– ‘సర్వే’జనా ఎవరికి సుఖినోభవంతు?
– సర్వేలు ఎవరి కోసం?
– సర్వేలకు సొమ్ములెక్కడివి?
– ఇంతకూ తెలంగాణలో పల్సు పట్టే పార్టీ ఏది?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆలూ లేదూ చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది సర్వే సంస్థల హడావిడి. ఇంకా ఎన్నికలకు లెక్క ప్రకారం రెండేళ్ల సమయం ఉంది. ముందస్తు సవాళ్లు ముగిసిన తర్వాత.. తాము
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, తెరాస ఉత్తరాధికారి తారకరాముడు తాజా వార్త చెప్పేశారు. అంటే తెలంగాణలో యధా ప్రకారమే ఎన్నికల గంట మోగుతుందని చెప్పేశారన్నమాట. ఆ ప్రకారంగా.. ఇక ముందస్తు ముచ్చట్లకు తెరపడినట్లే.
అయితే.. ఎప్పుడో రెండేళ్లకు జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దిక్కుమాలిన పంచాయితీ ఇంకా కొనసాగుతుండటమే ఆశ్చర్యం. తాజాగా ఆరా, అంతకు పదిరోజుల ముందు ఆత్మసాక్షి సంస్థలు నిర్వహించిన సర్వేల్లో విభిన్న ఫలితాలు వినిపించాయి. ఆత్మసాక్షి సర్వేలో తెరాస, కాంగ్రెస్, భాజపా వరసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా ఆరా సర్వే సంస్థ మాత్రం మొదటి స్థానంలో తెరాస, రెండో స్థానంలో భాజపా, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నట్లు వెల్లడించింది. రెండు సంస్థలూ వెల్లడించిన వివరాలు విభిన్నం, విచిత్రమైనవే.
ఆత్మసాక్షి సర్వే సంస్థ.. తెరాసకు 46, కాంగ్రెస్‌కు 33, భాజపాకు 10, మజ్లిస్‌కు 7 స్థానాలు రావచ్చని ఆత్మసాక్షి వెల్లడించింది. మిగిలిన 23 స్థానాల్లో తీవ్రపోటీ ఉన్నప్పటికీ.. తెరాస 12 నుంచి 13, కాంగ్రెస్ 7 నుంచి 9, బీజేపీ 4 నుంచి 5 స్థానాలు పొందే అవకాశాలున్నట్లు చెప్పింది. ఆ ప్రకారంగా తెరాసకు 56-58, కాంగ్రెస్‌కు 40, బీజేపీ 15 స్థానాలు వరకూ సాధించవచ్చని వివరించింది. ఈ వివరాలను ఆత్మసాక్షి సర్వే పత్రికాప్రకటన రూపంలో విడుదల చేసిందే తప్ప, ఆ సంస్ధ నుంచి ఎవరూ మీడియా ముందుకొచ్చి వెల్లడించలేదు.
కానీ ఆరా సంస్థ ఈ వ్యవహారంలో భిన్నంగా స్పందించింది. తమ సంస్థ 9 నెలల్లో చేసిన 40 వేల శాంపిల్ వివరాలను సర్వే సంస్థ అధినేత మస్తాన్, ప్రెస్‌మీట్ పెట్టి మరీ వెల్లడించడం చర్చనీయాంశమయింది.ఒక విధంగా ఆయన తెలంగాణ ప్రజలను ఆకర్షించటంలో విజయం సాధించారు. కొద్దిరోజులయినప్పటికీ, పీకేతో సమానమైన ఇమేజ్ తాత్కాలికంగానయినా పొందారు. అయితే.. సర్వే ఫలితాల తీరులో పక్షపాతం, దాని ప్రాతిపదిక అంశాలు వివరించడంలో ఆరా సంస్థ ఎవరినీ సంతృప్తి పరచకపోగా, ‘పువ్వుపార్టీ’ పక్షపాతిగా మిగిలిపోయింది.
పైగా బయట వారికి తెలియని ఆరా మస్తాన్ ఏబీవీపీ నేపథ్యం, బీజేపీ బంధం, మోదీతో సెల్ఫీ సంబరం బయటపడేందుకు కారణమయింది. భాజపా-తెరాస తెరచాటు బంధం కొనసాగుతోందంటూ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు నిజం చేసేలా సర్వే ఫలితాలు సాగిన వాదన వినిపిస్తోంది. ‘పువ్వు పార్టీ’ని సర్వేజాకీలతో పైకి లేపే ప్రయత్నంలో భాగమేనన్న అభిప్రాయం-అనుమానం, మీడియాను ఫాలో అయ్యే వర్గంలో రేపింది.
