-
పార్టీ సిలబస్ మారడటంతో నేతల అయోమయం
-
ఆ ఇద్దరి అపాయింట్‌మెంట్లు దక్కని వైచిత్రి
-
మళ్లీ బాబు పొలిటికల్ గవర్నరెన్స్ మానేశారా?
-
ప్రతిపక్షంలో ఉంటేనే రాజకీయం చేస్తారా?
-
క్యాడర్ మనోభావాలు తెలుస్తున్నాయా? లేవా?
-
తెలిసినా తమ నిర్ణయాలనే అమలు చేస్తున్నారా?
-
జగన్ చెప్పులో కాలెందుకంటున్న తమ్ముళ్లు
-
సోషల్‌మీడియా సైనికుల వేదన అరణ్యరోదనేనా?
-
జీవీ రెడ్డి నుంచి తాజా చేబ్రోలు కిరణ్ అనుభవాలు చెబుతున్నదేంటి?
-
మంచివారిగా ముద్రవేయించుకునే తాపత్రయమా?
-
కిరణ్ వ్యవహారంలో కార్యకర్తలు ఓడి నాయకత్వం గెలిచిందా?
-
నియోజకవర్గాల్లో గీత దాటుతున్న ఎమ్మెల్యేలు
-
కార్యకర్తలను పట్టించుకోని మంత్రులు
-
ఇక జెండా మోసిన కార్యకర్తలకు దిక్కెవరు?
-
ఇలాగైతే రేపు పార్టీ జెండా మోసేదెవరు?
-
కరుడుగట్టిన కార్యకర్తలు కాడికిందపారేస్తున్నారా?
-
‘మహానాడు’ ముందు టీడీపీ ప్రస్థానం మారుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘నిన్నటితో టిడిపి కార్యకర్త అనేవాడు చచ్చిపోయాడు. కాదు కాదు చంపేశారు’’
‘‘ ఇక నుంచి రాజకీయ పోస్టింగులకు సెలవు’’
‘‘అసలు జగన్‌ను చూస్తే మీకు భయమా? పోలీసులకు భయమా? బాబు గారూ.. పార్టీ ఆఫీసుపై దాడికి జోగి రమేష్ మళ్లీ దాడికి రెడీగా ఉన్నాడు. పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వెయ్యిమందిని తయారుచేసుకోండి. వాళ్లకు అన్నీ మీరే సమకూర్చాలి. పార్టీ క్యాడర్ మనకెందుకనుకుంటున్నారు. అంతా నిరాశ నిస్పృహ. ఇందుకా పార్టీని గెలిపించింది?’’
‘‘ కిరణ్ అరెస్టు సిగ్గుచేటు. పైవాళ్లకి ఇవి వినపడదు. వాళ్ల పార్టీ. వాళ్లిష్టం’’
‘‘ పేరు కోసం కార్యకర్తలను బలిచేస్తారా? ఈ పని జగన్ ప్రాణం పోయినా చేయడు కదా? కిరణ్‌కు- భారతిరెడ్డికి ఏం గొడవ ఉంటుంది? భువనేశ్వరిపై భారతి తన మనుషులతో వికృత పోస్టింగులు పెట్టించింది కాబట్టే కిరణ్ రియాక్టయ్యాడు. హిందీనటిని ఐపిఎస్‌లు నెలరోజుల చిత్రహింసలకు గురిచేస్తే అరెస్టు చేయరు. రఘురామకృష్ణరాజును వేధించిన సునీల్‌ను వదిలేస్తారు. రోజా, కొడాలి, సజ్జల-కొడుకు, చెవిరెడ్డి-అతడి కొడుకు, చీదిరి అప్పలరాజు, ద్వారంపూడి, పెద్దిరెడ్డి-అతడి కొడుకు, తమ్మినేని, శ్రీరెడ్డిని వదిలేసి.. హార్డ్‌కోర్ కార్యకర్త కిరణ్‌ను అరెస్టు చేస్తారా? ఇందుకేనా మీకు డబ్బులిచ్చి గెలిపించింది?’’
