేయడానికి ఆయుధాలూ ఇవ్వరు. ఆవిధంగా ఉత్తుత్తి యుద్ధంలో పాల్గొంటే, పార్టీకొచ్చే లాభమేమిటన్నదీ శ్రేణులకు తెలియని గందరగోళం.

తెలంగాణలో కొంత భిన్నం
ఇక తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నం. ఏపీ కంటే తెలంగాణలో పార్టీ బలంగా ఉండటానికి కారణం నాయకులలో రాజకీయ కోణం ఉండటం. బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య ఉత్తుత్తి యుద్ధం నడుస్తోందని, దేశంలో ప్రతిపక్షాలను చీల్చి మళ్లీ అధికారంలోకి రావడమే బీజేపీ ఎత్తు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. నిజానికి కింది స్థాయి బీజేపీ కార్యకర్త అంచనా-అవగాహన కూడా అదే. దానిని తొలగించే ప్రయత్నాలు బీజేపీ నాయకత్వం చేస్తున్నట్లు లేదు.

కేసీఆర్‌ను జైల్లో వేయిస్తామని బండి సంజయ్ ఇప్పటికి డజను సార్లు చెప్పిఉంటారు. కానీ ఈలోగా ఆయనే చాలాసార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కనీసం కేసీఆర్‌పై కేసు కూడా పెట్టకుండా ఎలా జైలుకు పంపిస్తారు? సీఎంకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన అనేక ఫిర్యాదులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదు? పాలకులతో సంబంధాలున్న ఓ వ్యాపారవేత్తతో బీజేపీ కీలక నేత ఎందుకు అంటకాగుతున్నారు? తెలంగాణలో బీజేపీ అధికారంలో రాకపోయినా ఫర్వాలేదు. కాంగ్రెస్ మాత్రం రాకూడదు. అదే బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యం. ఇదీ… సగటు బీజేపీ కార్యకర్త అవగాహన-అంచనా.

సంజయ్ సరే… మిగిలిన వారి మాటేమిటి?
ఇక బండి సంజయ్ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నప్పటికీ, మిగిలిన నాయకులు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఆయన ఒక టీం లీడర్‌గా వ్యవహరించలేకపోతున్నారన్నది మరో విమర్శ. పైగాamith2కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, కొత్తగా డికె అరుణ వర్గాల మధ్య పొసగదు. సంఘటనా మంత్రి మంత్రి శ్రీనివాస్ అంతా తానై, మిగిలిన వారిపై పెత్తనం చేస్తున్నార న్నది మరో ఆరోపణ.

ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేనందున, మంత్రిజీని తొలగించాలని పార్టీ నేతలు ఏకంగా ఢిల్లీ యాత్రలే చేశారు. తన ఓటమికి ఆయనే కారణమంటూ స్వయంగా ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఢిల్లీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఏనాడూ బీజేపీలో పనిచేయకుండా, ఏబీవీపీలో మాత్రమే పనిచేసిన మంత్రి శ్రీనివాస్‌లో రాజకీయ కోణం లేదన్నది సీనియర్ల విమర్శ. కాకపోతే ఏపీ మాదిరిగా కాకుండా, ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గౌరవం ఇస్తున్నారన్న తృప్తి మాత్రం వ్యక్తమవుతోంది.

అసలు సమస్య ఇదీ…
ఏతావాతా.. బీజేపీని నడిపించే సంఘ్, దాని పెద్దలకు తెలుగు రాష్ట్రాల రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్థితిగతులపై సరైన అవగాహన-అంచనా లేకపోవడం కూడా, రాజకీయంగా బీజేపీ బలపడకపోవడానికి ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో ఉండాల్సిన రాష్ట్ర కో ఇన్చార్జిలు చుట్టపుచూపుగా రావడం.. రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలకు రెండు రాష్ట్రాలపై కనీస అవగాహన లేకపోగా, రాష్ట్రాలపై సీరియస్‌గా దృష్టి సారించకపోవడం కూడా బీజేపీ బలహీనతకు మరో కారణమంటున్నారు. ఇక ఆంధ్రా నేతలకు చాలామంది భాషా సమస్యలున్నాయి. వారికున్న హిందీ-ఇంగ్లీషు పరిజ్ఞానం తక్కువ. కొద్దికాలం క్రితం సోము వీర్రాజు టిఫిన్ చేస్తూ ఇంగ్లీషులో మాట్లాడిన ఇంటర్వ్యూ సోషల్‌మీడియాలో ట్రోల్ అయిన విషయం తెలిసిందే.

తెలుగువారినే ఇన్చార్జిలుగా నియమిస్తే..
ఈ దృష్ట్యా తెలంగాణకు చెందిన నేతను ఏపీకి, ఏపీకి చెందిన నేతను తెలంగాణకు ఇన్చార్జి/కో ఇన్చార్జిగా నియమిస్తే.. వారికి రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలపై అవగాహన ఉన్నందున, పార్టీ కూడా వేగంగా విస్తరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఇప్పుడున్న పరిస్థితిలో రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీ మాదిరిగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తెలుగు వారిని అటు ఇటు ఇన్చార్జిలుగా నియమిస్తే సరైన ఫలితాలుంటాయి. ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూడకుండా స్థానిక పరిస్థితులను బట్టి స్పందించాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నప్పుడే ఈ రాష్ట్రాల్లో మా పార్టీ ఎదుగుతుంద’ని తెలంగాణకు చెందిన ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.