అలాగని ఆరా సంస్థ సర్వేల విశ్వసనీయతకు ప్రశ్నించలేం. ప్రస్తుతం ఉన్న కొద్ది సర్వే సంస్థల్లో ముందస్తుగా చెప్పిన ఫలితాల్లో, ఆరా చేసిన సర్వేలు చాలావరకూ నిజమయ్యాయి. తెరాస అధికారంలోకి వస్తుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీనే గెలుస్తుందన్న ఆరా జోస్యం నిజమయింది. అలాగే గత జీహీచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆరా చెప్పినదానికంటే, బీజేపీకి ఎక్కువ స్థానాలే వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో చేసిన సర్వేలు కూడా నిజమయినప్పటికీ.. ఆరా సంస్థ తాజగా తెలంగాణలో చేసిన సర్వే పూర్తిగా నిజమని అప్పుడే ఒక అంచనాకు వస్తే అది తొందరపాటే అవుతుంది. దానికి కారణం.. తాజాగా తెరపైకి వచ్చిన ఆయన బీజేపీ బంధమూ కావచ్చు.
ఇంతకూ ఆరా సంస్థ అధినేత మస్తాన్ ఏం చెప్పారంటే… తెలంగాణ వ్యాప్తంగా తెరాసకు 38.88 శాతం, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. తెరాసకు 87, కాంగ్రెస్‌కు 53, బీజేపీకి 29 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులున్నారట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు, 2019 పార్లమెంటు ఎన్నికల్లో 29.78 శాతం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి మాత్రం 4.72 శాతం ఓట్లు కోల్పోతుంది. అదే తెరాస 8 శాతం ఓట్లు కోల్పోనుంది.
ఇక 2018 ఎన్నికల్లో కేవలం 6.98 శాతం సాధించిన బీజేపీ.. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 19.65 శాతం సాధించి, రేపటి ఎన్నికలకు 23.5 శాతం ఎక్కువ ఓట్లు సాధించబోతోంది. అంటే 8 ఏళ్లనుంచీ పాలిస్తున్న టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పడిపోయి.. బీజేపీనే ఏకంగా 23.5 శాతం అదనపు ఓట్లు సాధించి మొనగాడవుతుందన్నమాట. ఆరా సంస్థ నేరుగా చెప్పడానికి మొహమాటపడినప్పటికీ, అదే మస్తాను కవి హృదయమన్నది అర్ధమవుతూనే ఉంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 40.43 శాతం, బీజేపీ 35.32 శాతం, కాంగెస్ 16.33 శాతం ఓట్లు సాధిస్తాయని చెప్పారు. దీనిలో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే ఈ రెండు పాత ఉమ్మడి జిల్లాల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలంతా, టీడీపీ నుంచి వెళ్లిన బలమైన క్యాడర్ ఉన్న నేతలే. మిగిలిన జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు చెందిన తెరాస ఎమ్మెల్యేలు జనంలో మమేకమవుతున్న వారే.
పైగా కాంగ్రెస్, బీజేపీలో గత ఐదేళ్ల క్రితం నాటి బలమైన నేతలెవరూ లేరు. ఆ విషయంలో కాంగ్రెస్‌తో పోలిస్తే, బీజేపీకి నియోజకవర్గ స్థాయి నేతలు ఎక్కువే ఉన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి చేరిన నేతల వల్ల, బీజేపీ నగరంలో కొంత బలంగానే ఉందని చెప్పాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఆ పార్టీకి ఇప్పుడు మర్రి శశిధర్‌రెడ్డి, వి.హన్మంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, కోదండరెడ్డి, సర్వే సత్యనారాయణ వంటి పాతతరం నేతలే కనిపిస్తారు. వీరంతా ప్రజలను విడిచి చాలా ఏళ్లయిపోయింది. అలాగే వీరిని ప్రజలు మర్చిపోయి కూడా చాలాకాలమే అయింది.
మూడేళ్ల కాలంలో కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్న నేతలంతా ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. మరికొందరు వృద్ధాప్యం వల్ల తెరమరుగయ్యారు. ఫలితంగా ఇప్పుడు ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలే దిక్కవుతున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజధాని నగరంలో కాంగ్రెస్‌లో డివిజన్ స్థాయి నేతలే మిగిలారు.
