ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరడం దేశద్రోహమా?

-ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారే దేశద్రోహులు
-పార్లమెంట్లో ప్రతిపక్షం లేకుండా చేయాలని బిజెపి కుట్ర
-బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలను ఖండించిన భట్టి విక్రమార్క

దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరడం దేశద్రోహం అవుతుందా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారే దేశద్రోహులు అవుతారని బిజెపి నాయకులపై భట్టి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కై భట్టి విక్రమార్క చేపట్టిన మూడోరోజు పాదయాత్ర శనివారం రోజున ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం కొండాపూర్ నుంచి ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్, కేస్లాపూర్ ముత్తునూర్ ఇంద్రవెల్లి మండల కేంద్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాదయాత్రకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికి వారి సమస్యలను విన్నవించారు. రాత్రి ఇంద్రవెల్లి వద్ద కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. జాతీయ వ్యతిరేక సాధన సమితిలో రాహుల్ గాంధీ శాశ్వత భాగం అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, భావ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని చర్చించే వ్యక్తులు దేశ వ్యతిరేకులు ఎలా అవుతారని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న మోడీ పాలనలో నిజమైన దేశభక్తులు ప్రజాస్వామ్యవాదులు నలిగిపోతున్నారని అన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, బావా స్వేచ్ఛ ను హరించాలని కోరుకునే బిజెపి నేతలు దేశ ప్రేమికులు ఎప్పుడు కూడా కారని, వారు దేశభక్తులుగా ఎలా పిలవబడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా సస్పెన్షన్ చేయాలనుకోవడం మోడీ నియంతృత్వ పరిపాలనకు నిదర్శనం అవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకునే రాహుల్ గాంధీని పార్లమెంట్లో లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు ఎదురిస్తారని, అవసరమైతే తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రజల గొంతుగా తన వానిని వినిపిస్తున్నాడని, రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని మోడీ ప్రభుత్వం ఆయనను పార్లమెంట్లో ఉండకుండా చేయాలనే దుష్ట ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. దేశాన్ని విచ్చినం చేసి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్న పాలకులే నిజమైన దేశ ద్రోహులని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అసలైన సిసలైన ప్రజాసామిక వాదులను జైలుకు పంపాలని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టి దేశభక్తులైన ప్రజలు ఈ దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మంత్రి రాజీనామా చేయాలి అధికారులను సస్పెండ్ చేయాలి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సమంత మంత్రి తక్షణమే రాజీనామా చేసి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో లేక లేక ఒక నోటిఫికేషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా పరీక్షలు నిర్వహించడంలో వైఫల్యం చెందడం వల్ల ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్న నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితిని తీసుకువచ్చిందన్నారు. సిరిసిల్లలో నిరుద్యోగి చేసుకున్న ఆత్మహత్య ప్రభుత్వ హత్యని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో లక్షల కొలది ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్న భర్తీ చేయకుండా దున్నపోతు వలె నిద్రపోతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం పై విద్యార్థులు నిరుద్యోగులు తిరగబడి ప్రభుత్వం మేల్కొనే విధంగా పోరాటం చేయాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు భాగస్వాములు కావడం వల్లే పేపర్ లీకేజ్ జరిగినట్టు దర్యాప్తు సంస్థల విచారణ బట్టి అర్థమవుతుందన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఖానాపూర్ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో సాగునీరు అందించడానికి చీకుమాన్, త్రివేణి సంగమం, పులిమాడుగు వాగుపై సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం చేసి సస్యశ్యామలం చేస్తామని రైతులకు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. 12వేల ఎకరాలకు సాగునీరు అందించే చికుమన్ ప్రాజెక్టు నిర్మించి కాలువలు తవ్వకపోవడం దౌర్భాగ్యం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీని ఇచ్చారు.

నాగోబా దేవాలయం సందర్శన
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా దేవాలయాన్ని భట్టి విక్రమార్క దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధానమండపంలో ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అందుకోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని తన పాదయాత్రకు పెద్ద ఎత్తున కదిలి వచ్చి కదం తొక్కినందుకు కృతజ్ఞతలు చెప్పారు.