‘‘ అసలు రెడ్‌బుక్ పేరుతో రెచ్చగొట్టింది మీరు. వాళ్లకు కనీవిని ఎరగనివిధంగా గుణపాఠం చెబుతామని రెచ్చగొట్టింది మీరు. లేకపోతే వైసీపీ వాళ్లపై ద్వేషం మాకెందుకు ఉంటుంది? తిట్టిన వాళ్లు-తిట్టించుకున్నవాళ్లంతా బాగున్నారు. పార్టీ కోసం ఆవేశపడిన కార్యకర్త జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మీరు మంచివాళ్లు. మేం చెడ్డవాళ్లమయ్యామా? అప్పుడు మీరు అలా రెచ్చగొట్టినందుకే కదా మేం జైలుపాలయ్యాం. అసలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తోందా? లేక మేం మా పద్ధతి మార్చుకున్నాం కాబట్టి, ఎవరి మాట వినదలచుకోలేదన్న నిర్ణయానికి వచ్చారా? అందుకే జగన్ చెప్పులో కాలుపెట్టి నడుస్తున్నారా?’’
‘‘10 నెలల క్రితం వరకూ సోషల్‌మీడియాలో స్వచ్ఛందంగా రిస్కు తీసుకుని మరీ జగన్‌పై చెలరేగిన సైనికులు, ఇప్పుడు ఎందుకు అస్త్రసన్యాసం చేశారో మీకు అర్ధమవుతోందా? దాదాపు 40 శాతం కరుడుగట్టిన పార్టీ వాదులు కాడికిందపడేసి, పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారో గమనించారా?’’
‘‘ జగన్ బినామీ కంపెనీ షిర్డిసాయి కంపెనీని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? అంటే మీరు లాలూచీ పడుతున్నారని కార్యకర్తలకు అర్ధం కాదా? షిర్డిసాయి తప్ప వేరే కంపెనీలే లేవా? ఆ కంపెనీ జగన్ బినామీ అని మీరే కదా ఆరోపించారు. మరిప్పుడు దానినే కొనసాగిస్తున్నారంటే ఏమిటి అర్ధం. ఇట్లా ఒకటా? రెండా? అన్నీ జగన్ పాలసీలే కొనసాగిస్తున్నారు కదా? కార్యకర్తలకు ఏమీ తెలియదనకుకోవడం భ్రమ. ఇప్పటికైనా కార్యకర్తల కళ్లతో చూసి పాలించండి. అన్నగారు పెట్టిన పార్టీని పదికాలాలపాటు బతకనివ్వండి. మమ్మల్ని గర్వంగా తలెత్తుకునేలా చేయండి. కార్యకర్తల పండగ, పార్టీ ఆత్మవిశ్వాసవేదికయిన మహానాడుకు ముందే మారండి. టీడీపీనే పాలిస్తుందని నిరూపించుకోండి’’
‘‘ జెండాలు మోసిన వాడి చమట వాసన చూశావా? నిద్రలేని రాత్రులు.. వాళ్ల మానసికవేదన మీకు తెలుసా? ప్రాణాలు పోగొట్టుకుంటే సానుభూతి మీడియా ముందు తప్ప వాళ్లకు ఒరిగింది ఏమిటి? మిమ్మల్ని తిట్టినవాళ్లు ఇప్పుడు మీ భుజాలమీదకెక్కారు. మీకోసం ప్రాణాలర్పించినవారు శత్రువులయ్యారు. పంచ్‌గాడికి, శ్రీరెడ్డికి ఏదైనా పదవులివ్వండి. ఎందుకంటే మీరు శాంతికామకులు. గాందీవారసులు’’
‘‘ బాబు గారు, లోకేష్ గారూ ఓసారి ఆలోచించండి. దీనికి కారణం ఏబీఎన్, టీవీ5, సాక్షి, ఎన్టీవీ, టీవీ9 కాదా? రోజూ చర్చలపేరిట జనాలను రె చ్చగొట్టలేదా? వెంకటకృష్ణ నిన్న సన్నాయినొక్కులెందుకు? ఆరోజు భువనేశ్వరి మేడమ్‌ను నీచంగా మాట్లాడితే మీకళ్లవెంట కన్నీరు చూసి కదా కిరణ్‌లాంటి వాళ్లు రెచ్చిపోయింది? మిమ్మల్ని అన్యాయంగా జైల్లో పెట్టారనే కదా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డెక్కి లాఠీదెబ్బలు తింది? మరి ఆరోజే ఇది మా కుటుంబసమస్య అని చెబితే సరిపోయేది కదా? ఇప్పడు మీరు జనం దృష్టిలో గొప్పవారు అనిపించుకునేందుకు కిరణ్‌లాంటి వాళ్లను అరెస్టు చేయించడం అన్యాయం సార్’’
– వైఎస్ భారతీరెడ్డిపై పోస్టింగులు పెట్టిన కరుడుగట్టిన నిరుపేద టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ముసుగేసి అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత.. సోషల్‌మీడియా వేదికగా పసుపు సైనికులు కురిపిస్తున్న నిప్పుల వర్షమిది.