రంగారెడ్డి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ బలంగానే ఉంది. అక్కడ టీఆర్‌ఎస్‌తో పోటీ పడేది కాంగ్రెస్ తప్ప, బీజేపీ కాదు. రెడ్డి, బీసీ నేతలతో కాంగ్రెస్ బలంగా ఉంది. రంగారెడ్డిలో బీజేపీకి లీడర్లు తప్ప క్యాడర్ తక్కువ. అది కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే తప్ప, స్వతహాగా బీజేపీలో కొనసాగుతున్న నేతల పలుకుబడి తక్కువ. అలాంటిది బీజేపీకి 35.32 శాతం ఎలా వచ్చిందన్నది ప్రశ్న.
ఇక హైదరాబాద్‌లో కూడా ముషీరాబాద్‌లో లక్ష్మణ్, ఖైరతాబాద్‌లో చింతల రామచంద్రారెడ్డి, అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి, మల్కాజిగిరిలో రాంచందర్‌రావు తర్వాత బీజేపీలో ఆ స్ధాయి నేతలెవరన్నది భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. మిగిలిన నియోజవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలే ఎక్కువగా కనిపిస్తారు. వీరంతా మీడియాకు, ఫ్లెక్సీలకు పరిమితమయ్యే బాపతు కొందరయితే, అగ్రనేతల చుట్టూ తిరిగి నేతలుగా చెలామణి అవుతున్న బాపతు మరికొందరు. గతంలో ఇలాంటి సంప్రదాయం టీడీపీలో కనిపించేది.
ఇప్పుడు ఆ జబ్బు బీజేపీకీ పాకింది. మంత్రి శ్రీనివాస్, బండి సంజయ్ చుట్టూ తిరుగుతున్న నేతలంతా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్నారు. వీరికి స్థానిక నియోజకవర్గాల్లో బలం ఉండదు. ఒకప్పుడు నిత్యం జనంలో ఉండే బీజేపీ, గత పదేళ్ల నుంచి జనాలకు దూరమయింది. ఆర్గనైజేషన్ సిద్ధాంత స్వరూపాలు మర్చిపోయి- మారిపోయి, ఫక్తు రాజకీయ పార్టీగా మారిందన్నది ఆ పార్టీ సీనియర్ల వ్యాఖ్య.
మొత్తంగా.. జీహెచ్‌ఎంసీ పరిథిలో కాంగ్రెస్‌కు సరైన నేతలు అభ్యర్ధులుగా లేకపోవడం, బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లోనే బలం ఉండటం, టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనంతో మమేకమవడం వంటి కారణాలే.. రాజధాని నగరంలో టీఆర్‌ఎస్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కారణంగా కనిపిస్తోంది. ఇంకా సూటిగా చెప్పాలంటే.. రాజధానిలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కనిపించే పరిస్థితి లేదు. అదే దాని బలం.
ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో పోటీ టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్‌లో ఎంపీగా ఉన్న సంజయ్, నిజామామాద్ ఎంపీ అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లలో బీజేపీ నుంచి గట్టి అభ్యర్ధులను వేళ్లపైనే లెక్కించుకోవచ్చు. ఇటీవలి ఈటల విజయం ఆయన వ్యక్తిగత ఖాతాలోనే తప్ప, పార్టీకి వేయడం సమంజసం కాదు. అక్కడ బీజేపీని సంప్రదాయంగా వ్యతిరేకంగా ముస్లింలు, దళిత క్రైస్తవులు కూడా ఈటలకే ఓట్లేయడాన్ని విస్మరించకూడదు.
బహశా అక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నందున ఆ పార్టీ బలంగా ఉందని అంచనా వేసిన ట్లు కనిపిస్తోంది. అదే నిజమైతే హైదరాబాద్-సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు ఎంపీలు లేరు. మరి ఆ ప్రకారమైతే టీఆర్‌ఎస్‌కు హైదరాబాద్ బలం ఉండకూడదు కదా? పాత రంగారెడ్డిలో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఉన్నందున, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కూడా బలంగా ఉండాలి కదా అన్నది బుద్ధిజీవుల సందేహం.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉనికిలేని బీజేపీ 20 శాతం, మెదక్, మహబూబ్‌నగర్ 30.37 శాతం ఓట్లు ఎలా సాధించిందన్నది మరో ఆశ్చర్యం. బహుశా మెదక్ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విజయం, మహబూబ్‌నగర్ నుంచి అగ్రనేత డికె అరుణ ఉన్నందున, వారిని చూసి బీజేపీ బలాన్ని అంచనా వేసి ఉంటారా అన్నది మరికొందరి సందేహం.
