జగనన్నకు ప్రేమతో.. ఇట్లు మీ ముద్రగడ!

Spread the love

-పవన్‌కు ముద్రగడ లేఖ వెనుక ఎవరు?
-ద్వారంపూడిని విమర్శిస్తే ముద్రగడ స్పందిస్తారేం?
-గతంలో ఎన్నికల ప్రచారానికి లారీలు, కార్లు సప్లై చేసిన కృతజ్ఞతేనా?
-రిజర్వేషన్ల ఉద్యమాన్ని కాపు మాజీ పీఠాథిపతి కొండెక్కించారేం?
-కాపు ఉద్యమం నుంచి నిష్క్రమిస్తున్నానంటూ మళ్లీ ఆ ప్రస్తావనెందుకు?
-తనకు వైసీపీ కాకినాడ ఎంపీ, కొడుకుకు ఎమ్మెల్యే సీటు కోసమేనా ఈ పాకులాట?
-జగన్ ప్రతినిధులు వచ్చినప్పుడు రిజర్వేషన్ల షరుతు విధించలేదేం?
-ముద్రగడ పద్మనాభానికి పవన్ అభిమానులు – కాపుల జమిలి ప్రశ్నాస్త్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాపు ఉద్యమ మాజీ నేత, కాబోయే- ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ నేతగా మారిన ముద్రగడ పద్మనాభం గారికి..
అయ్యా .. మేమిలా లేఖ రాస్తున్నందుకు మీకు మాపై, మాచెడ్డ కోపం రావచ్చండయ్యా. మీ కిర్లంపూడి భజనబ్యాచ్, మాపై దాడులు కూడా చేయవచ్చనుకుంటానండి. అయినా సరే.. నిజాన్ని నిర్భయంగా రాయాలన్న లక్ష్యంతో ఈ లేఖ సంధించక తప్పలేదండయ్యా.

మహేష్‌బాబు సినిమా చూశారా అండి? అందులో గణపతి విగ్రహం పాలు తాగుతుంది అని డైలాగు చెబుతాడండి. అంటే నేనున్నానని గుర్తు చేయడానికే అలా పాలు తాగుతాడని, మహేష్ ఆ సినిమాలో డైలాగేస్తాడండి. అలాగే.. ‘ నేను కూడా ఉన్నానని’ చెప్పడానికే, అప్పుడప్పుడు మీరు కూడా లెటర్లు రాస్తుంటారా అండి? మీరు మా పవనన్నకు లేఖ రాసిన తర్వాత, మాకు ఈ డౌటనుమానం వచ్చేసిందండి. మరేమీ అనుకోవద్దు. ఊరికే ఫ్రెండ్‌షిప్‌కొద్దీ అడిగేశామండి!

అయ్యా.. అసలు మీరు ఉన్నట్లుండి, కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎందుకు అటకెక్కించారో అర్ధం కావడం లేదండి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కంచాలు, గరిటెల చప్పుళ్లతో ఇల్లు పీకి పందిరేసి.. నానా గత్తర చేసిన మీ నోరు.. జగన్ గారు సీఎం అవ్వగానే ఎందుకు మూగబోయిందో అర్ధం కావడం లేదండి. తుని మీటింగుకు ముందు మీరు, భూమన కరుణాకర్‌రెడ్డితో ఏం మాట్లాడారో ఇప్పటిదాకా మా కాపు జాతికి ఎందుకు చెప్పలేదండి? పోనీ తుని వేదికపై ఉన్న కాపు పెద్దలెవరినీ మాట్లాడించకుండా, మీరు ఒక్కరే మాట్లాడి వేదిక దిగి ఎందుకెళ్లారండి? పవన్‌కు ఎవరు సలహాలిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఓకే. మరి మీకెవరు సలహాలు ఇస్తున్నారండి? ఎవరి సలహాతో ఆ రోజు తుని లో గత్తర రేగిందండి? ఎవరి సలహాతో కాపు ఉద్యమాన్ని జమ్మిచెట్టు ఎక్కించేశారండి?

అయినా మా పవన్ కల్యాణ్ గారు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతి గురించి మాట్లాడితే మీకేమయిందండి? మీకెందుకండీ ఆయనపై అంత ప్రేమ? మీరేమో కాపు ఉద్యమనేత (ఇప్పుడు కాదు.గతంలోనే అనుకోండి). ఆయనేమో రెడ్డి నేత. అసలు మీరు ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. మరలాంటప్పుడు కాకినాడలో స్విచ్చి వేస్తే కిర్లంపూడిలో బల్బు వెలిగిందేటండీ? ఆయ్.