యుగపురుషుడు ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం కార్యకర్తల పండగ.. పార్టీ ఆత్మవిశ్వాసానికి వేదికయిన ‘మహానాడు’కు నెలరోజుల ముందు జరిగిన ఈ పరిణామం పార్టీని కుదిపేస్తోంది. ‘పాము తన పిల్లలను తానే తిన్నట్లు’ అంటూ, కిరణ్ అరెస్టును పోల్చుతున్న పసుపు సైనికుల ఆగ్రహాగ్ని.. నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇది కొద్దిరోజుల క్రితం జీవీరెడ్డి రాజీనామాకు పదింతలకు మించిన స్పందన స్వరంతో, తమ్ముళ్లు నాయకత్వం తీరుపై చిందులుతొక్కుతున్నారు. ‘దీనికోసమేనా పార్టీని అధికారంలోకి తెచ్చింది’? అంటూ అగ్గిరాముళ్లలవుతున్నారు. ఎన్నికల తర్వాత మారిన పార్టీ విధానాలు.. కొత్తగా వచ్చిన నాయకత్వ సిలబస్.. ‘డబుల్ కార్పొరేటీకరణ’.. అవసరార్ధ రాజకీయాలను తూర్పారపడుతున్నారు. దీనికి గుంటూరు కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు కేంద్రబిందువుగా మారింది.
చేబ్రోలు కిరణ్ అనే కార్యకర్త వైఎస్ భారతీరెడ్డిపై అభ్యంతరకర పోస్టింగులు పెడితే, పోలీసులు వాయువేగంతో అతగాడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రంగంలోకి దిగి, అరెస్టు చేసి ముసుగువేసి మరీ జైలుకు పంపించారు. మంచిదే. పోలీసుల దూకుడు మెచ్చదగిందే. చట్టపరంగా కూడా అందులో తప్పేమీలేదు. ఇప్పటివరకూ వల్లభనేని వంశీ, పోసాని మురళీకృష్ణను వివిధ సెక్షన్లకు సంబంధించి అరెస్టు చేసినప్పుడు.. తాజాగా మాజీ ఎంపి ‘జిప్పుల వీరుడు’ గోరంట్ల మాధవ్‌ను అరెస్టు చేసినప్పుడు, పోలీసులు ఇదే పద్ధతి ఎందుకు పాటించలేదు? వారికి ముసుగువేసి మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు? అంటే వారంతా ధనవంతులు, కిరణ్ అనే సామాన్య కార్యకర్త పేదవాడనా? ఇవీ ఇప్పుడు తమ్ముళ్లు చూపుడువేలితో సంధిస్తున్న ప్రశ్నలు.
యుగాలు-తరాలు మారిన తర్వాత, దానికి అనుగుణంగా వెళ్లటం ఎవరికయినా అనివార్యం. అది వ్యక్తులకయినా, వ్యవస్థలకయినా! అవసరాలకు తగ్గట్లు ఏదైనా మార్చుకోవచ్చు. కానీ పార్టీలు రాజకీయాలు మార్చుకోకూడదు. ఎందుకంటే అదొక సిద్ధాంతం. ఎన్టీఆర్ చెప్పిందీ అదే. పదవులు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ సిద్ధాంతం-నమ్మకం అనేవి, పార్టీలకు ప్రాణంతో సమానం. వాటి ప్రాతిపదికగానే కార్యకర్తలు-నాయకులు కొనసాగుతుంటారు.