అయితే.. ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల సానుకూలత ఉన్నప్పటికీ, కేసీఆర్ కుటుంబపాలన సాగిస్తున్నారన్న వ్యాఖ్య మాత్రం నిజం. ఉద్యోగులు, విధ్యాధికులు, కార్మికులు, యువకుల్లో కూడా తెరాస పాలనపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలపై సంతృప్తి ఉన్నప్పటికీ, దళితబంధు పథకం వల్ల తెరాసకు నష్టమే తప్ప లాభం కనిపించడం లేదు.
దళితుల సంఖ్య ఒక్కో నియోజకవర్గానికి ఎంత తక్కువ వేసుకున్నా 25 నుంచి 35 వేల వరకూ ఉంటుంది. రిజర్వుడు నియోజకవర్గాల్లో అయితే ఇంకా ఎక్కువగానే ఉంటారు. అందులో దళితబంధు లబ్ధిదారులను నియోజకవర్గానికి 100 మదిని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. మరి మిగిలిన వేలమంది ఆ పార్టీకి సహజంగా వ్యతిరేకంగా మారడం సహజమే కదా? ప్రధానంగా తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బతకడానికి వచ్చిన ఆటో, క్యాబ్ డ్రైవర్లను పలకరిస్తే.. తెరాస పాలన, వచ్చే ఎన్నికల్లో వారి నిర్ణయమేమిటన్నది స్పష్టమవుతుంది.
కాగా హైదరాబాద్‌లోని ఐదారు నియోజకవర్గాలు, కరీంనగర్‌లో మూడు, నిజామాబాద్‌లో మూడు, రంగారెడ్డిలో మూడు, వరంగల్‌లో మూడు, మెదక్‌లో రెండు, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు, మూడేసి నియోజకవర్గాల్లో తప్ప మరే జిల్లాల్లోనూ బీజేపీ పోటీ ఇచే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే కేవలం 19 నియోజకవర్గాల్లోనే బీజేపీ తీవ్రమైన పోటీ ఇచ్చే వాతావరణం ఉంది. మొత్తంగా ఇప్పటివరకూ ఉన్న పరిస్థితిని బట్టి పోటీ టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తోంది. మరి ప్రత్యకించి భావోద్వేగాలపై ఆధారపడి రాజకీయాలు చేసే బీజేపీకి అమాంతం అంత శాతం ఓట్లు ఎలా పెరిగాయన్నదే ప్రశ్న.
ఆత్మసాక్షి చేసిన ఓ సర్వేలో నిజాల గురించి ముచ్చటించుకుందాం. ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో గెలుస్తుందని సర్వే చేసిన ఆ సంస్థ… సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందన్న విచిత్ర ఫలితం వెలువరించింది. ఇది వాస్తవాలకు కొన్ని కిలొమీటర్ల దూరంలో కనిపిస్తుంది. నిజానికి గత మూడు ఎన్నికల నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీకి కాగడాలు వేసినా నేతలు దొరకరు. ఉన్న సీనియర్లంతా బీజేపీ, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి చాలా ఏళ్లయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్-బీజేపీకి ఎమ్మెల్యేకి పోటీ చేసే స్థాయి నేతలెవరూ భూతద్దం వేసి వెతికినా కనిపించరు. ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్.. నగరంలో అన్ని సీట్లూ గెలిచిన ఏకైక నియోజకవర్గం కూడా అదే. అమిత్‌షా ప్రచారం చేసినా బీజేపీ అక్కడ గెలవలేకపోయింది.పైగా పద్మారావుతో ఢీకొట్టే స్థాయి నేతలు బీజేపీలో లేరు. ఉన్న నియోజకవర్గ స్థాయి నేతల మధ్య, కుమ్ములాటలే ఎక్కువ.
స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రజలు ప్రభుత్వాఫీసులకు వెళ్లే అవసరం లేకుండా, తానే అర్జీలు తీసుకుని, పథకాలను లబ్థిదారుల ఇళ్లకు వెళ్లి మరీ అందిస్తున్నారు. అంటే కార్పొరేటర్ పనికూడా ఆయనే చేస్తున్నారన్నమాట. సీఎంఆర్‌ఎఫ్, షాదీముబారక్, కల్యాణలక్ష్మీ పధకాల్లో సికింద్రాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఈ పరిస్థితిలో అసలు అభ్యర్ధులే దొరకని కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందన్న ఆత్మసాక్షి సర్వే తీరు పరిశీలిస్తే.. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే అవగాహనతో సర్వే చేసినట్లు మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. నిజంగా ఆత్మసాక్షి ప్రకారం..సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిస్తే, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలవడం ఖాయం.