కాకినాడలో జరుగుతున్న అవినీతిపై మా పవనన్న నిజమే చెప్పారు. దానికి ద్వారంపూడి కదా సమాధానం చెప్పాల్సింది. మరి మీరేటండీ.. ఆయన తరఫున లాయరు మాదిరిగా వకాల్తా పుచ్చేసుకుని, తెగ లెటర్లు రాసేస్తున్నారు! కొంపదీసి ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత, ఎట్లాగూ ఖాళీనే కాబట్టి.. లా ఏమైనా చదివేశారా ఏటీ? తమ్మినేని గారు కూడా, హైదరాబాద్‌లో లా డిగ్రీ సంపాదించేశారట. అన్నట్లు లెటరు హెడ్లు అయిపోతే చెప్పండి. పంపిస్తామండి.

మిమ్మల్ని కిర్లంపూడి కాపు పీఠాథిపతిగా నాలుగేళ్ల క్రితం గౌరవించామండి. అసలు మీరంటే మాకు యమా రెస్పక్టండి. మిమ్మల్ని కాపుజాతిపిత అనుకునేవాళ్లమండి. మీరు కాపుల రిజర్వేషన్ల కోసం ఇంట్లో తలుపేసుకుని, ఆమరణ దీక్షలు కూడా చేసేవారని మన కులపోళ్లు తెగ చెప్పేసుకునేవాళ్లండి. కానీ మీరు ఎప్పుడైతే జగన్ గారు సీఎం అయిన తర్వాత.. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని కిర్లంపూడి చెట్టు తొర్రపైకెక్కించారో, అప్పుడే మీ మీద గౌరవం పోయిందండి. ఆయ్! ఒట్టండి!!

మీకూ, చంద్రబాబుకూ పడదనే అనుకుందాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే మీకు కాపు ఉద్యమాలు గుర్తుకు వస్తాయే అనుకుందామండి. కానీ చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత, కనీసం కృతజ్ఞతయినా చెప్పారా అండి? చెప్పకపోతే చెప్పకపోయారు. కనీసం దానిని అమలుచేయాలని సీఎం జగన్ గారిపై, ఒక్కసారయినా ఒత్తిడి చేశారా అండి? ఒక్కసారైనా కంచాలు, గిన్నెలు మోగించారా అండి?

ఆ డిమాండ్ సాధన కోసం ఈ నాలుగేళ్లలో, ఎప్పుడైనా దీక్షలు చేశారా అండి? కనీసం అరపేజీ లెటరు రాశారా అండి? ఇంట్లోనైనా తలుపేసుకుని నిరసన దీక్ష చేశారా అండి? మరి ఇవ్వేమీ చేయకుండా.. కాపుల గురించి మాట్లాడుతున్న పవన్ గారిని విమర్శించడం, మీ లాంటి పెద్దలకు భావ్యమేనా అండి? అంటే మిమ్మల్ని తప్ప మరెవరినీ కాపులు పెద్దన్నగా అనుకోకూడదా అండి?

ద్వారంపూడిని పవన్ విమర్శిస్తేనే మూడు పేజీల లెటరు రాశారు. మరి పవన్‌ను మంత్రులు అంబటి, కొట్టు, మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు వంటి కాపునేతలంతా రోజూ తిట్టిపోస్తుంటే.. ఖండించలేదెందుకండి? అసలు మీలో ఆనాటి కాపు చైతన్యం ఏమైందండి?

కాపుల గౌరవం-కమ్ మీ సొంత ఆత్మగౌరవానికి జమిలిగా భంగం కలిగినప్పుడు చేసే దీక్షలు, పవన్‌ను తిడుతుంటే ఏమైనాయండీ? ఓహో.. అవన్నీ నాలుగేళ్ల క్రితం ముచ్చట కదా? జగన్ గారు సీఎం అయిన తర్వాత, అసలు మీరు కాపు ఉద్యమం నుంచే నిష్క్రమించారు కదా? సారీ అండి. మర్చిపోయాం.