ఇలాంటి పునాది ఉన్న పార్టీలే చిరకాలం మనుగడ సాగిస్తాయి. ఎప్పుడైతే వీటినుంచి తమ పార్టీ దూరం జరుగుతోందంని కార్యకర్తలు భావిస్తారో, అప్పటినుంచే ఆ పార్టీ కష్టాల్లో పడుతుంది. అది నైతికంగానయినా, రాజకీయంగానయినా! ఇందుకు టీడీపీ సహా ఓ ఒక్క పార్టీ మినహాయింపు కాదు. తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ అయినా, 25 ఏళ్ల క్రితం పుట్టిన బీఆర్‌ఎస్ అయినా ఒక సిద్ధాంతం-నినాదంతో పుట్టి, ఈ స్థితికి వచ్చినవే. ఈ రెండూ మాస్ పార్టీలు. కార్యకర్తల పునాదులు బలంగా ఉన్న పార్టీలు. వాటికి వాళ్లే బలం-బలహీనత!
ఈ రెండు ప్రాంతీయ పార్టీలను మింగేసి, ఆ స్థానం ఆక్రమించాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కారణం ఆ పార్టీల కోసం ప్రాణాలర్పించే కార్యకర్తలు. వాళ్లే ఆ పార్టీలకు రక్ష, భిక్ష. తమ మనోభావాలకు వ్యతిరేకంగా జరిగే ఏ పరిణామాలనూ వారు సహించ లేరు. భరించలేరు. వాటిని ధైర్యంగా ప్రశ్నిస్తారు. అవసరమైతే నాయకత్వాన్నే మార్చేస్తారు. అందుకే టీడీపీకి సంబంధించి.. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు వచ్చారు.
రాజకీయాల్లో గౌరవం-ఆత్మగౌరవం చాలా ముఖ్యం. నాయకులు దానిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకు విరుద్ధంగా జరిగితే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండరు. అది చివరాఖరకు తిరుగుబాటుకు దారితీస్తుంది. అందుకు సంఖ్యాబలం, ధనబలం అవసరం లేదు. ఒక్క పరిణామం చాలు. మొత్తం రాజకీయాన్ని మార్చడానికి! అప్పుడు ఈ పదవులు, పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీ, సెక్యూరిటీ దర్పాలు ఏమీ ఉండవు. నేలవిడిచి సాము చేస్తే వచ్చే కష్టాలివి!
బీజేపీ, వైసీపీ, జనసేనలా ఉండదు టీడీపీ కార్యకర్తల వ్యవహారం. పార్టీ కోసం ప్రాణాలకు తెగించేవారి సంఖ్యకు లెక్కలేని పార్టీ అది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. ఇప్పుడు లోకేష్ చేతికి పరోక్ష పగ్గాలు వచ్చే వరకూ, వేలాదిమంది కార్యకర్తలు కాంగ్రెస్, వైసీపీ ప్రత్యర్ధుల చేతిలో నేలకొరిగారు. వేలాదిమందిపై కేసులు బనాయించారు. మరెన్నో వేలమంది ఆస్తులు పోగొట్టుకుని, బికారులయ్యారు. అయినా ఎదురొడ్డి నిలబడుతున్నారే తప్ప, పార్టీ మారిన దాఖలాలు కనిపించవు. కానీ వారిని చంపించి, వేధించిన నాయకులే, ఆనక టీడీపీలో ఎమ్మెల్యేలు-మంత్రుల అవతారమెత్తుతున్న వైచిత్రి.
అయినా పార్టీని సొంతం చేసుకున్న చరిత్ర టీడీపీ కార్యకర్తది. అలాంటి పోరాటపటిమ ఉన్న కార్యకర్త రెక్కల కష్టం, కేసులకు వెరవక జగన్‌తో యుద్ధం చేసిన వేలాదిమంది సోషల్‌మీడియా సైనికులు, పార్టీకి ఆర్ధికవనరుల మందుగుండు సామాగ్రిని సమకూర్చిన ఎన్‌ఆర్‌ఐ వీరాభిమానుల దన్నుతోనే, టీడీపీ గద్దెనెక్కిందన్నది నిష్ఠుర నిజం.
సూటిగా చెప్పాలంటే..జగన్‌పై విపరీతమైన వ్యతిరేకత.. చంద్రబాబు అరెస్టు, ఓట్లు చీలని కూటమి ఏర్పాటు, ఉద్యోగుల వ్యతిరేకత ఆ అపూర్వ విజయానికి దోహదపడిందనేది మనం మనుషులం అన్నంత నిజం. కానీ దానిని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకున్నా.. ఆ విజయం జగన్‌ను మూకుమ్మడిగా తిరస్కరించిన ప్రజలదే!
