– విదేశీ వర్సిటీల కోసం ‘ప్లగ్ అండ్ ప్లే’ క్యాంపస్
– రాష్ట్రంలో ఏర్పాటుకు ఆస్ట్రేలియా విద్యాసంస్థ ‘వీఐటీ’ ఆసక్తి
– ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేక భేటీ
తెలంగాణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ఆసక్తి చూపిస్తోంది.
ఈ మేరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మెల్ బోర్న్ లో బుధవారం వీఐటీ బోర్డు సభ్యుడు, మాజీ పార్లమెంటేరియన్, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాని సన్నిహితుడు అలన్ గ్రిఫిన్ ప్రత్యేకంగా కలిశారు.
అంతర్జాతీయ విద్యా, నైపుణ్య కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి అనుకూలతలు, ప్రగతిశీల విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తెలంగాణ యువత ప్రతిభ, సమర్థవంతమైన నాయకత్వం తదితర అంశాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు.
అనంతరం ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ ఏర్పాటు ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు. విదేశీ వర్సిటీలు, ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలకు ‘గ్లోబల్ హబ్’ గా ఈ క్యాంపస్ ను అభివృద్ధి చేస్తామని ‘విట్’ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పారు. సదరు సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేలా ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. స్థల పరిశీలన, తదుపరి చర్చల కోసం తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. సమావేశంలో వీఐటీ ప్రతినిధి అర్జున్ సూరపనేని, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.