– మేక్ ఎఐ ఫర్ ఇండియా ద్వారా నైపుణ్యంగల శ్రామికశక్తి తయారు
– ఆంధ్రప్రదేశ్ లో రూ.255 కోట్లతో 3 ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు
– వరల్డ్ ఎకనమిక్ ఫోరం విద్యారంగ గవర్నర్ల సమావేశంలో మంత్రి లోకేష్
దావోస్: ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా మార్పు చెందుతున్న సాంకేతికల నేపథ్యంలో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండేలా నవీన ఆవిష్కరణలు కోసం విద్యాసంస్థలు, కార్పొరేట్ ల భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
దావోస్ కుర్ పార్కు విలేజ్ లో జరిగిన ఎడ్యుకేషన్ గవర్నర్ల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సమావేశంలో గ్లోబిస్ యూనివర్సిటీ ఫౌండర్, ప్రెసిడెంట్ యోషితో హోరి, మాంటెర్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ డేవిడ్ గార్జా (మెక్సికో), పియర్సన్ సిఇఓ ఒమర్ అబోష్ (యుకె), యూనవర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రెసిడెంట్ మిచైల్ స్పెన్స్ (యుకె), నెట్ వర్క్ ఫర్ టీచింగ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రెసిడెంట్ జీన్ డానియేల్ లారోక్ (యుఎస్ఎ), కార్నర్ స్టోన్ ఆన్ డిమాండ్ సిఇఓ హిమాన్షు పల్సులే (యుఎస్ఎ), ఈటిఎస్ సిఇఓ అమిక్ సేవక్ (యుఎస్ఎ), ర్వాండా విద్యాశాఖ మంత్రి జోసెఫ్ సెంగిమన, యుఎఇ విద్యాశాఖ మంత్రి సారా ఆల్ అమిరి పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విద్యారంగం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో విద్యారంగంలో కీలకమైన ప్రాధాన్యతలు, సవాళ్లపై చర్చించడానికి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యాన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి చెందిన సిఇఓలు, విద్యారంగ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… తాజాగా అధ్యయనం ప్రకారం వెయ్యికంటే ఎక్కువమంది ఉద్యోగులు కలిగిన 42శాతం సంస్థలు తమ దైనందిన కార్యకలాపాలకు ఎఐని చురుగ్గా వినియోగిస్తున్నాయి. భారతదేశం (59%), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (58%) మరియు సింగపూర్ (53%), AI వినియోగంలో అగ్రగామిగా ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం యునెస్కో ఎఐ కాంపిటెన్సీ ఫ్రేమ్ వర్క్ లను ప్రవేశపెట్టింది. ఎఐతో సమర్థవంతంగా నిమగ్నమవ్వడానికి అవసరమైన నైపుణ్యాలు, నాలెడ్జి, విలువలతో అభ్యాసకులను సన్నద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ లో స్వయం పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్నాం. విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలు గల అభ్యాసకులకు స్వయం వంటి కార్యక్రమాల ద్వారా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నాం. ‘మేక్ ఎఐ ఫర్ ఇండియా’ వంటి కార్యక్రమాలు ఎఐలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని సృష్టించడం, కార్పొరేట్ ప్రతిభ అభివృద్ధి అవసరాలను తీర్చడంపై దృష్టి సారిస్తున్నాయి.
భారతదేశంలో ఐదు ఎడ్‌టెక్ యునికార్న్‌లు ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఎడ్ టెక్ సెక్టార్‌లో ఫిజిక్స్ వాల్లా, లీడ్, ఎరుడిటస్, అప్‌గ్రాడ్, వేదాంత వంటి సంస్థలు స్కిల్ డెవలప్‌మెంట్, K12, టెస్ట్ ప్రిపరేషన్ లకు ఆన్‌లైన్ సర్టిఫికేషన్ సేవలు అందిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎఐ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి, శిక్షణ పొందిన ఎఐ వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) స్థాపనను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం 2024-25 మధ్యంతర బడ్జెట్ లో రూ. 255 కోట్లు కేటాయించాం. ప్రపంచ పోటీతత్వాన్ని పెంచేందుకు STEM, AI విద్యపై దృష్టి సారించి, 2047 నాటికి 95% నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని తయారుచేయాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది. కుటుంబానికి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వంటి కార్యక్రమాలకు విద్యారంగ ఆవిష్కరణలు మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నాం.
IIT మద్రాస్ వంటి భాగస్వామ్యం ద్వారా AI ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ తన అభ్యాసకులను సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) & గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జిసిసి) పాలసీ (4.0)ని ఇటీవలే ప్రకటించాం.
విస్తృత ఉపాధి కల్పన , సౌకర్యవంతమైన వర్క్‌ఫోర్స్ మోడల్‌తో నిరంతర అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానంలో అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకోవడం, డీప్ టెక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సాంకేతికత పరిష్కారాలను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.