టీడీపీని గద్దెనెక్కించేందుకు రోడ్డెక్కి , వైసీపీతో తొడగొట్టి సవాల్ చేసి.. సర్వం నష్టపోయిన సగటు కార్యకర్త, ఇప్పటి పాలన చూసి పెదవి విరుస్తున్నాడు. చంద్రబాబు- లోకేష్‌ను కలవలేని కొత్త అపాయింటుమెంట్ వ్యవస్థలు.. పీఏ-పీఆర్‌ఓల దయాధర్మాల నయా జమానాపై రెప్పలు ఎగరే స్తున్నాడు. కొత్తగా పార్టీ ఆఫీసులో నాయకులను కలిసే స్వేచ్ఛపై ఆంక్షలు విధించడాన్ని భరించలేకపోతున్నాడు.
ఏడాది నుంచి సమూలంగా మారిన సిలబస్‌ను, సీనియర్లు సైతం అర్ధం చేసుకోలేక అయోమయంలో ఉన్నారు. బాబు హయాంలో పడిన కార్పొరేట్ అడుగు, ఇప్పుడు ‘డబుల్ కార్పొరేట్’ అవడం సగటు కార్యకర్తకు నచ్చడం లేదు. ఫలితంగా ‘టీడీపీ నాపార్టీ’ అనుకునే కార్యకర్త కనుమరుగవుతున్నాడు. ఇది మనం మనుషులం అన్నంత నిజం!
పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటేనే రాజకీయం చేస్తారు. అధికారంలో ఉంటే రాజకీయం మర్చిపోతారన్న అపప్రధకు ఇప్పటికీ తెరదించలేకపోతున్నారన్నది తమ్ముళ్ల ఆవేదన. విపక్షంలో ఉంటే కార్యకర్తలే ప్రాణం. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్దిలో పడి కార్యకర్తలను విస్మరించామని చెప్పడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకే పెద్దపీట అని హామీలివ్వడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ యధావిథిగా సీఈఓ అవతారమెత్తడాన్ని సగటు కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఇప్పుడు పేరుకు మాది పొలిటికల్ గవర్నరెన్స్ అని చెప్పడమే తప్ప, అది ఆచరణలో అమలయిన సందర్భం ఒక్కటి కూడా లేదన్నది వారి ఆవేదన. తనను వైసీపీ నేతలు హత్య చేస్తారని అనంతపురం జిల్లాకు చెందిన ఓ కార్యకర్త వీడియో రిలీజు చేసినా ఎవరూ ఖాతరు చేయలేదు. చివరకు ఆ కార్యకర్త అదే వైసీపీ నేత చేతిలో నిహతుడయ్యాడు. పార్టీ కోసం ప్రాణాలర్పించే చేబ్రోలు కిరణ్ లాంటి నిఖార్సయిన కార్యకర్తను అరెస్టు చేశారు. ఇలాంటి చేదు అనుభవాలు రాస్తే రామాయణం. చెబితే మహా భారతం. ఏతావతా ఇవన్నీ పార్టీని నమ్ముకుని, ప్రాణాలర్పించే సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతిని, కాడికిందపడేసేందుకు కారణమవుతాయన్నది నిష్ఠుర నిజం.
జగన్ హయాంలో మంచి పోస్టింగులు అనుభవించి.. టీడీపీని వేధించిన అధికారులకు మళ్లీ రెడ్ కార్పెట్ వేయడం, వాళ్లనే సీఎంఓ, మంత్రుల పేషీల్లో పెట్టుకోవడం, వైసీపీ హయాంలో అన్నీ తామై వ్యవహరించిన మేఘా, షిర్డిసాయి ఎలక్ట్రికల్‌కు తిరిగి పట్టం కట్టడం, గత సర్కారులో పనులు చేసిన కాంట్రాక్టర్లకే వాటిని అప్పచెప్పడం, ఆ పార్టీ నాయకులు చేసిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడం, జగన్ హయాంలో దోపిడీ చేసిన అధికారులను విచారణ పేరిట హడావిడి చేసి, తర్వాత వారిని వదిలేయడం, బాబు కుటుంబాన్ని దారుణంగా విమర్శించి.. చివరకు ఆయన ఇంటిపై దాడికెళ్లిన వారిని, ఏసుప్రభువు సైతం ఈర్ష్యపడే స్థాయిలో క్షమించేయడం వంటి చర్యలు.. ‘ఇకపై పార్టీ జెండా మోయకూడదన్న భావన’ కలిగించేందుకు కారణమవుతున్నాయి.
