– ఇండియాటుడే సర్వేలో కనిపించని జగన్ ర్యాంకు
– నెంబర్ వన్ స్థానంలో నవీన్ పట్నాయక్
– తర్వాత స్థానాల్లో యోగి, హిమంతబిశ్వ శర్మ, పటేల్, మాణిక్ సాహా
– సంక్షేమ పథకాలిస్తున్నా జగన్ పేరు కనిపించదేం?
– ఐదవ స్థానంలో కూడా కనిపించని జగన్ పేరు
– లబ్థిదారులు జగనన్నకు పాసు మార్కులు కూడా ఇవ్వలేదా?
– 90 శాతం సంతృప్తికర స్థాయి ఉన్నా ర్యాంకేదీ?
– బటన్లు నొక్కుతున్నా ఫలితం లేనట్లేనా?
– చెవిరెడ్డి-ఐప్యాక్ సర్వేలన్నీ ఉత్తివేనా?
– ‘సిద్ధం’ అని చెప్పినా సర్వేలో స్పందించని జనం
– ఇండియాటుడే సర్వే ప్రకారం మేలు జరగలేదని జనం భావిస్తున్నారా?
– సంక్షేమపథకాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా?
– పడిన కష్టం వృధా అని వైసీపీ వర్గాల నిరాశ
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘మనకు 90 శాతం ప్రజల్లో సంతృప్తస్థాయి ఉంది. 58 శాతం ఓటింగ్ మనవైపే ఉంది. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలిస్తున్నాం. అక్కాచెల్లెమ్మలు-అవ్వాతాతలు-నా మేనల్లుళ్లు అంతా మనవైపే ఉన్నారు. కాపు-కమ్మ-బ్రాహ్మణ-వైశ్య వర్గాలు మినహా అన్ని వర్గాలూ మనవైపే ఉన్నాయి. కాబట్టి మీరేం భయపడాల్సిన పనిలేదు’’ – ఇదీ తన వద్దకు వచ్చే పార్టీ ప్రముఖులకు, తన వద్ద చెవిరెడ్డి-ఐప్యాక్ ఇచ్చే నివేదికను చూపిస్తూ వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ చెప్పే మాటలు.
వచ్చే ఎన్నికల్లో ఎవరెంతమంది కలసి వచ్చినా గెలుపు మాదే. పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుందని, వైసీపీ నేతలు తరచూ వేదికలపై చెప్పే ఉపన్యాసం ఉత్తిదేనా? దేశంలో ఏ సీఎం ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అని శోషవచ్చేలా ఎంత మొత్తుకుంటున్నా, జనం జగన్‌ను పాపులర్ సీఎం అన్న మార్కులు ఇవ్వడం లేదెందుకు? అందుకే జగనన్నకు పాపులర్ సీఎం సర్వేలో కనీసం ఐదో స్థానం కూడా దక్కలేదా? తాజాగా ఇండియాటుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాల తర్వాత, వైసీపీ వర్గాల ఆవేదనతో కూడిన ఆందోళన ఇది.
తాజాగా ఇండియాటుడే ‘మూడ్‌ఆఫ్ ది నేషన్’ పేరుతో.. ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై ఒక సర్వే నిర్వహించింది. అయితే అందులో సంక్షేమ పథకాల కోసం, యధేచ్చగా బటన్లు నొక్కుతున్న ఏపీ సీఎం జగన్ పేరు.. కనీసం ఐదవ స్థానంలో కూడా కనిపించకపోవడం, వైసీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇండియాటుడే సర్వేలో.. దేశంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న సీఎంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు మొదటి స్థానం లభించింది. 52.7 శాతం రేటింగ్‌తో పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు.
మొదటి స్థానం లభించిన నవీన్ పట్నాయక్.. ఏపీ సీఎం జగన్ మాదిరిగా ఏమీ బటన్లు నొక్కరు. ఎక్కువగా బహిరంగసభలకు వెళ్లరు. విదేశీయాత్రలు కూడా పెద్దగా చేయరు. అలాగే ఆయన- బిజూ జనతాదళ్ నాయకులు గానీ, మంత్రులు గానీ రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి విపక్షాలను తిట్టిపోయరు. విపక్షాలపై అక్రమ కేసులు పెట్టి, దాడులు చేసే పనిలో ఉండరు. ఐఏఎస్-ఐపిఎస్ అధికారులను అడ్డగోలుగా వాడుకోరు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ప్రచారం చేసుకోరు. కేవలం పరిపాలనకే పరిమితమవుతారు. అయినా ఆయనకు మొదటి స్థానం రావడమే విశేషం. ఇదే ఇప్పుడు వైసీపీ వర్గాలకు మింగుడుపడకుండా ఉందట.
ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్‌కు 51.3 రేటింగ్‌తో రెండవ స్థానం దక్కింది. యోగి కూడా ప్రభుత్వ డబ్బుతో మీడియాలో సొంత ప్రచారం చేసుకోరు. అవసరమైనప్పుడు మాత్రమే ఆయన, మంత్రులు మీడియా ముందుకు వస్తారు. అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ.. అవినీతిపరులు, రౌడీలు-గూండాలకు యోగి సింహస్వప్నం. ఫిర్యాదు అందిన వెంటనే కొరడా ఝళిపించే సీఎంగా పేరు.
చివరాఖరకు తప్పు చేస్తే ఐఏఎస్-ఐపిఎస్‌లనూ వదలిపెట్టని, కఠిన సీఎంగా ప్రతిష్ఠ. ప్రభుత్వంలో పాతుకుపోయిన అవినీతి-అలసత్వం- ప్రజాజీవనాన్ని ఆటంకపరిచే సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపిన యోగికి, రెండో స్థానం లభించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
అలాగే సత్వర నిర్ణయాలు తీసుకుని, రాజకీయ ప్రత్యర్ధులను దునుమాడే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు మూడు, గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్, త్రిపుర సీఎం మాణిక్ సాహాకు నాలుగు-అయిదు స్థానాలు లభించాయి. అయితే ఉద్యోగులకు సక్రమంగా జీతాలివ్వకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, రోడ్లు బాగుచేయకుండా, అన్ని వర్గాల ఉసురుపోసుకుని, ప్రతి నెలా సంక్షేమ పథకాలకోసం.. బటన్లు నొక్కుతున్న తమ సీఎం జగన్ పట్ల, లబ్థిదారులు కనీస స్పందన లే కపోవడం, వైసీపీ వర్గాలను విస్మయపరుస్తోంది.
లేకపోతే ఇండియాటుడే సర్వే ఫలితాలు, అంత దారుణంగా ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తమ నేత అందిస్తున్న సంక్షేమపథకాలకు.. సర్వేలో జగనన్నకు మొదటి స్థానం దక్కాలని, కానీ మొదటి ఐదు స్థానాల్లో ఆయన పేరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడం బట్టి, క్షేత్రస్థాయిలో ఏదో తేడా కొడుతున్నట్లు స్పష్టమవుతోందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా టుడే సర్వే సందర్భంలో.. సహజంగా సీఎంగా జగన్ పనితీరును ప్రశ్నిస్తారని, కనీసం అప్పుడు కూడా లబ్థిదారులు జగన్ గురించి గొప్పగా చెప్పలేదని, సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. అంటే దీన్ని బట్టి తమ అధినేత.. తన ఏకపక్ష వైఖరి మార్చుకోవాల్సి ఉందని అర్ధమవుతోందని, సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
చెవిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సర్వేలన్నీ, తప్పులతడక అన్న వాస్తవం ఇండియాటుడే సర్వేతో స్పష్టమయిందని, వైసీపీ సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. ‘‘రోజూ చెవిరెడ్డి-ఐప్యాక్ మా సీఎంకు అందించే నివేదికలన్నీ తప్పులని, ఆయనను మెప్పించేందుకు ఇస్తున్నవేనని ఇండియాటుడే సర్వే స్పష్టమయింద’’ని ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారు జగన్‌ను గుర్తించకపోగా.. వారి కోసం ఇతర వర్గాలను నిర్లక్ష్యం చేసినందుకు, తమ పార్టీ రెండు విధాలా నష్టపోతోందన్న వాస్తవాన్ని, సర్వే ఫలితాలు స్పష్టం చేశాయని విశ్లేషిస్తున్నారు. ఇక వందలకోట్లతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచారం కూడా పనిచేయడం లేదని, నిజంగా అలా పనిచేసి ఉంటే జగన్‌కు సర్వేలో, కనీసం మూడోస్థానమైనా దక్కాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు.
‘ఇండియా టుడే సర్వే క్షేత్రస్థాయిలో పనిచేసే మాలాంటివారికి గుణపాఠం. మా సంక్షేమ పథకాలేమీ ప్రజలను మెప్పించలేకపోతున్నాయని తేలిపోయింది. వందల కోట్లతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వల్ల ఫలితం లేదని స్పష్టమయింది. ప్రజలకు కావలసింది సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి కూడా అనేది అర్ధమయింది. మరి వీటిని మా నాయకుడు పాజిటివ్‌గా తీసుకుంటారో, నెగటివ్‌గా తీసుకుంటారో, అసలు దీనిపై సలహాదారులు ఆయనకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తారో తెలియదు. మాకైతే సంక్షేమపథకాలు అందుకున్న లబ్థిదారులంతా, మా పార్టీకి ఓటు వేయరన్న విషయమైతే అర్ధమయింది’’ అని గతంలో టీడీపీలో పలు కీలక పదవులు పొందిన, గుంటూరు జిల్లాకు చెందిన ఒక వైసీపీ సీనియర్ నేత స్పష్టం చేశారు.