– బిచ్చం వేస్తున్నట్లుగా ఒకటి, రెండు పథకాలు
-వైయస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం: బీసీల పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి మోసానికి తెర లేపారని, టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉందంటూ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి సమావేశంలో పచ్చి అబద్ధాలు చెప్పారని తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు, బీసీలను రాజకీయంగా అణగదొక్కడమే లక్ష్యంగా పని చేస్తున్నారని రాజమహేంద్రవరంలో ప్రెస్‌మీట్‌లో శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
బీసీలు ఎప్పటికీ కులవృత్తులకే పరిమితమై, స్థోమత లేని వర్గాలుగానే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి సీఎం చంద్రబాబు. బీసీలు ఎదిగితే తనకు ప్రమాదం అని భావించే వ్యక్తి ఆయన. ఈ సమాజంలో బీసీలు కూడా అందరితో సమానంగా ఎదగాలని, అందుకు విద్య ఒక్కటే మార్గమని మహాత్మా జ్యోతిరావు పూలే నాడు భావించారు.
పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎదిగితే సమాజం పురోగమిస్తుందని నమ్మారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో బీసీల కుల వృత్తులు ప్రోత్సహించి వారిని అణగదొక్కాలన్న మనువాదాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. అందుకే చంద్రబాబు, ఆయన పార్టీ నాడు, నేడు బీసీల వెన్ను విరుస్తోంది.
గత ఏడాది నుంచి ఎందుకు అమ్మ ఒడి అమలు చేయడం లేదు. బీసీలకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యాదీవెన)ను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు. వేల కోట్ల బకాయిలు ఎందుకు పెడుతున్నారు. వసతి దీవెనను ఎందుకు ఆపేశారు?. విదేశీ విద్యా దీవెనకు ఎందుకు మంగళం పాడారు?
నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకుల వంటి కులవృత్తుల వారికి చేదోడు కింద ఏటా రూ.10వేల ఆర్థిక సాయం చేశాం. దాన్ని ఇప్పుడు ఎందుకు ఆపేశారు? 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత ద్వారా నాలుగేళ్లలో రూ.75 వేలు సాయం చేశాం. చేనేతలకు నేతన్న నేస్తం కింద ఏటా రూ.24వేలు ఇచ్చాం. చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు, ప్రత్యేకంగా మత్స్యకార భరోసా కింద సాయం చేశాం.
సన్న, చిన్నకారు రైతుల్లో ఎక్కువ మంది బీసీలే. రైతు భరోసా ఇవ్వకుండా వారినీ మోసం చేశారు. ఇన్ని చేసిన మీరు, బీసీలను ఎలా ఉద్ధరించినట్లు? వారికి ఎలా మేలు చేస్తున్నట్లు?. పైగా బీసీల మీద వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు నటించడం దౌర్భాగ్యం.