ద్వారంపూడి కుటుంబం మీరు గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రచారం కోసం లారీలు, కార్లు సప్లై చేశారని చెప్పారు కదండీ. బహుశా ఆ ఉప్పు తిన్న కృతజ్ఞతతోనే, ద్వారంపూడిని కాసి ఉండవచ్చనుకుంటున్నామండి. కాపు ఉద్యమానికి కూడా ద్వారంపూడి కుటుంబం, సాయం చేసిందని ఇప్పుడు చెప్పారే చూడండి. మీ కిర్లంపూడి తెలివితేటలు సూపరండి.

ఆరకంగానయినా కాకినాడ కాపులను.. ద్వారంపూడి దొడ్లో ఇంకోసారి కట్టేసి, పవన్‌ను పట్టించుకోకూడదన్న ఆలోచన కల్పించేందుకు, మీరు చేస్తున్న ‘ద్వారంపూడి శ్రమదానం’ చాలా గ్రేటండి. నిజంగా మీరు చాలా గొప్పోరండి . ద్వారంపూడి దగ్గర, డబ్బులు తీసుకుని పనిచేసే వారికి కూడా లేని విశ్వాసం, మీకు ఇంకా ఉండటం గొప్ప విషయమేనండి. మీరు ధర్మాత్ములండి బాబూ!

అన్నట్లండీ… మీరు రేపటి ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ, మీరెవరికోసమైతే ఇంత తాపత్రయపడుతున్నారో, అదేనండీ.. మీ అబ్బాయికి అసెంబ్లీ సీటు ఇచ్చేస్తారని, మన ఈస్టు గోదారిలో తెగ టాకండి బాబూ! మొన్నామధ్య ఎంపి వంగా గీత, ఎమ్మెల్యే గారు మీతో టాకింగ్ చేసేశారంట గదండి? అందుకే మీరు జగనన్నకు ప్రేమతో.. మా పవనన్నకు తెగ లెటర్లు రాసేస్తున్నారని మన కాకినాడ గంజాం వారి వీధి, టెంపుల్ స్ట్రీట్, వాకలపూడిరోడ్, భానుగుడి జంక్షన్‌లో తెగ చర్చలు జరుగుతున్నాయండి. ఆయ్!

అవునండీ.. అన్నట్లు అడగటమే మర్చిపోయాం. మొన్న ఎంపీ, ఎమ్మెల్యే గారు మీ పీఠానికి వచ్చినప్పుడు.. మన కాపులకు 5 శాతం రిజర్వేషన్ల గురించి డిమాండ్ చేశారా అండి? రిజర్వేషన్లు ఇస్తేనే పార్టీలో చేరతామని ఏమైనా షరతులు విధించారా అండీ? లేకపోతే మీకు, మీ కొడుక్కి సీట్ల చర్చలకే పరిమితమయ్యారా? ఏదో మా డౌటనుమానమండి బాబు! అట్ల సీరియస్ అవ్వమాకండి!!

పోనీలెండి. ఏదో ఒకటి. చేరేయండి. ఎంతకాలం ఖాళీగా ఉండి, లెటర్‌హెడ్ల ప్రింటింగ్ కోసం ఆ ప్రెస్సు వాళ్లను పోషిస్తారు? ఉత్తరాల ఉద్యమాలు చేస్తారు? మిమ్మల్ని భరించేందుకు వైసీపీ రెడీగానే ఉంది కదా. ఎంచక్కా వైసీపీలో చేరి ఆ ముసుగు తీసేసేయండి. ఇంకెంతకాలం ముసుగులో గాలిలేకుండా ఉంటారండి? ఎలాగూ మీరు టీడీపీ అధికారంలో ఉంటేనే, కాపు ఉద్యమాలు చేస్తారని మనోళ్లు డిసైడయ్యారండి. ఆయ్!

జగన్ గారిని పవన్‌గారు విమర్శిస్తుంటే, జగన్‌గారి వీరాభిమానిగా మీ మనసు ఒక పట్టాన స్థిమితంగా ఉండదు. అది తట్టుకోలేక ఉపశమనం కోసం జగన్ ప్రత్యర్ధులపై ఇలాంటి ఉత్తరాలు రాస్తుంటారు. అందుకే జగనన్నకు ప్రేమతో, పవన్-చంద్రబాబుకు వ్యతిరేకంగా లెటర్లు రాసే బదులు.. మొహమాటాలు పక్కనపెట్టేసి, డైరక్టుగా వైసీపీ కండువా కప్పేసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే , ఓ పనయిపోతుందండి! ఆయ్!!
ఇట్లు కాకినాడ కాపు ప్రజానీకం
Mudragada-letter-to-PK

Leave a Reply