– ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
– ఖనిజ, బొగ్గు రంగానికి సంబంధించి విజనరీ రోడ్ మ్యాప్
– తాజ్ హోటల్‌లో జరిగిన 12వ కోల్ బ్లాక్ వేలం కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
ఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో 1 బిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకున్న చరిత్రాత్మక సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాదితో కోలిండియా 50వ వసంతంలోకి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175వ వసంతంలోకి అడుగు పెట్టిన మరో అద్భుత ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ విజయాలన్నీ గత పదేళ్లలో తీసుకున్న అద్భుతమైన పాలసీలు, సమష్టి కృషి కారణంగానే సఫలమైంది.
ఒకప్పుడు అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బొగ్గు రంగం.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అధునాతనంగా, పారదర్శకంగా మారి కొత్త పుంతలు తొక్కుతోంది. 2015లో వేలం ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రైవేటు రంగం భాగస్వామ్యం, నూతన సాంకేతికత సాయంతో ఈ రంగం ముఖ చిత్రమే మారిపోయింది. ఇప్పటివరకు 125 బొగ్గు బ్లాకులను 11 దశల్లో విజయవంతంగా వేలం వేశాం. వీటిలో ప్రైవేటు రంగం కూడా భాగస్వామ్యం అయింది.
ఈ వేలం ద్వారా ఏకంగా రూ.40,960 కోట్లు పెట్టుబడులు వస్తాయి. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. ఇవాళ 12వ ట్రాంచేలో భాగంగా 28 బొగ్గు, లిగ్నయిట్ బ్లాకులకు వేలం నిర్వహించాం. ఈ వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు దిగుమతులు తగ్గడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడి, ఆత్మనిర్భర భారత్‌కు అసలైన నిర్వచనం ఇస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఉద్యోగాల కల్పన, సరుకు రవాణాకు ఈ రంగం ఊపిరులూదుతోంది. దీంతో జాతీయ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. వేలం ప్రక్రియ ద్వారా ప్రైవేటు రంగ సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడుతున్నాయి. దీంతో PSUల సమర్థత కూడా పెరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేందుకు దోహదపడుతుంది.
మహాకుంభ మేళా సందర్భంగా ఎన్ని అవాంతరాలు ఏర్పడినా బొగ్గు రంగం.. నిరంతరం శ్రమించి, దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా చేసి, అన్ని రంగాల విద్యుత్ అవసరాలను తీర్చింది. ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా ఉత్పత్తి, స్టీలు రంగాల 72 శాతం విద్యుత్ అవసరాలను బొగ్గు తీరుస్తోంది. ఈ నేపథ్యంలో పర్యవారణానికి ఇబ్బంది కలగకుండా సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
2025 కేంద్ర బడ్జెట్‌లో దేశ ఖనిజ, బొగ్గు రంగానికి సంబంధించి విజనరీ రోడ్ మ్యాప్ రూపొందించాం. వ్యాపార అవకాశాలు, సృజనాత్మకత పెంపొందించేందుకు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మైనింగ్, బొగ్గు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్, గనులను సొంతం చేసుకున్న వారి కోసం ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్, గనులకు స్టార్ రేటింగ్ వ్యవస్థ కూడా తీసుకొచ్చాం.
2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. కోల్, లిగ్నయిట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూ.8 వేల కోట్లతో ఇన్సెంటివ్ స్కీం తీసుకొచ్చాం. సుస్థిరమైన మైనింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు నూతన విధానాలు అవలంబిస్తూ, నూతన సాంకేతికతలను వినియోగిస్తున్నాం. గత పదేళ్లలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా వేలం ప్రక్రియలో తొలిసారిగా బిడ్డింగ్ వేసిన 5 కంపెనీలు గనులను సొంతం చేసుకున్నాయి.
అయితే గనులను సొంతం చేసుకున్న సంస్థలు త్వరితగతిన మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించడం చాలా కీలకం. మైనింగ్ ప్రక్రియ వేగవంతంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. అనుమతుల ప్రక్రియ సజావుగా, వేగంగా జరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం.
బొగ్గు గనుల్లో పెట్టుబడులు పెట్టడమంటే భారతదేశ ఎనర్జీ భవిష్యత్తు, ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పనలో పెట్టుబడులు పెట్టడమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నాను.