సరే.. ఈ గొడవ అటుంచి.. అసలు ఈ సర్వేలన్నీ ఎవరి కోసం? ఎందుకోసం నిర్వహిస్తున్నారన్నది ప్రధాన ప్రశ్న. సహజంగా రాజకీయ పార్టీలు తమ భవిష్యత్తుకోసమో, ప్రజల నాడి తెలుసుకునేందుకో భారీ నిధులు వెచ్చించి సర్వే కంపెనీలతో సర్వే చేయిస్తుంటాయి. అలాగే నిత్యావసర వస్తువులు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు కూడా సర్వేలు చేయిస్తుంటాయి. వాటికి కోట్ల రూపాయల్లోనే ఖర్చవుతుంది.
మరి కొద్దిరోజుల క్రితం సర్వే చేసిన ఆత్మసాక్షి గానీ, ఇటీవల సర్వే నిర్వహించిన ఆరా సంస్థ గానీ ఎవరి కోసం సర్వేలు నిర్వహించాయన్న ప్రశ్నలకు ఇప్పటివరకూ జవాబు లేదు. సాధారణంగా చిన్న కంపెనీలు నిర్వహించే సర్వేకు ఒక్కో నియోజకవర్గానికి 3 లక్ష8లు తక్కువకాకుండా తీసుకుంటాయి. అదే శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే నిర్వహించే పెద్ద కంపెనీలు 5 నుంచి 7 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా వసూలు చేస్తాయి.
ఇండియాతోపాటు, ఐరోపా దేశాల్లో సర్వేలు నిర్వహించిన ప్రముఖ సెఫాలజిస్టు రవికుమార్ మాటల్లో చెప్పాలంటే సర్వేలన్నీ ఖరీదైనవి. ‘ప్రస్తుత పరిస్థితిలో ఒక్కో శాంపిల్ నిర్వహణకు కనీసం 500 రూపాయల ఖర్చవుతుంది. కంపెనీలు వేల రూపాయలిచ్చి ఉద్యోగులను నియమిస్తుంటాయి. ఇండియాలో 30-35 శాతం ఫ్లోటింగ్ ఓటర్లు ఉంటారు. వారిపై అనేక ప్రభావాలు కనిపిస్తుంటాయి. వారే ఎన్నికల్లో విజయాన్ని నిర్దేశిస్తుంటారు. ఏ పార్టీకి ఆ పార్టీ పర్మినెంట్ ఓటర్ల శాతం ఉంటుంది. ఆ 30-35 శాతం ఓటర్ల పల్సు తెలుసుకోవడంలోనే సర్వే సంస్థల నైపుణ్యం ఉంటుంద’ని రవికుమార్ వివరించారు.
ఆ ప్రకారం.. తాజాగా సర్వే చేసిన ఆరా సంస్థకు 40 వేల శాంపిల్స్ తీసినందున, 20 కోట్లు ఖర్చయి తీరాలి. మరి ఆ డబ్బు ఎవరిచ్చారు? సర్వే సంస్థలు చేసేది వ్యాపారమే తప్ప, సామాజికసేవ కాదు. లోకకల్యాణం కోసం అంతకంటే కాదు. మరి అంత డబ్బు వెచ్చించడానికి ఆ సంస్థకు ఉన్న ఆసక్తి ఏమిటి? మామూలుగా అయితే మొదటి స్థానం ఇచ్చినందున టీఆర్‌ఎస్‌గానీ, రెండోస్థానం తీసుకున్న బీజేపీ గానీ సర్వే సంస్థకు డబ్బులివ్వాలి. ఆ లెక్కన ఆ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా డబ్బులిచ్చి సర్వే చేయించుకోకపోతే.. ఆరా సంస్థ అప్పు చేసి గానీ, ఆస్తులు తాకట్టు పెట్టి సర్వే చేయించి తీరాలి. అంతకుముందు సర్వే చేసిన ఆత్మసాక్షి సంస్థ కూడా ఏ పార్టీ కోసం సర్వే చేయకపోతే, అది కూడా తన ఆస్తులు తాకట్టు పెట్టి, లోకకల్యాణం కోసం సర్వే నిర్వహించి తీరాలి. మరి ఈ సర్వే సంస్థలు కేవలం లోకకల్యాణం కోసమే సర్వేలు నిర్వహిస్తున్నారని నమ్ముదామా?