ఇప్పుడు సోషల్‌మీడియా సైనికులు సంధిస్తున్న పోస్టులే అందుకు నిలువెత్తు నిదర్శనం. బహుశా నిజాలు చెబుతున్న సోషల్‌మీడియా సైనికులను పట్టించుకోకూడదని, నాయకత్వం నిర్ణయించుకోవచ్చు. తాము ఎంచుకున్న అజెండా ప్రకారమే వెళ్లాలని భావించవచ్చు. కానీ సోషల్‌మీడియా సైనికుల పాత్ర ఏమిటన్నది మాత్రం మర్చిపోతే, నష్టం నాయకత్వానికే. బహుశా.. కార్యకర్తలకు ఎంత అసంతృప్తి ఉన్నా, వారు జగన్‌కు మేలు చేసే నిర్ణయాలు తీసుకోరు కాబట్టి, తాము ఏం చేసినా ఫర్వాలేదన్న ధీమా కూడా నాయకత్వ వైఖరికి ఒక కారణం కావచ్చు.
కానీ ఆత్మగౌరవాన్ని మించిన ఆయుధం మరొకటి ఉండదన్నది విస్మరించకూడదు. తమకు నష్టం జరుగుతుంటే దానిని కొనసాగించేందుకు ఎవరూ ఇష్టపడరన్నది మరో ప్రమాదకరమైన ఆలోచన. ఇది కార్యకర్తల మనసుకు తాకితే ఎవరికి నష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదన్నది కార్యకర్తల ఉవాచ.
పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలు దాటుతోంది. ఇప్పటిదాకా నామినేటెడ్ పదవుల ప్రక్రియ పూర్తి కాలేదు. చిన్న చిన్న దేవాలయ కమిటీలు కూడా పూర్తి చేసుకోలేని దుస్థితి. నిజానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. అదే జగన్ వచ్చీ రాగానే ఎన్ని వేల మందికి పదవులిచ్చారు? ఇవ్వాలన్న మనసు, ఇచ్చే గుణం, న మ్మినవారికి న్యాయం చేయాలనే విశాల హృదయం ఇవన్నీ వైఎస్-జగన్‌కు ఉన్నాయి. అవి మన పార్టీలో ఏవీ? అన్న ప్రశ్నలు ఇంకా వినిపించడమే విచారకరం.
నిజానికి ఈ విషయంలో పార్టీ నాయకత్వం పాత పద్ధతులు పాటించకపోవడమే ఆశ్చర్యం. నియోజకవర్గ,జిల్లా స్థాయి పదవులను స్థానికంగా, జిల్లా-నియోజకవర్గ నాయకత్వ అభీష్టానికే వదిలేసేవారు. రాష్ర్టస్థాయి పదవులకు సిఫార్సులు కూడా జిల్లా నాయకత్వాల నుంచి వెళ్లేవి.రాజకీయాల్లో వికేంద్రీకరణ వల్ల వచ్చే లాభాలివి. కానీ ఇప్పుడు అధికారమంతా ఒక్కచోటే కేంద్రీకృతమైనందున, జరుగుతున్న నష్టమిది.
మహానాడు కార్యకర్తల పండుగ. వారి ఆత్మగౌరవానికి అదో మహా వేది . పార్టీ జెండాను భుజం పుండ్లుపడేలా మోసిన కార్యకర్త త్యాగాలు, ఆత్మార్పణ, పోరాటాల స్మృతిచిహ్నం. ఇలాంటి చారిత్రాత్మక సందర్భం.. పార్టీ నాయకత్వ వైఖరి మార్పునకు వేదిక కావాలన్నది, లక్షలాది మంది పసుపుసైనికుల మనోగతం. మరి నాయకత్వ వైఖరి మారుతుందా? కార్యకర్తలే నాయకత్వ ఆలోచనలకు అనుగుణంగా మారాలా? చూడాలి!