Suryaa.co.in

Andhra Pradesh

చర్చల్లో పాల్గొనకుండా సభను అవమానపర్చారు

– సభలో ప్రతిరోజూ అనైతికంగా వ్యవహరించారు
– ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి

ప్రెస్‌మీట్‌లో చీఫ్‌ విప్‌ ఇంకా ఏమన్నారంటే..:
వారికి భయం. ఎందుకంటే..:
టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియమ్‌ చుట్టుముట్టడం, దానిపై చేతులతో చర్చడం, చిడతలు వాయించడం, గట్టిగా విజిల్స్‌ వేస్తూ చాలా గందరగోళం సృష్టించారు. ఇది చాలా బాధాకరం. చివరకు వారు వేసిన ప్రశ్నలకు సమాధానం వినడానికి కూడా వారు ముందుకు రాలేదు. ఎందుకంటే వారికి భయం. ఈ ప్రభుత్వం వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుందని. తాము ప్రజల్లో చులకన అవుతామన్న భయంతో క్వశ్చన్‌ అవర్‌ కూడా జరగనీయకుండా, వారి ప్రశ్నలకు సమాధానం కూడా వినకుండా సభలో గందరగోళం సృష్టించే విధంగా ప్రవర్తించారు.

ఇది దురదృష్టకరం:
ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టకరం. గవర్నర్‌ ప్రసంగం తర్వాత సభలో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎంగారు, ఈ ప్రభుత్వం ఏమేం చేస్తోంది అన్నది వివరించారు. బీఏసీ సమావేశంలో టీడీపీ ప్రస్తావించిన అంశాలు చూశాం. మేము ప్రతిపాదించినవి కూడా చూసిన తర్వాత, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై స్వల్పవ్యవధి చర్చ పెట్టడం జరిగింది. ఆ అంశంలో ఆ శాఖ మంత్రిగారితో పాటు, సీఎంగారు కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.

చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, చక్కగా లేఅవుట్లు వేయడం, పక్కాగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం వంటి వాటన్నింటిపై చర్చ జరిగింది. కానీ ఆ చర్చలో కూడా వారు పాల్గొనలేదు. అంతే కాకుండా ఆ చర్చ వల్ల ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పి దుర్మార్గంగా వ్యవహరించారు.

పోలవరంపై అపోహలకు ప్రయత్నం:
ఆ తర్వాత ఎల్లో మీడియా సహకారంతో పోలవరం ప్రాజెక్టుపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని, దీని వల్ల అది బ్యారేజీగా మారుతుందంటూ, ఎల్లో మీడియాలో జోరుగా అసత్య ప్రచారం చేశారు. దానిపైనా మంత్రితో పాటు, సీఎంగారు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు ఎత్తు ఇంచ్‌ కూడా తగ్గించడం లేదని, 2023 ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు కింద నీరిస్తామని సీఎంగారు స్పష్టం చేశారు. కానీ ఆ చర్చలోనూ టీడీపీ పాల్గొనలేదు. నిజంగా వారికి సందేహాలు ఉంటే సభలో ప్రస్తావించి వివరణ కోరవచ్చు. కానీ ఆ పని చేయకుండా ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు.

నాటు సారా అంటూ రగడ:
అదే విధంగా నాటుసారా మరణాలు అంటూ, రోజూ సభలో గొడవ చేశారు. దానిపై ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేసింది. అయినా వారు రోజూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడంతో దానిపై స్వల్ప వ్యవధి చర్చకు అనుమతించడం జరిగింది. కానీ ఆ చర్చలోనూ టీడీపీ పాల్గొనలేదు. టీడీపీ సభ్యుల ఆరోపణలపైనా, రాష్ట్రంలో మద్యం పాలసీపైనా సీఎంగారు సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. అన్ని వివరాలు స్పష్టంగా చెప్పారు.

ఆ బ్రాండ్లు టీడీపీ చలువే:
నిజానికి రాష్ట్రంలో లిక్కర్‌ బ్రాండ్లకు సంబంధించిన వాస్తవాలు చాలా మందికి తెలియదు. ఇక్కడ ఉన్న వారికి కూడా తెలియదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందన్నది. అపద్ధర్మ ప్రభుత్వంగా ఉండి కూడా ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపునకు కేవలం వారం గడువు ఉన్నప్పటికీ లంచాలు తీసుకుని వారు అనుమతి ఇచ్చిన డిస్టిల్లరీల వ్యవహారం అంతా బయట పడింది.

వారు ఆరోపణలు చేసిన ప్రెసిడెంట్స్‌ మెడల్‌ అని, గవర్నర్‌ రిజర్వ్‌ అని, బూమ్‌ బూమ్‌ బీర్‌ అని.. వాటన్నింటికి ఎవరి హయాంలో అనుమతి ఇచ్చారన్నది గౌరవ సీఎంగారు తేదీలు, పూర్తి వివరాలతో సహా సభలో తెలియజేశారు. అంత గొడవ చేసిన వారు చర్చలో ఎందుకు పాల్గొనలేదంటే వారికి భయం, ఆందోళన. నిజాలన్నీ బయట పడతాయన్న భయంతో వారు చర్చలో పాల్గొనలేదు.

సభపైనా వారికి గౌరవం లేదు:
వికేంద్రీకరణపై చర్చ. చట్టసభకు ఉన్న అధికారం. కోర్టుల పరిధి. వంటి అన్ని అంశాలు చర్చించాలని దాన్ని స్వల్పకాలిక చర్చలో పెట్టాం. దానిపై మంత్రి బుగ్గనగారు కానీ, సీనియర్‌ సభ్యులు ధర్మాన ప్రసాదరావుగారు కానీ, ఎమ్మెల్యే పార్థసారథిగారు కానీ, ఆ తర్వాత సీఎంగారు కానీ చాలా సుదీర్ఘంగా వివరించారు. దీంతో ప్రజలకు చాలా స్పష్టంగా అర్ధమైంది. ఏ వ్యవస్థ కూడా పరిధి దాటి పోకూడదు అన్న విషయం తెలుసుకున్నారు. ఆ చర్చలో మాట్లాడే అవకాశం, హక్కు ఉన్నా వారు పాల్గొనలేదు. అంటేవారికి చట్టసభలపై గౌరవం కూడా లేదని అర్ధమవుతుంది.. అని చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE