Suryaa.co.in

Editorial

కాసుల మీద కాదు.. కీర్తి మీదనే దృష్టి

కొద్దికాలం క్రితం వరకూ ఆయన బీజేపీకి ఢిల్లీలో పెద్ద గొంతు. అధికార ప్రతినిధిగా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటంలో ఆయన స్పెషలిస్టు. మీడియా ప్రశ్నలకు ఓ పట్టాన దొరకరాయన. దీనికి మించి పూర్వాశ్రమంలో దేశంలో పేరు ప్రఖ్యాతలున్న సెఫాలజిస్టు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తన బృందాన్ని దించి ఫలితాన్ని ముందే పసిగట్టగల దిట్ట. ఎక్కడో పల్నాడులోని నర్సరావుపేట ప్రాంతం నుంచి ఎదిగిన ఆయన ప్రస్థానం ఢిల్లీకి చేరింది. ఆవిధంగా కావలసినంత డబ్బుతోపాటు, ‘కమలవనం’లో కీలకస్థానం సంపాదించిన రాజ్యసభ సభ్యుడు గుంటుపల్లి వెంకట నరసింహారావు.. ఇప్పుడు తనకు కాసుల కంటే కీర్తి మాత్రమే ప్రాధాన్యం అంటున్నారు. తన వల్ల వీలయినంత ఎక్కువమందికి మేలు జరిగేలా చూడటమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమంటున్న ఎంపీ జీవీఎల్‌తో ‘ఇంటర్వ్యూ’
( మార్తి సుబ్రహ్మణ్యం)

– మీ నేపథ్యం?
* పుట్టి పెరిగింది అంతా నర్సరావుపేట. ఐదుగురు అన్నదమ్ములు. ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఇద్దరు మగ పిల్లలు. పెద్దవాడు విశాల్ లండన్‌లో రీసెర్చి చేస్తున్నాడు. చిన్నవాడు వినీల్ యుఎస్‌లో బీటెక్ చేస్తున్నాడు. మా తండ్రి గుంటుపల్లి వెంకటేశ్వరరావు ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీలో తెలుగు హెడ్డాఫ్ ది డిపార్ట్‌మెంట్. అప్పట్లో ఆయన ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా పనిచేశారు. అమ్మ చౌడేశ్వరి. నాన్నది ప్రకాశం జిల్లా బల్లికురవ. సంతమాగులూరు సమితి అధ్యక్షుడు హటాత్తుగా చనిపోతే ఆయన స్థానంలో నాన్న రెండేళ్లు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అలా 30 సంవత్సరాల పాటు ఎన్నికలు లేకుండా నాన్న ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. నేను ఇంటర్ వరకూ నర్సరావుపేటలో చదివా. నాన్న అదే కాలేజీలో ఉద్యోగం చేస్తున్నా మార్కులు తక్కువ రావడం వల్ల, తెలుగు మీడియంలో చేరాల్సి వచ్చింది. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియంలో చేరా. తర్వాత బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్‌ఈ చేశా. గుజరాత్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఐఆర్‌ఎంఏ ఆనంద్)లో ఐఐఎం చేశా. అప్పట్లో అది టాప్ ప్లేస్‌లో ఉండేది. అక్కడే ఎంబీఏ పూర్తి చేశా. 2001-2002 దాకా ఫ్యామిలీ నర్సరావుపేటలోనే ఉండేది. ఎంబీఏలో మార్కెట్ రీసెర్చిపై దృష్టి పెట్టా. ఎన్‌డిడిబి, అమూల్‌కు డెప్యుటేషన్ మీద 3 ఏళ్లు మార్కెట్ రీసెర్చి చేశా. ఓ.ఆర్.జీ అనే సుప్రసిద్ధ సర్వే సంస్ధలో చేరా. ఆ సందర్భంలో బరోడా, ఆనంద్‌లో ఉండేవాడిని. ఆ తర్వాత 1989లో ఢిల్లీ వెళ్లా. 1993 నుంచి సెఫాలజిస్టుగా మారా. దానితో ఓ.ఆర్.జీని వదిలేశా. 1993 నుంచి ప్రభుచావ్లాతో కలసి జాతీయ పత్రికలకు వ్యాసాలు రాశా. ‘ఇండియన్ ఎలక్షన్స్ దినైన్టీస్’, ‘డెమోక్రసీ ఎట్ రిస్క్’ ‘కథాశతకం’పుస్తకాలు రాశా.

– సెఫాలిజిస్టుగా మీ ముద్ర ఏమిటి? ప్రారంభంలో మీ అంచనాలు ఫలించాయా?
* యస్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికల్లో సెఫాలజిస్టుగా నా అంచనాలు సక్సెస్ అయ్యాయి. అప్పట్లో సెఫాలజిస్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కోసం పనిచేశా. నేను ఇచ్చిన సర్వే రిపోర్టులు యాక్యురేట్‌గా రావడంతో నా పని విస్తరించింది. నాపై అందరికీ నమ్మకం పెరిగింది. ఈ విషయంలో ప్రణయ్‌రాయ్ తర్వాత నాకే అంతపేరు వచ్చింది. 1994 ఎన్నికలలో ‘ఫ్రంట్‌లైన్’, ‘హిందూ’పత్రికలకు సెఫాలజిస్టుగా చేశా. ఆ ఎన్నికల్లో నా జోస్యం ఫలించింది. ఎన్టీఆర్ సీఎం అవుతారని అప్పట్లోనే వెల్లడించా. 1996లో అశోక్‌జైన్‌తో నేరుగా కాంటాక్ట్ కుదరడంతో టైమ్స్ కోసం చేశా. అప్పుడు దాదాపు 25 ఆర్టికల్స్ రాశా. 1994లో టీడీపీ, తర్వాత 1998లో ‘నిర్ణయం-98’ ఈటీవీ కోసం పనిచేశా. జయప్రకాష్ నారాయణ దానికి మెయిన్ యాంకర్. దానిని చూసి వైఎస్ ఓసారి రామోజీరావుకు పెద్ద లేఖ రాశారు. కావాలని తమ పార్టీపై బురదచల్లుతున్నారన్నది ఆయన ఫిర్యాదు. కానీ ఆ ఎన్నికల్లో నా జోస్యమే నిజమయి, టీడీపీ గెలిచింది.

టీడీపీ నాకు క్లైయింట్ మాత్రమే

– 2004 ఎన్నికల్లో మీరు టీడీపీ కోసం సర్వే చేసినట్లున్నారు. ఆ సందర్భంలో మీరు బెంగళూరు నుంచి వచ్చి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి, టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పినట్లు గుర్తు. మరి మీ అంచనా ఎందుకు తప్పింది?
* ప్రెస్‌మీట్ పెట్టిన మాట నిజమే గానీ ఎక్కడో గుర్తులేదు. ఆ ఎన్నికల్లో నాతోపాటు చాలా సంస్థల అంచనాలు తప్పాయి. అభ్యర్ధుల ఎంపిక, ఉద్యోగుల వ్యతిరేకతను చాలామంది పసిగట్టలేకపోయాం. 2004లో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరితోపాటు చెప్పాం. నా కెరీర్‌లో అదొక్కటే ఎన్నికల సర్వేలో తప్పిన అంచనా. టీడీపీ అనేది అప్పుడు నాకొక క్లైంట్ మాత్రమే.
మీరు చెప్పినట్లు నేను.. వైఎస్ అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన మాట వాస్తవమే. ఆ పార్టీ అప్పుడు నాకు క్లైయింట్ కాబట్టి.
– మరి మిమ్మల్ని టీడీపీ నాయకులే బీజేపీకి పరిచయం చేశారన్న ప్రచారం ఉంది.
* అది అబద్ధం. నన్ను టీడీపీ బీజేపీకి పరిచయం చేయడం ఏమిటి హాస్యాస్పదం కాకపోతే?!
– మరి బీజేపీతో బంధం ఎలా కుదిరింది?
– బీజేపీకి కూడా నేను పోల్ సర్వే చేశాను. 1996-1999 వరకూ పోల్‌స్టర్‌గా ఉన్నా. వాజపేయి గారు ఉన్నప్పుడు 1996లో హర్యానాలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ జరిగితే, నన్ను కీ స్పీకర్ ఎక్స్‌పర్ట్‌గా పిలిచారు. అక్కడే నేను ప్రజల నాడి, పోల్ మేనేజ్‌మెంట్, మీడియా పబ్లిసిటీ, ప్రత్యర్థిపై రాజకీయదాడి వంటి అంశాలపై సుదీర్ఘంగా ప్రెజెంటేషన్ ఇచ్చా. అది చాలామంది సీనియర్లకు నచ్చింది. ఇప్పటికీ ఆ సభకు వచ్చిన సీనియర్లు నాకు ఆ ప్రసంగం గుర్తు చేసి అభినందిస్తుంటారు. అద్వానీ గారు న్యూఢిల్లీ నుంచి ఉప ఎన్నికలో చేసినప్పుడు ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా పనిచేశా. దానితో అద్వానీ గారితో సాన్నిహిత్యం పెరిగింది. ఇక 2007-12 ఎన్నికల్లో గుజరాత్, 2008-13 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీకి పనిచేశా. 2008లో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నా ప్రతిభ గుర్తించి, పట్టుపట్టి మరీ నన్ను ప్రభుత్వ సలహాదారు (మీడియా అడ్వయిజర్‌గా) నియమించారు. అలా ఆయన క్యాబినెట్‌లో చాలామంది మంత్రులు మారినా, నన్ను మాత్రం వరసగా పదేళ్లు అదే పోస్టులో కొనసాగించారు. 1996 నుంచే ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడు గారి ప్రముఖులతో సత్సంబంధాలు మొదలయ్యాయి.

– పల్నాడులో పుట్టి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లిన మీకు అప్పట్లో ఢిల్లీ తెలియదు. అక్కడి వాతావరణం కొత్త. పైగా ఒంటరి. ఎలా మేనేజ్ చేశారు?
* అబ్బో అది తలచుకుంటే నాకొక మరచిపోలేని అనుభూతి. అసలు నేను ఢిల్లీ బైచాయిస్ వచ్చా. కావాలని వచ్చా కాబట్టి కష్టమనిపించలేదు. బ్యాచిలర్‌గా కొంతమందితో అపార్ట్‌మెంట్ తీసుకున్నాం. 1989 నుంచి అలా ఢిల్లీ బేస్ అయిందన్నమాట. ఈ నాలుగేళ్ల నుంచే ఏపీలో విస్తృతంగా పనిచేస్తున్నా.

– మరి సహజంగా మీకు శత్రువులు కూడా పెరిగే ఉంటారు కదా? దానిని ఎలా ఎదుర్కొన్నారు?
* నిజమే. మనుషులంతా ఒకేలా ఉండరు కదా. నాపై కూడా ఫిర్యాదులు చేసేవారు. అయితే నా అదృష్టం కొద్దీ నాపైన ఎవరికయితే ఫిర్యాదు చేసేవారో, వాళ్లే నన్ను పిలిచి కంప్లైట్ చేసిన వారితో జాగ్రత్తగా ఉండమని చెప్పేవారు. అద్వానీగారు నన్ను పిలిచి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని సలహా చెప్పేవారు. నాపై వారికున్న నమ్మకం వల్ల ఎవరు తప్పుడు ప్రచారం చేసినా నమ్మేవారు కాదు. ‘‘నన్నెప్పుడూ తప్పుగా అర్ధం చేసుకోలేదు. తప్పుడు ఫిర్యాదులెవరైనా చేస్తే వారిని అనుమానించేవారు. అది నాయకత్వానికి నాపై ఉన్న నమ్మకం. ఆదరించడానికి ప్రధాన కారణం’’ తర్వాత పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఊహించిన దానికంటే ఎక్కువ పేరు వచ్చింది.

– మీకు ఎంపీ పదవి వస్తుందని ఊహించారా?
* లేదు. నేనెప్పుడూ నాకు ఎంపీ వస్తుందని అనుకోలేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు 2018లో రాజ్యసభ సీటు వచ్చింది. నాకు సీటు వచ్చిన రోజు-టీడీపీతో తెగతెంపులు అయినదీ ఒకేరోజు. సీఎంగా ఉన్న చంద్రబాబు లేఖ తర్వాత నేను, అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు కలసి ప్రెస్‌మీట్ పెట్టాం. మేము టీడీపీతో కలసి ఉండటం వల్ల రాజకీయంగా ఎక్కువ నష్టపోవలసి వచ్చింది. దానికి కారణాలు అనేకం. ఆ ఎన్నికల ముందు టీడీపీ మమ్మల్ని లక్ష్యం చేసుకోకుండా, కేంద్రం సహకారంతో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పినా ఫలితాలు కొంచెం తేడా ఉండేవి. మేము ఇద్దరం కలిసి పనిచేస్తే గ్యారంటీగా మళ్లీ అధికారంలోకి వచ్చేవాళ్లం. అది వేరే విషయం! ఎందుకంటే నేను ఎంపీ అయిన రోజు-టీడీపీతో విడిపోయిన రోజు కాబట్టి నాకు ఇంకా అప్పటి సన్నివేశాలు గుర్తున్నాయి.

– మీరేమో ఏపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎంపీ. కానీ టెక్నికల్‌గానేమో యుపి ఎంపీ. మరి మీరు ఏపీకి ఏం చేశారు?
* మీరడిన ప్రశ్న మంచిదే. నిజమే. నేను టెక్నికల్‌గా ఉత్తర ప్రదేశ్ ఎంపీని కాబట్టి నా ఎంపీల్యాడ్స్ నిధుల్లో సింహభాగం ఆ రాష్ట్రానికే ఖర్చు పెట్టక తప్పదు. మిగిలిన ఆ భాగంలోనే ప్రకాశం జిల్లా బల్లికురవలో స్కూలు, గుంటూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అయినా నా దృష్టికి వచ్చిన సమస్యలను గానీ, ఏదైనా పెద్ద ప్రాజెక్టుల విషయంలో గానీ నేనే చొరవ తీసుకుంటున్నా. వారణాసిలో సంసద్ గ్రామ్ ఆదర్శ యోజన కింద 5 గ్రామాలు దత్తత తీసుకున్నా. మీకు గుర్తుందో లేదో.. కరోనా సమయంలో వారణాసిలో చిక్కుకున్న తెలుగు భక్తుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుని, వారిని స్వస్థలాలకు పంపించడానికి చాలా ఎక్సర్‌సైజ్ చేయాల్సివచ్చింది. నిజంగా అందులో చాలా ఆనందం కనిపించింది. నా తెలుగు వారికి సేవ చేసే అవకాశం ఈ రూపంలో వచ్చిందనుకున్నా. నేను యుపి ఎంపీగా లేకపోతే ఆ అవకాశం వచ్చేది కాదేమో. లేపాక్షి వెళ్లినప్పుడు నేషనల్ హైవే రోడ్డు విస్తరణ నంది పక్కనుంచే వెళ్లాల్సి ఉంది. స్థానికులు దానిని అడ్డుకోవాలని నన్ను కోరారు. నేను కేంద్రంతో మాట్లాడి, నందికి ఇబ్బంది లేకుండా అలైన్‌మెంట్ మార్పించా. అక్కడి ప్రజలు ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తుంటారు. విశాఖలో ఐఐపిఇ అంశంలో కూడా కలెక్టర్‌తో మట్లాడటంతో సమస్క కొలిక్కి వచ్చింది. కేంద్రం ఏదీ నేరుగా చేయదు. అడిగితేనే చేస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం డిపీఆర్ ఇవ్వాలి. భూమి, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏమీ చేయకుండానే కేంద్రం ఏమీ చేయలేదనటం పెద్ద ఫ్యాషనయిపోయింది. మళ్లీ కేంద్రం వివక్ష అన్న పేరుతో రాజకీయ ఉద్యమాలొకటి. తెలంగాణ- ఆంధ్రలో రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా, భూ సేకరణ చేయకపోవడం వల్ల అనేక కేంద్ర ప్రాజెక్టులు, రైల్వే లైన్లు ఆగిపోయిన విషయం ఎంతమందికి తెలుసు? అందుకే నేను వెళ్లిన ప్రతిచోటా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తుంటా.

నేను మహేష్‌కు పెద్ద ఫ్యాన్‌ను.. కానీ ఇప్పటికీ కలవలేదు!
తీరిక సమయాల్లో సినిమాలు బాగా చూస్తా. మీకో విషయం తెలుసా? నేను చదువుకునే రోజుల నుంచి ఇప్పటివరకూ హీరో కృష్ణ వీరాభిమానిని. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూసినా.. కృష్ణ అంటే ప్రాణం. ఆయన సినిమాలన్నీ మళ్లీ మళ్లీ చూసేవాడిని. ఇప్పుడు మహేష్ ఫ్యాన్‌ను. అతని యాక్టింగ్ బాగుంటుంది. ‘అతడు’ సినిమా చాలాసార్లు చూశా. కానీ ఇప్పటిదాకా మహేష్‌ను కలిసే అవకాశం రాలేదు. అవకాశం వస్తే కృష్ణ-మహేష్‌ను కలవాలని ఉంది. చూడాలి ఎప్పుడు కుదురుతుందో?!

– మిమ్మల్ని ఇంట్లోవాళ్లు, మీ బంధువులు బుజ్జి అని పిలుస్తారట కదా?
* అవును. అమ్మ, తమ్ముళ్లు, బంధువులతోపాటు, నాతో చదువుకున్న అత్యంత ఆప్తమిత్రులు అలా పిలుస్తారు.– అవునూ.. మీరు మిమిక్రీ, పాటలు కూడా పాడతారని తెలిసింది. నిజమేనా?
* నిజమే. కాలేజీలో మిమిక్రీ, పాటలు పాడేవాడిని. ఇప్పటికీ బంధువులతో కలిసినప్పుడు వాళ్లు అడిగితే సరదాగా మిమిక్రీ చేస్తుంటా. జంధ్యాల కామెడీ నాటకాల్లో కూడా పనిచేశా. నర్సరావుపేటలో రంగస్థలి అని ఒక సాంస్కృతిక సంస్థ ఉండేది. అందులో బాగా యాక్టివ్‌గా ఉండేవాడిని.
– మీ లక్ష్యం ఏమిటి?
* నేను భగవంతుడి దయ, నా కష్టంతో, వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నా. దానితో కావలసినంత డబ్బు సమకూరింది. పార్టీ ఒకసారి ఎంపీగా పనిచేసే అవకాశం ఇచ్చింది. టుబాకోబోర్డు మెంబర్, స్పైస్‌బోర్డు టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ అవకాశం లభించింది. ఇవన్నీ నాకు పార్టీ ఇచ్చినవే కాబట్టి, బీజేపీకి ఎప్పటికీ రుణపడే ఉంటా. ఇక నా లక్ష్యమంతా వీలైనంత ఎక్కువమందికి సాయం చేయడమే. జీవీఎల్ మాకు సాయం చేశారనిపించుకోవడమే నా ముందున్న లక్ష్యం. దానికోసమే పనిచేస్తున్నా.
– నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారంటున్నారు.. నిజమేనా?
* ఇది రూమర్. ఈ మధ్య పల్నాడు ప్రాంత అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టినందున అలా అనుకుని ఉండవచ్చు. మొన్నామధ్య రెండుమూడు సార్లు ప్రకాశం జిల్లా వెళ్లాల్సివచ్చింది. అక్కడ వాళ్లు ఇలాగే ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం ప్రారంభించారు. ఒకటిమాత్రం నిజం. పల్నాడు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా కర్తవ్యం. ఇక పోటీ అనేది పూర్తిగా పార్టీ నిర్ణయం.

LEAVE A RESPONSE